Sunday, April 26, 2026
E-PAPER
Homeదర్వాజకామకళాశాస్త్ర గ్రంథాల పరిచయం - చరిత్ర

కామకళాశాస్త్ర గ్రంథాల పరిచయం – చరిత్ర

- Advertisement -

ఆధునిక విమర్శకులు, పరిశోధకులు పెక్కురు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకొని, వాత్స్యాయనుడు కామసూత్రములను రచించినాడని తీర్మానించారు. అర్థశాస్త్రపు తొలి సంపాదకుడు రుద్రపట్నం శ్యామశాస్త్రి కౌటిల్యుని రచనలోనూ, వాత్య్సాయనుని కతిలోనూ ప్రయోగింపబడిన ఒకే రకపు పారిభాషిక శబ్దాలను, సమస్త పదాలను ఉదాహరించిన తీరును గమనిస్తే ,అర్థశాస్త్రం ముందుది. కామసూత్రాలు పిదపవి అని తేటతెల్లం అవుతుంది. కౌటిల్యుని అర్థశాస్త్ర రచన ప్రణాళికను వాత్స్యా యనుడు చక్కగా, చొక్కంగా అనుసరించాడు. కనుక కామసూత్రాలు క్రీస్తుశకం రెండవ శతకపు పూర్వార్ధం లోనిదని నిర్ధారించారు. ఈ రెండు గ్రంథాలలోని పోలికలను గమనించిన కొందరు అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడే, గోత్రనామమైన వాత్స్యాయనుడు పేరుతో కామసూత్రాలను రచించినాడనే వాదనలను ముందుకు తెచ్చినారు.

కామసూత్రములు పిదప అత్యంత విస్తత ప్రచారం పొందిన కామశాస్త్ర రచన కొక్కోకుని కామకేళి రహస్యం అనబడే రతిరహస్యమ్‌. కొక్కోకుని రచనకు పదులకొద్దీ వ్రాతప్రతులు దేశమంతటా లభ్యమవుతున్నవి. తిరువనంతపురంలోని రాతప్రతుల భాండాగారంలోని కొన్ని ప్రతులలో ” ఇతి సిద్దవటీయ కొక్కోకకవి విరచితే” అని సహజము, శుద్ధము, స్వాభావ్యము ఆగు పాఠము లభించుట మూలమున పండిత కొక్కోక కవి ఆంధ్రదేశంలోని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాయలసీమలోని సిద్ధపటం వాసి అని రూఢయీగుచున్నది.

”నాగర సర్వస్వం ”కర్త పద్మశ్రీ అనే బౌద్ధుడని చెప్పబడుచున్నది. కానీ పద్మశ్రీ జ్ఞాన బౌద్ధ ఉపాసకుడా లేక బౌద్ధ బిక్షువా అనే విషయంలో స్పష్టత లేదు. కాలము కూడా అనిశ్చితమే. కానీ విమర్శకులు క్రీస్తు శకము 1000 ప్రాంతం వాడని భావిస్తున్నారు. వాసుదేవుడనే బ్రాహ్మణ పండితుని ప్రోద్బలంతో ”నాగర సర్వస్వం” వ్రాసినానని చెప్పుకున్నారు. 16వ శతాబ్ది పూర్వార్ధం వాడైన కళ్యాణమల్లుడు రచించిన ”అనంగరంగం” 10 స్థలాల కతి. కళ్యాణమల్లుడు అయోధ్య పాలకుడైన లాడ్‌ ఖాన్‌ లోడి మంత్రి. తన పాలకుడి వినోదార్థం ”అనంగరంగం” రచించినట్లు చెప్పుకున్నాడు. ఈ పుస్తకాలన్నీ తెలుగులో ఎప్పుడో ప్రచురితమైనవి.
తెలుగులో కూచిరాజు ఎర్రయ్య విరచిత కొక్కోకం, నెల్లూరు శివరామకవి కామకళానిధి, ముష్టిపల్లి సోమభూపాలుని ఆంధ్ర రతి రహస్యము – కామశాస్త్రపు ముద్రిత రచనలు. వీరందరూ మూల గ్రంథములలోని అపపాఠములను పరికింపక తెనిగించినందున, రచనల ప్రామాణికతపై సందేహములున్నవి.

వాత్స్యాయన కామసూత్రాలను మొదటగా పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి (1924) అనువదించారు. ఇప్పటికీ ఈ అనువాదం ప్రామాణికంగా ఉందనే కొనియాడతారు. తర్వాత కొత్త సత్యనారాయణ చౌదరి (1932), ధనికొండ హనుమంతరావు (1962), రెంటాల గోపాలకష్ణ (1986) చేసిన అనువాదాలు పుస్తక రూపంలో బయటకు వచ్చాయి. వాత్స్యాయన కామ సూత్రాలలో పరిశోధన- విభజన శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఉండటంతో తర్వాత కాలంలో వచ్చిన అనేకానేక సంస్కత, ప్రాకత కామకళా గ్రంథాలు అన్నీ, దాని ఆధారంగానే రూపొందింపబడినాయి. సంక్షిప్త అనుసరణలు కూడా ఎన్నో వచ్చినాయి. అలాంటి వాటిలో రతి మంజరి జయదేవుని (గీతా గోవింద కర్త కాదు) 60 శ్లోకాల సుందర లఘుకతి ఒకటి. ఇంత బుల్లి రచన కామశాస్త్ర పరంపరలో లేనే లేదు. ప్రస్తుత గ్రంథమైన మదనాగమము కూడా అలాంటి కోవకు చెందినదే. పరిశోధకుడు భాగవతం రామారావు వారణాసిలోని సరస్వతీభవన్‌ గ్రంథాలయంలోని రాతప్రతుల పట్టికను తిరగవేస్తున్నప్పుడు, తెలుగు లిపిలో పేర్కొనబడిన ఈ వ్రాతప్రతి కనిపించగా ఆసక్తిగా తెప్పించుకుని చూశారు. అదే ఈ మదనాగమము. ఇది కాగితపు రాతప్రతి 22 పేజీలలో ఉన్నది. అక్షరాలు బాగున్నాయి. మదనాగమము కర్త గురించి కానీ, వ్యాఖ్యాత గురించి కానీ వివరాలు లేవు. ఇద్దరూ ఒకరో కాదో కూడా తెలియదు. ఇంకెక్కడ దీని ప్రతులు ఉన్నట్లు తెలియలేదు. దొరికిన ఒకే ప్రతి తెలుగులో ఉన్నందున కర్త, వ్యాఖ్యాత తెలుగువారనే భావించవచ్చు.

”మదనాగమము” పుస్తకం 165 శ్లోకాల లఘు సురతబంధ కామశాస్త్రగ్రంథం. తనకు పూర్వం ఉన్న కామశాస్త్రముల సారాన్ని సంగ్రహించి వ్రాస్తున్నానని రచయిత వక్కాణం. శృంగార రసాన్ని ఎల్లప్పుడు ఆస్వాదిస్తున్నా, తృప్తి పొందని వారి కొరకు ఈ మదన గమము వ్రాయనైనది అని కృతికర్త మాట. చేప ధ్వజంగా కలిగిన వాడు, విరహంలోనున్న వారికి యముడునైన మన్మధునికి నమస్కారం అంటూ మన్మధ స్తుతితో ఈ కావ్యాన్ని ప్రారంభించారు. ఇందులో అధికకామం కలిగిన స్త్రీల లక్షణాలు, ద్రావణ లక్షణం, కపటస్త్రీ లక్షణం, పరకీయ లక్షణం, సమసంభోగ లక్షణం, 84 బంధాలు, స్త్రీ జాతులు, కళాస్థానాలు, స్త్రీ పురుష గుహ్యాంగ లక్షణాలు, నాయికా భేదాలు గురించిన వివరణ మదనాగమములో ఉన్నది. మదనాగమము సంప్రయోగ పద్ధతులకు ప్రాముఖ్యత ఇచ్చిందని తెలియజేయడం విశేషం.
ఇంతవరకు అలభ్యంగా ఉన్న ఈ వ్రాతప్రతిని వెతికి పట్టుకొని పరిష్కరించి, తెలుగు పాఠకులకు అందజేస్తున్న భాగవతం రామారావు గారి కషి ప్రశంసనీయం. ఈ సంస్కత గ్రంధాన్ని తెలుగులోకి అనువదించిన తీరు బాగుంది. దీనికి తోడుగా సంస్కత, ప్రాకత, భారతీయ భాషలలోని కామకళా గ్రంథాల విశ్లేషణను, సుదీర్ఘమైన పీఠిక రూపంలో అందజేయడం సమాచారాత్మకంగాను, విజ్ఞానాత్మకంగాను ఉన్నది.

– కె.పి.అశోక్‌
కుమార్‌
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -