Wednesday, April 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కళంటే ఓ సామాజిక బాద్యత

కళంటే ఓ సామాజిక బాద్యత

- Advertisement -

ఇందిర పరాశరం… ప్రముఖ కూచిపూడి కళాకారిణి. కళను పదిమందికి అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. పేద విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో త్రైలోక్య సహృదయ ఫౌండేషన్‌ను స్థాపించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నాట్యమంటే కేవలం వినోదం కోసం కాక ఓ సామాజిక బాధ్యతగా భావించి ఎన్నో సామాజిక అంశాలను కథా వస్తువులుగా తీసుకొని శాస్త్రీయ నృత్యరూపంలో ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌ 29న ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు తన విద్యార్థులతో పలు నృత్యరూపాలను ప్రదర్శించిన ఆమె పరిచయం నేటి మానవిలో…

ఇందిర పరాశరం సుగుణాదేవి, సీతారామాచార్యులు దంపతులకు మూడవ సంతానంగా గోదావరిఖనిలో పుట్టారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి కనబరిచిన కూతురి ప్రతిభను గుర్తించిన తల్లి నాలుగేళ్ల వయసులోనే మొదట జానపద నృత్యాన్ని నేర్పించి మొదటి గురువుగా నిలిచారు. ఆ విధంగా ఆమె నాట్యప్రస్థానానికి కుటుంబమే పునాది అయింది. ఏడవ తరగతిలో ఉండగా మొదటిసారిగా రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి అందుకున్నారు. తర్వాత కాలంలో పలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని ప్రతి వేదికపై ప్రథమ బహుమతులు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.

జానపద కళల్లో…

తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో నాట్యగురువు షరీఫ్‌ వద్ద ఆంధ్రనాట్యం, జానపద నృత్యాలలో శిక్షణ పొందారు. చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయస్థాయి నృత్య పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతితో పాటు ‘నాట్య మయూరి’ అవార్డును సైతం అందుకున్నారు. అలా చదువుతో పాటు నాట్యాన్ని కొనసాగిస్తూ కూచిపూడి వైపు మరింతగా మక్కువ పెంచుకున్నారు. శ్రీమతి రమణి, డా.అనితారావు వద్ద శిక్షణ పొంది సర్టిఫికెట్‌ కోర్సులు పూర్తి చేశారు. తర్వాత ప్రముఖ కూచిపూడి నాట్యగురువు పసుమర్తి వెంకటేశ్వర శర్మ వద్ద ఉన్నత శిక్షణ పొంది అనేక నృత్యరూపకాలను రూపొందించారు.

త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌
2006లో కూచిపూడిలో ఎం.ఏ. పూర్తి చేశారు. 2009లో ‘త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌’ అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా అనేకమంది శిష్యులకు నాట్యశిక్షణ అందిస్తూ గురుపరంపరను కొనసాగిస్తున్నారు. 2009లో ‘త్రైలోక్య పాలనీ’ నృత్యరూపకాన్ని రవీంద్రభారతిలో ప్రదర్శించారు. 2015లో తెలంగాణ రెండు వేల ఏండ్ల చరిత్రను ప్రతిబింబిస్తూ ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి రచించిన ‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ నృత్యరూపకాన్ని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రవీంద్రభారతిలో ప్రదర్శించారు. 2015 జూలై 22న ‘చైతన్య శరథి దాశరథి’ అనే నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.

సామాజిక అంశాలతో…
2017లో రైతు జీవన నేపథ్యాన్ని, అన్నం వెనుక ఉన్న శ్రమను ప్రతిబింబిస్తూ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించిన ‘అన్నదాత’ అనే భావనాత్మక సాంఘిక నృత్యరూపకాన్ని రూపొందించారు. ఈ రూపకం రైతు కష్టం, వ్యవసాయ సంక్షోభం, సమాజ బాధ్యత వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు. సామాజిక, దేశభక్తి అంశాలను ప్రతిబింబించే నృత్యరూపకాల ప్రదర్శనలు కొనసాగిస్తూ ప్రముఖ గేయకవి సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘వీరభారతం’ నృత్యరూపకాన్ని రూపొందించి రవీంద్రభారతిలో విజయవంతంగా ప్రదర్శించారు. ఇదే నృత్య ప్రదర్శన 2025 డిసెంబర్‌లో ప్రత్యేక ప్రదర్శన మరింత వైభవంగా నిర్వహించబడింది. ఇలా భక్తి, చరిత్ర, సామాజిక చైతన్యం, దేశభక్తి ఈ నాలుగు పరిమళాలతో ఆమె నాట్యప్రస్థానం విశిష్టమైన దిశగా కొనసాగుతోంది.

అలసట తెలియకుండా…
‘అసలు వాద్యం పుట్టుకకన్నా ముందుగా మనిషిలో నాట్యం పుట్టింది అని చెప్పవచ్చు. ‘నాట్యం విషయం జానపదమా? శాస్త్రీయ నృత్యమా?’ అనే ప్రసక్తి వచ్చినప్పుడు రెండింటికీ తమ తమ ప్రత్యేకత ఉంది, రెండూ సమాన ప్రాముఖ్యత కలిగినవే. జానపద నృత్యం అనగానే మనకు పల్లెలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు స్త్రీలు, పురుషులు కలిసి పంట పనులు చేస్తూ, అలసట తెలియకుండా సరదాగా పాటలు పాడుకునేవారు. ఆ పాటల సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా ఉండటం వల్ల వాటికి అనుగుణంగా శరీర కదలికలతో ఉత్సాహంగా నాట్యం చేసేవారు. ఈ విధంగా జానపద నృత్యాలు పుట్టుకొచ్చాయి. వీటిలో స్వదేశీ భావం, జీవనశైలి, సంప్రదాయం ప్రతిఫలిస్తాయి. శాస్త్రీయ నృత్యం విషయానికి వస్తే, గురు-శిష్య పరంపరలో శాస్త్రబద్ధంగా శిక్షణ పొంది అభ్యసించేది శాస్త్రీయ నృత్యం. అభినయం, లయ, తాళం, భంగిమలకు ఇందులో విశేష ప్రాముఖ్యం ఉంటుంది. గురు పరంపర కొనసాగేది శాస్త్రీయ నృత్యం ద్వారానే’ అంటారు ఇందిర.

కళలు వర్ధిల్లాలి
‘సమాజంలోని సమస్యలను, పరిస్థితులను ప్రజలకు తెలియజేసి ముఖ్యంగా యువతను మేల్కొలిపి నవసమాజ స్థాపనకు దోహదపడే శక్తి నాట్యానికి ఉంది. ప్రత్యేకంగా కూచిపూడి నృత్యం అభినయ ప్రధానమైనది. అందువల్ల సాంఘిక అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించగల సామర్థ్యం దీనికి ఉంది. మేము ప్రదర్శిస్తున్న నృత్యరూపకాలలో ‘అన్నదాత’ ఒక ముఖ్యమైన సాంఘిక నృత్యరూపకం. ఇందులో రైతు జీవితం, పంట కోసం పడే కష్టం, అప్పుల బారిన పడడం, చివరకు విషాద పరిస్థితులు.. ఇవన్నీ నృత్యరూపంలో చూపిస్తూ రైతు జీవితం నిలబెట్టడం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశాన్ని అందిస్తున్నాం. ఇలాంటి సాంఘిక నృత్యరూపకాలు ప్రతి ఊరిలో, ప్రతి పాఠశాలలో ప్రదర్శింపబడి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు సహకరిస్తే భావితరం ఎన్నో విలువైన అంశాలు తెలుసుకుంటుంది. నాట్యం వినోదం మాత్రమే కాదు అది ఆరాధన, అవగాహన, సామాజిక బాధ్యత. అందుకే కళలు వర్ధిల్లాలి, కళాకారులు ఉద్దరించబడాలి. ఒకప్పుడు రాజులు కళలను పోషించారు. నేడు కళలను కాపాడటం మనందరి బాధ్యత’ అంటూ కళల పట్ల తన బాధ్యతను తెలియజేశారు.

కళను ప్రోత్సహించాలని : ఇందిర పరాశరం
త్రైలోక్య ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో త్రైలోక్య సహృదయ ఫౌండేషన్‌ను స్థాపించి ఉచితంగా 50 మంది విద్యార్థులకు నాట్యశిక్షణ అందిస్తున్నాం. కళను కేవలం ప్రదర్శన స్థాయిలోనే కాక, సేవా దృక్పధంతో సమాజానికి అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తూ, విద్యార్థుల్లో కళలపట్ల ఆసక్తి, ఆదరణ పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. నాట్యం ద్వారా సంస్కృతి, విలువలు, క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలను బాలలలో పెంపొందించడం మా ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా నేటి తరానికి కళల పట్ల అభిరుచి పెంపొందించి, భారతీయ సంప్రదాయ కళారూపాల గొప్పతనాన్ని పరిచయం చేయడం ద్వారా భావితరాన్ని సాంస్కృతికంగా సమృద్ధిగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కళలు వర్ధిల్లాలంటే కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారులు నిలవాలంటే గురుపరంపర బలపడాలి. అనే నమ్మకంతో మా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -