నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. ముందస్తుగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని, అదేవిధంగా ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దారులు, మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 50 శాతానికి మించని మండలాలు గురువారంలోగా 50% చేరుకోవాలన్నారు. అలాగే 50 నుండి 70 శాతం మధ్య ఉన్న మండలాలు వేగం పెంచాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై సమీక్షిస్తూ ఎక్కడ “నో” స్టాక్ బోర్డు పెట్టకుండా చూడాలని, తహసిల్దార్లు వారి పరిధిలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్ కొనకుండా చూడాలని చెప్పారు.
సాదా బైనామా దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, తహసిల్దార్ స్థాయిలో ఉన్న అన్ని దరఖాస్తులు ఆర్డీవో లాగిన్ కి రావాలని, ఆర్డీవోలు ప్రతిరోజు రెండు ,మూడు మండలాలను సమీక్షించాలని సూచించారు. ఈ అంశంపై త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సమక్షించనున్న దృష్ట్యా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తులను పూర్తిగా చదివిన తర్వాత పరిష్కారం చేయాలని, అనవసరంగా తిరస్కరించవద్దని, రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామ దరఖాస్తుల పరిష్కారానికి ఇది చివరి అవకాశమని గుర్తు చేశారు. పట్టాదారుకు మేలు జరిగే విధంగా తహసిల్దార్లు చూడాలని, సాదాబైనామ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.



