Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోరాడాలి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోరాడాలి

- Advertisement -

కేంద్రం మనువాద విధానాలను తిప్పికొట్టాలి : ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌

ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్స్‌ సాధన కోసం పోరాటం :ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగం పరిరక్షణ – సవాళ్లు’పై సెమినార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద విధానాలను తిప్పికొట్టాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యం కావాలని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ పిలుపునిచ్చారు. పూలే, అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌ అధ్యక్షతన ”రాజ్యాంగం పరిరక్షణ- సవాళ్లు” అనే అంశంపై సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా అబ్బాస్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం, సమాన అవకాశాలు కల్పించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సమాజంలో తిరిగి వర్ణ వ్యవస్థను, కుల వివక్షను తీసుకురావాలని చూస్తున్నాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడం ద్వారా కేంద్రం సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 82,022 రిజర్వేషన్‌ పోస్టులను భర్తీ చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, హిందూ-ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టిస్తోందన్నారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. బీజేపీ అనుసరిస్తున్న మనువాద సిద్ధాంతం వికలాంగులను సమాజానికి, చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతున్న ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ.. నేటికీ వికలాంగుల పట్ల వివక్ష కొనసాగడం పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, వికలాంగుల హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సెమినార్‌లో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికళ, చంద్రమోహన్‌, బాలకృష్ణ, నర్సింహా, చెన్నయ్య, వెంకన్న, కవిత, దుర్గ, గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రాజు, నాయకులు ఉషా, నర్సింగ్‌, శంకర్‌ గౌడ్‌, రవిచంద్ర, లక్ష్మణ్‌, లావణ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -