కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు!
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అష్టకష్టాలు పడి పండించిన మక్కలను అమ్ముకుందామంటే అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత రెండు వారాలుగా ఈ కేంద్రంలో కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హమాలీల కొరత వేధిస్తుండటంతో అటు తూకాలు జరగక, ఇటు లారీలు రాక మార్కెట్ యార్డులోనే ధాన్యం కుప్పలపై రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు సరైన సమయానికి బస్తాలు (భారదాను) దొరక్కపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.
ఈ విషయమై పీఏసీఎస్ సెక్రటరీ నాగరాజు మాట్లాడుతూ.. మా సెంటర్‌కు కేటాయించిన గోదాముల వద్ద దిగుమతులు సక్రమంగా జరగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం హమాలీల కొరత. హమాలీలు అందుబాటులోకి వస్తేనే తప్ప రవాణా వేగవంతం కాదు. ట్రాన్స్‌పోర్ట్ నిలిచిపోవడం వల్లే కాంటాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది” అని వివరించారు.
మరోవైపు కొనుగోలు కేంద్రం వద్ద వేచి ఉన్న రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పెద్ద రాజిపేటకు చెందిన రైతు గువ్వ సారయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. “పంట పండించడం కన్నా కొనుగోలు కేంద్రం చుట్టూ తిరగడమే కష్టంగా మారింది. గత వారం పది రోజులుగా ఇక్కడే తిరుగుతున్నా ఫలితం లేదు. కాంటాలు పెట్టమంటే లారీలు రావడం లేదని సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్లు? హమాలీ సమస్యను పరిష్కరించడానికి ఇన్ని రోజులు పడుతుందా? పంట పండించడానికి పడ్డ యాతన కన్నా మక్కల కొనుగోలు కేంద్రం చుట్టూ తిరగడమే నరకంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హమాలీల సమస్యను తీర్చి, రవాణాను పునరుద్ధరించి తమ పంటను త్వరితగతిన కొనుగోలు చేయాలని పరకాల ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.



