Wednesday, April 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబస్తాలు లేవు..లారీలు రావు

బస్తాలు లేవు..లారీలు రావు

- Advertisement -

చిక్కుల్లో మక్క రైతు
పరపతి ఉంటేనే సంచులు
రైతులనే కొనుక్కోమంటున్న పీఏసీఎస్‌ల సిబ్బంది
కొనుగోలుకు కేంద్రం నిరాకరణ
బస్తా రూ.30 వెచ్చించి కొందామన్నా దొరకని దుస్థితి
అందుబాటులో లేని హమాలీలు, లారీలు
పెట్రోల్‌ బంకుల మూసివేతతో నిలుస్తున్న రవాణా
గోదాంల వద్ద తరుగు తీస్తున్న అధికారులు
అమ్మబోతే అడవి చందంగా..అన్నదాతల ఆవేదన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

మొక్కజొన్న రైతుల దీనావస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అమ్మబోతే అడవి చందంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 20వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవటం ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికీ రైతుల అవస్థలను దరిచేర్చలేకపోతోంది. యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవటంతో మొక్కజొన్నల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. కానీ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అత్యధిక విస్తీర్ణంలో రైతులు మక్క సాగు చేశారు.
గతంలో యాసంగి సీజన్‌కు గరిష్టంగా 3 లక్షల ఎకరాల వరకూ వేసేవారు. మిగిలిన పంటలు ఆశాజనకంగా లేకపోవటంతో ఇప్పుడు 11 లక్షల ఎకరాల్లో సేద్యం చేయటంతో విపరీతమైన దిగుబడులు వచ్చాయి. ఎకరానికి 30నుంచి 40 క్వింటాళ్ల పంట పడింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2.43 లక్షల ఎకరాల్లో ఈ రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు చేశారు. కోతలు పూర్తయ్యి పంట కొనుగోలు కేంద్రాలకు తరిలించిన ప్రస్తుత తరుణంలో రైతాంగం అవస్థలు ఎదుర్కొంటోంది. రైతుల ఒత్తిడితో కేంద్రాలు తెరిచినా ఎక్కడా కొనుగోళ్లు సక్రమంగా సాగుతున్న పరిస్థితి లేదు. ఒక్కో కేంద్రంలో క్వింటాళ్ల కొద్దీ పంట నిల్వ ఉంది.

బస్తాల చిక్కుముడులు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొరత తీవ్రంగా ఉంది. గన్నీ బ్యాగ్‌లు లభించక రైతులు కేంద్రాల్లో గింజలు ఆరబోసి ఎదురుచూడాల్సి వస్తోంది. పరపతి ఉన్నవారికే బస్తాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అధికార పార్టీకి చెందిన రైతులకు మాత్రమే బస్తాలు ఇస్తున్నారనే ఆరోపణలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే.. పీఏసీఎస్‌ సిబ్బంది తమకున్న ఒత్తిడి గురించి చెబుతున్నారు. తాము చెప్పినవారికే ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో బస్తా రూ.30 వెచ్చించి తెచ్చినా.. దానికి వెచ్చించిన డబ్బులను ఎవరు భరించాలనేది సందిగ్ధంగా ఉంది. దీనిపై మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌లను ప్రశ్నించినా నోరుమెదపటం లేదు.

లారీల ట్రబుల్‌
బస్తాలు తెచ్చుకొని తూకాలు పెట్టినా లారీల సమస్య ఉంది. యుద్ధం కారణంగా డీజిల్‌ కొరత ఏర్పడి బంకులు మూసేయటంతో లారీలు వచ్చే పరిస్థితి లేదు. రైతులు రికమండేషన్‌ చేసుకుని డీజిల్‌ కొట్టించి లారీలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా లారీ డ్రైవర్‌ బస్తాకు రూ.6-10 ఇవ్వాలని మొండికేస్తున్నారు. చేసేదిలేక రైతులు అందుకు ఒప్పుకుంటున్నారు.

కౌలు రైతులకు బయోమెట్రిక్‌ ఇబ్బందులు
రాష్ట్రంలో దాదాపు 30-40 శాతం మంది కౌలు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ కార్డులు లేవు. మార్క్‌ఫెడ్‌ పట్టాదారులు బయోమెట్రిక్‌ వేస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధన పెట్టడంతో దూరప్రాంతాల్లో ఉంటున్న భూ యజమానిని రప్పిస్తున్నారు. ఓవైపు బయోమెట్రిక్‌ నిబంధన లేదని ప్రభుత్వ అనుకూల రైతునేతలు ప్రకటిస్తున్నా.. ఎక్కడా అదీ అమలు కావటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

గోదాంల వద్దా తిరకాసు
చివరకు పంటను గోదాంల వద్దకు చేరిస్తే అక్కడ కూడా తిరకాసు పెడుతున్నారు. సరుకులో నాణ్యత లేదని, గోదాంలు ఖాళీ లేవని చెప్పి తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా నుంచి లారీలు సూర్యాపేట జిల్లాకు వెళ్తున్నాయి. అక్కడకు వెళ్లిన పలు లారీలను నాణ్యత లేమి పేరుతో తిరస్కరించారు. చేసేది లేక మిర్యాలగూడకు రైతులు తీసుకెళ్తే అక్కడి గోదాంల సిబ్బంది క్వింటాల్‌కు 2-10 కేజీలు తరుగు తీస్తామంటున్న స్థితి ఉంది.

అమ్మినా ఖర్చులు సహా డబ్బులు వచ్చేనా..?
అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మొక్కజొన్నలు అమ్మినా ఇప్పటికే కేంద్రం చేతులెత్తేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు ఇప్పిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇచ్చినా ఖర్చులతో సహా ఇప్పిస్తారా? లేదా అనేది సమస్య. ఇప్పుడు బస్తాలు కొని తెచ్చుకోమంటున్నారు. ఇబ్బందులు ఎందుకని ప్రయివేటు వ్యాపారుల వైపు మొగ్గుచూపుతున్నారు. క్వింటా రూ.1600కే విక్రయిస్తూ.. ఒక్కో క్వింటాపై రూ.800 వరకూ నష్టపోతున్నారు.
బస్తాల కొరత లేదు : దివాకర, ఖమ్మం జిల్లా కలెక్టర్‌
ఖమ్మం జిల్లాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, డీజిల్‌ కొరత విషయమై ‘నవతెలంగాణ’ కలెక్టర్‌ దివాకరను ప్రశ్నించగా.. జిల్లాలో 48 లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే, డీజిల్‌ కొరత లేకుండా 110 లోడ్‌లు సోమవారం సాయంత్రానికి తెప్పించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -