Wednesday, April 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిముందు నుయ్యి, వెనక గొయ్యి - దిక్కుతోచని ట్రంప్‌

ముందు నుయ్యి, వెనక గొయ్యి – దిక్కుతోచని ట్రంప్‌

- Advertisement -

అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం మొదలై నేటికి రెండునెలలు దాటిపోతోంది. కాల్పుల విరమణ, పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంలో శాంతి చర్చల ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అవి కొలిక్కి రావటం అంత తేలిగ్గా జరిగేట్లు లేదు. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు, మూడు దేశాలకు లేక గల్ఫ్‌ దేశాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలు ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలలో కూరుకుపోయి, ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ఫిభ్రవరి 28న ఇరాన్‌ అగ్రనాయకులంతా సమావేశమై ఉన్న భవనంపైన అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు కుట్రపూరితంగా దాడిచేసి ‘సుప్రీం లీడర్‌ ఖొమైనీ’ సహా నలభై మందికి పైగా అగ్ర నాయకులను హతమార్చారు. అంతకు ముందే వెనిజులాపై దాడిచేసి అధ్యక్షుడు ‘మధురో’ను ఆయన భార్యను అమెరికా కిడ్పాప్‌ చేసింది. ఇలా చేయటం ఆ దేశాల సార్వభౌమత్వాన్ని తిరస్కరించటమేగాక, ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ప్రకారం యుద్ధ నేరం కూడా. ఇరాన్‌లో పరిపాలన మార్చి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పర్చటం, ఇరాన్‌లో తయారవుతున్న అణు ఇంధనం యురేని యంను స్వాధీన పర్చుకోవటం, అమెరికా వ్యతిరేక గ్రూపులుగా వివిధ దేశాలలో పనిచేస్తున్న హిజుబుల్లా, హమాస్‌, హౌతీలకు ఇరాన్‌ సహాయాన్ని నియంత్రించటం ఈ యుద్ధం లక్ష్యంగా అమెరి కా ప్రకటించింది.

ఇప్పటి వరకూ రెండు నెలలపాటు సాగిన యుద్ధంలో చట్ట విరుద్దమైన ఈ లక్ష్యాలలో ఏ ఒక్కదాన్నీ అమెరికా సాధించలేక పోగా అవమానకరమైన పరాజయాలు ఎదుర్కొంటోంది. నాయకుల హత్యాకాండతో, వైమానిక దాడులతో ఇరాన్‌ లొంగిపోతుందని అమెరికా అంచనా వేసింది. కానీ అలా జరగలేదు. ఇరాన్‌ అసాధారణమైన ధైర్యసాహాసాలతో ప్రతిఘటన ప్రారంభించింది. గల్ఫ్‌ దేశాలలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేయటంతోపాటు, మిసైల్‌ దాడులతో ఇజ్రాయిల్‌ను కకావికలం చేయగలిగింది. యుద్ధంలో ఇరాన్‌ గెలుస్తోంది అని ప్రపంచం అంతా భావిస్తున్న సమయంలో ఆ అవమానానికి భయపడిన అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ ప్రతిపాదించిన పది అంశాల ప్రాతిపదికగా, పాకిస్తాన్‌ మధ్యవర్తిగా శాంతి చర్చలకు అంగీకరించాడు. ఏప్రిల్‌ 8న ఇరుపక్షాలూ కాల్పుల విరమణ ప్రకటించారు. 11న పాకిస్థాన్‌లో చర్చలు ప్రారంభమై 21గంటలపాటు చర్చలు జరిగాయి. అయినా అమెరికా వక్రబుద్దివల్ల చర్చలు కొలిక్కి రాలేదు. ఇరాన్‌ ప్రతిపాదనలు చర్చకు ప్రాతిపదికగా ఉండాలని మొదట అంగీకరించిన అమెరికా, చర్చలలో తమకు అనుకూలమైన కొత్త ప్రతిపాదనలు ముందుకు తేవటం ఈ వైఫల్యానికి కారణమైంది.

దీనికి నిరసనగా ఇరాన్‌ ‘హార్ముజ్‌ జలసంధి’ని మూసివేసింది. ప్రతిగా అమెరికా మూడు విమాన వాహక నౌకలు, 150కి పైగా యుద్ధనౌకలు 20వేల మంది నావికా సైనికులతో ఆ జలసంధికి 300కి.మీ దూరంగా మరో బ్లాకేడ్‌ నిర్మించింది. తిరిగి జరిగిన సంప్రదింపులలో కాల్పుల విర మణ పూర్తయ్యేవరకూ జలసంధిని తెరవాలని, ఈ లోపుగా చర్చలద్వారా ఒక అంగీ కారానికి రావాలని ఇరుపక్షాలూ అంగీకించి ప్రకటన చేసారు. జలసంధి 17వ తేదీన తెరవబడింది. జలసంధి తెరవటం తన విజయమనీ, అయితే అంతిమ పరిష్కారం లభించేంతవరకు తాను మాత్రం ఇరాన్‌ నౌకలను అడ్డగి స్తాననీ, బ్లాకేడ్‌ ఎత్తివేయటం కుదరదని ట్రంప్‌ మొండికేసాడు. దాంతో ఇరాన్‌ మళ్లీ అదేరోజు ‘హర్మోజ్‌ జలసంధి’ని మూసేసింది. నేటికీ ఈ పరిస్థితే కొనసాగుతోంది. ఈ పరిస్థితి వల్ల ప్రపంచ వ్యాపితంగా ఆయిల్‌ ధరలు పెరిగాయి. క్రూడాయిల్‌ గతంలో బ్యారెల్‌ 65 డాలర్లుంటే ఇపుడది రూ.110కి పెరిగింది. మన పెట్రోల్‌ బంకుల వద్ద వందలకొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. మన దేశంలో ముఖ్యమైన రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయిగాబట్టి ఆయిల్‌ ధరలు ప్రస్తుతం పెంచకపోయినా ఎన్నిలయ్యాక భారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశాలు న్నాయి.

ఆయిల్‌ ధరలు పెరుగుదల అనేది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. దీని వల్ల అనేక పరిశ్రమలు, వ్యవసాయం దారుణంగా దెబ్బతింటాయి. నౌకల రాకపోకలు బంద్‌ కావటం వల్ల అయిల్‌ మాత్రమేగాక ఎరువులు ఇతర సరుకుల రవాణా కూడా నిలిచిపోతుంది. ఎరువుల కొరత వల్ల అనేక ఆసియా, ఆఫ్రికా దేశాలు రానున్న రోజుల్లో ‘కరువు’ బారిన పడ బోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అమెరికాను నమ్మలేమనీ ఇక చర్చలు జరిపే ప్రసక్తి లేదనీ ప్రకటించిన ఇరాన్‌ ఈరోజున కొత్త ప్రతిపాదన ఒకటి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో మొదటిది అమెరికా ఇరాన్‌ పై విధించిన నావికా బ్లాకేడ్‌ను ఉపసంహ రించుకోవాలి. ఇది జరిగిన తర్వాతే రెండో సమస్య (హార్ముజ్‌ జలసంధి తెరవటం, దాని నిర్వహణ హక్కుల సమస్య) పై చర్చ, పరిష్కారం జరగాలి. ఇవి జరిగిన తర్వాతే మూడో సమస్య (అణు ఇంధనం సమస్య) చర్చను చేబట్టాలి. ఆ తర్వాతే మిగతా సమస్యలు చర్చించి పరిష్కరించుకోవచ్చు అనేది. ఈ సూచన చర్చకు కొంత దగ్గరగానే ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఆయన ప్రెస్‌ సెక్రటరీ ‘లెవిట్‌’ కూడా ధృవీకరించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇదే జరిగితే చర్చల ఫలితాలు ఎలా ఉండబోతాయో, ప్రపంచ పరిణామాలు ఎలా మారబోతాయో మనం తేలికగా అంచనా వేయవచ్చుననిపిస్తోంది.

మొదటిది అమెరికా తన బ్లాకేడ్‌ను ఉపసంహరిం చుకుంటే ఇప్పటి వరకూ ఇరాన్‌ను లొంగదీస్తామని ట్రంప్‌ పలికిన ప్రగల్భాలన్నీ, అమెరికా మిలటరీ బలంపై ప్రపంచ దేశాలకున్న భయాలన్నీ పటాపంచలౌతాయి. దీనికి ట్రంప్‌ అంగకరించటం అంత తేలిక కాదు. ఇక రెండోది హార్ముజ్‌ జలసంధిపై చర్చలో అవి అంతర్జాతీయ జలాలుగాబట్టి ఇరాన్‌కు వాటిని ఆపే హక్కులేదనే వాదన అమెరికా తెస్తుంది. కానీ అంతర్జాతీయ చట్టం ప్రకారమే తీర ప్రాంతం నుండి 12నాటికల్‌ మైళ్ల వరకూ సముద్రజలాలపై ఆ దేశానికే హక్కులుం టాయని నిబంధనలు చెబుతున్నాయి. ఆ ప్రకారం ఆ జలసంధిపైన ఇరాన్‌, ఒమన్‌ దేశాలకు హక్కులుం టాయి. దానిపై టోల్‌ వసూలు చేసే హక్కులు కూడా వాళ్లకుంటాయి. ఇక్కడే మరోసమస్య ఇమిడి ఉంది. ఇటీవల హార్ముజ్‌ తెరిచిన సమయం లో ఇరాన్‌ వసూ లు చేసిన ఫీజు డాలర్లలో కాకుండా చైనా కరెన్నీ ‘యువాన్‌’ల రూపంలో వసూలు చేసింది. ఇక ముందు కూడా ఆ పద్ధతే అమలు అవుతుంది. దానివల్ల చమురుకొనే దేశాలన్నీ ఇప్పటిలాగా డాలర్లకు బదులు యువాన్‌లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అంతర్జాతీయ కరెన్సీగా ఇపుడున్న ‘డాలర్‌’ క్రమంగా దాని స్థానం కోల్పోవటం తప్పదు. అదే జరి గితే అమెరికా ప్రపంచాధిపత్యం ఆపదలో పడి నట్లే. ఎందుకంటే అమెరికా బలంఅంతా మూడు అంశాల్లో (ఆర్ధిక శక్తి, మిలటరీ శక్తి, డాలరుశక్తి) ఇమిడి ఉంది.

జీడీపీ పరంగా చూసినపుడు అమెరికాతో పోలిస్తే చైనా ఆర్ధికంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ కొనుగోలు శక్తి (పిపిపి) రీత్యా 2016లోనే చైనా అమెరికాను అధిగమించి ఆర్ధిక ఆధిపత్యాన్ని సాధిం చింది. ప్రపంచంలో తిరుగులేని పారిశ్రామిక శక్తిగా నేడు చైనా ఉంది. మిలటరీ పరంగా యుద్ధ నౌకలు, విమానాలు వగైరా అంశాల్లో అమెరికాకు సమానంగా ఎదగటంతోపాటు, సైబర్‌, ఎలక్ట్రానిక్‌, మాగటిక్‌ వగైరా యుద్ధ్దకళల్లో చైనా అమెరికాను మించి పోయింది. నేడు ఇరాన్‌ అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న తీరు వెనక రష్యా, చైనాల యుద్ధ నైపుణ్యాల అందజేత, సహాయం ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఈ విధంగా ఆర్ధిక, మిలటరీ రంగాలలో ఆధిపత్యం కోల్పోయిన అమెరికాకు ఇపుడు ఇక మిగిలింది డాలర్‌ బలమే. అంటే అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ కొనసాగటం వల్ల అమెరికా తనకు ఇష్టం కాని ప్రతిదేశంపైనా ‘ఆంక్షలు’ పెట్టగలుగుతోంది.

అంటే ప్రపంచంలో ఏదేశమైనా మరోదేశం నుండి ఏ సరుకు కొనాలన్నా డాలర్‌తోనే కొనాలి. డాలర్‌పైన అమెరికా పెత్తనం ఉంటుందిగాబట్టి, ఏ దేశంపైన ఆంక్షలు పెట్టినా ఇక ఆ దేశం డాలర్లతో లావాదేవీలు జరిపే వీలుండదు. ఆ విధంగానే అనేక దశాబ్దాల తరబడి సోషలిస్టు దేశమైన క్యూబాపైనా, ఇరాన్‌పైనా, అనేక లాటిన్‌ అమెరికా దేశాలపైనా, ఇటీవల రష్యాపైనా ఆంక్షలు విధించటం, డాలర్‌ రూపంలో ఉండే వారి సంపదలను ‘ఫ్రీజ్‌’ చేయటం అమెరికా సాగిస్తోంది. యాభై సంవత్సరాల క్రితం ఆయిల్‌ దేశాల నాయకుడుగా ఉన్న సౌదీ అరేబియాతో డాలర్‌లలోనే ఆయిల్‌ అమ్మాలని, ఇందుకు ప్రతిగా తాను వారి దేశానికి రక్షణ గ్యారంటీలు ఇస్తామనీ అమెరికా ఒప్పందాలు చేసుకుంది. అమెరికా మిత్రదేశాలైన గల్ప్‌ దేశాలన్నే అదే అనుసరించాయి.

ఆ విధంగా ఆయిల్‌ అమ్మకంలో వచ్చిన డాలర్‌లనే ‘పెట్రోడాలర్లు’ అంటాము. తిరిగి ఈ డాలర్లను అమెరికా ప్రభుత్వ బాండ్లు కొనటానికి, ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ దేశాలు ఉపయో గిస్తాయి. అమెరికాకు అంతులేని అప్పు (ఇప్పుడు దాదాపు 38లక్షల కోట్ల డాలర్ల అప్పు) ఈ విధంగానే సమకూరుతోంది (అమెరికా ఆధి పత్యంలో డాలర్‌ పాత్ర గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం). అయితే ఈ ఒప్పం దాలు ముగిసా యిగాబట్టి, ఇప్పుడు ఆయిల్‌, ఇతర సరుకుల ఆమ్మకాలు స్థానిక కరెన్సీల్లో కూడా జరగటం పెరుగుతోంది. మన దేశం కూడా రష్యా దగ్గర మన రూపాయిల్లోనే ఆయిల్‌ కొనటం జరుగుతోంది. బ్రిక్స్‌ దేశాల ఆధ్వర్యంలో ఈ కృషి ఇంకా వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అమెరికా చర్చలలో హార్ముజ్‌ దగ్గర వసూలు చేసే టోల్‌ ఫీజు యువాన్‌లలోనే ఉండాలని ఇరాన్‌ పట్టుబడితే ఆ జలమార్గం గుండా పపంచానికి రవాణా అయ్యే ఆయిల్‌, ఇతర సరుకులన్నీ కొనటానికి ప్రపంచ దేశాలన్నింటికీ చైనా యువాన్లు అవసరమౌతాయి. అదే జరిగితే అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి కూడా అంతిమ రోజులు దగ్గరపడ్డట్లే అని భావించవచ్చు.

ఈ పరిణామాల నుండి బయటపడేందుకు అమెరికా చర్చల మార్గాన్ని వదిలేసి తాను ముందు ప్రకటించినట్లుగా యుద్దం ద్వారానే ఇరాన్‌ను ఓడించాలంటే మాత్రం అది దీర్ఘకాల యుద్ధంగా మారుతుంది. ఇప్పటికే అమెరికా తన బ్లాకేడ్‌ను ఉపసంహరించపోతే తమకు ఇరాన్‌కు ఉన్న ఆర్ధిక ఒప్పందాల రీత్యా తమ ఆయిల్‌ నౌకలను రక్షించుకునేందుకు తాను రంగంలోకి దిగాల్సి వస్తుందని చైనా హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఆయుధాగారాలు ఖాళీ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలు తున్నాయి. అనేక దేశాలు ఆర్ధిక సంక్షోభానికి గురికా వల్సి వస్తుంది. యుద్ధం ముగించాలని ఆ దేశాలు కూడా అమెరికాపై వత్తిడి తెస్తాయి. యుద్ధం జరిగినంతకాలం హార్ముజ్‌ జలమార్గం బంద్‌ ఉంటుంది లేదా ఇరాన్‌ మిత్రదేశాలకు మాత్రమే అనుమతి అభించే పరిస్థితి వస్తుంది. యుద్దం ద్వారా ఆ జలమార్గాన్ని తెరిపించగలిగిన శక్తి అమెరికాకు లేదు. అంతటి దుర్భేద్యమైన దుర్గంగా ఇరాన్‌ ఆ ప్రాంతంలో తన శక్తులను మొహరించింది. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించే స్థితిలేదు.

యూరప్‌ దేశాలలో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు, కొన్నిదేశాలు చైనా, రష్యాలకు దగ్గరయ్యే సూచనలు కనపడు తున్నాయి. అమెరికాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలను ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నవంబరులో ఆ దేశంలో మద్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీలోనే యుద్ధ వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో యుద్ధం ద్వారా ఇరాన్‌ను నియంత్రిచటం జరిగే పని కాదు. అందుకే అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్‌ పరిస్థితి ‘ముందు నొయ్యి, వెనక గొయ్యి’లా తయారైంది. ఈ చిక్కుముడి నుండి ఎలా బయటపడాలో అంతుచిక్కక ఆయన ‘దిక్కు తోచని పరిస్థితి’లో ఉన్నాడు దశాబ్దాలుగా ప్రపంచాన్ని పీడించి, అభ్యుదయ శక్తులను అడ్డగిస్తూ ప్రపంచ పోలీసుగా వ్యవహరించిన అమెరికా దుస్థితినీ, ఈ స్థితిలో కూడా అమెరికాతో అంటకాగుతున్న మన మోడీగారి అసలు రూపాన్ని ప్రజల ముందు ఎండగట్టడం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు మద్దతు కూడగట్టడం మనందరి కర్తవ్యం.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -