Thursday, April 30, 2026
E-PAPER
Homeఖమ్మంపెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్

పెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్

- Advertisement -

– కేటీఆర్ అభిమానుల వినూత్న నిరసన
– పెళ్లి వేడుక లో చర్చనీయాంశం
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాత పేరాయిగూడెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక వినూత్న కానుక తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన నార్లపాటి వెంకటేశ్వరరావు – కన్నమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణరావు కు మమత తో బుధవారం ఘనంగా వివాహం జరిగింది.ఈ వేడుకలో వధూవరులకు అందించిన ప్రత్యేక కానుక స్థానికంగా చర్చనీయాంశమైంది. వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరైన టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) యువజన విభాగం నాయకులు సాధారణ కానుకలకు భిన్నంగా పెట్రోల్, డీజిల్‌ను పెళ్లి కానుకగా అందజేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సాధారణంగా పెళ్లిళ్లలో వెండి వస్తువులు, బంగారు నగలు, గృహోపకరణాలు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ.అయితే ఈ వివాహ వేడుకలో మాత్రం పెరిగిన ఇంధన ధరలపై తమదైన శైలిలో స్పందిస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

వివాహ వేదికపై వరుడు, వధువు ఉన్న సమయంలో టీఆర్ఎస్ యువజన నాయకులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన గిఫ్ట్ బాక్స్‌తో స్టేజ్‌పైకి వచ్చారు. ఆ బాక్స్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో అతికించి ఉండటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. అనంతరం బాక్స్‌ను తెరిచి చూడగా అందులో రెండు సీసాల్లో చెరో లీటర్ పెట్రోల్, డీజిల్ ఉండటంతో వధూవరులతో పాటు అతిథులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ గిఫ్ట్‌ను అందజేసినట్లు యువజన నాయకులు తెలిపారు. ఒకవైపు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూనే, మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ఈ కానుక అందించామని పేర్కొన్నారు.

ఈ వినూత్న కానుక ఇప్పుడు అశ్వారావుపేట మండలంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివాహానికి హాజరైన అతిథులు దీనిని సరదాగా స్వీకరించినప్పటికీ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై చురకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్‌తో పాటు కలపాల శ్రీనివాస్, రవి, గంగాధర్, శివ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -