కెమెరా కన్ను మింగిన ఒక సితార
రంగుల వలయమైన చలనచిత్ర రంగం దూరం నుండి చాలామందిని ఆకర్షిస్తుంది. అందులోకి ప్రవేశించిన తర్వాత అది ఒక రంగుల వలగా మారిపోతుంది. చలనచిత్ర రంగంలోకి బయట నుండి లోపలికి వెళ్లడం ఎంత కష్టమో అందులో నుండి బయట పడటం కూడా అంతే కష్టం. కన్నవాళ్ళ కోరికో, సినిమాల పట్ల తనకున్న ఆసక్తి వల్లనో తెరపై కనిపించాలన్న ఆకాంక్షనో చివరికి ఆ రంగుల వలకు వేలాడే శవంగా రూపాంతరం చెందుతుంది.
ఆ వేలాడే ఒక శవం కథే ఈ వారం.
ఇంత వరకు భారత దేశంలో వెండితెరపై జీవించిన తారలు ఇద్దరే. ఒకరు స్మితా పాటిల్, రెండవ వారు శోభ. చలనచిత్ర రంగంలోని చీకటి తెరల చెరలో వీరి అకాల మరణానికి కారణం మగవాడు. స్మిత మరణం సహజంగా కనిపించినా దాని వెనుక రాజబబ్బర్ ఉంటాడు. అలాగే తన కూతురు వయసున్న నటిని లోబరుచుకున్న బాలూ మహేంద్ర శోభ మరణం వెనక కనిపిస్తాడు.
శోభ అనే పేరుతో పిలువబడే మహాలక్ష్మి మీనన్ మలయాళం, తమిళ చిత్రాలలో సహజ నటనకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినీ నటి. 17 ఏండ్ల వయసులో, ఆమె 1979 తమిళ చిత్రం ‘పసి’లో తన పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. కన్నడ (1978), తమిళ (1979) చిత్రాలలో ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. దక్షిణాది భారతీయ చలనచిత్ర ప్రపంచంలో ఉద్భవించిన అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరిగా పరిగణించబడిన ఆమె కెరీర్ సినీ చరిత్రలో నిలిచిపోయింది. తమిళ చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి మలయాళ, కన్నడ, తెలుగు సినీ రంగాలలో తనదంటూ ప్రభావం చూపిన నటి శోభ.
బాలనటిగా శోభ సినీరంగ ప్రవేశం చేసింది. ప్రధాన నటిగా ఆమె మొదటి చిత్రం 1978 మలయాళ చిత్రం ఉత్రాద రాత్రి. శోభ 1961 సెప్టెంబర్ 23న కె.పి. మీనన్ – ప్రేమ మీనన్ దంపతులకు జన్మించింది. ఆమె తల్లి 1954 నుండి 1981 వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రేమ అనే పేరుతో గుర్తింపు పొందిన నటి. 1966లో శోభ నటుడు జె.పి.చంద్రబాబు దర్శకత్వం వహించిన తమిళ థ్రిల్లర్ చిత్రం ‘తట్టుంగల్ తిరక్కప్పడుం’ ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె బేబీ మహాలక్ష్మిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటి సావిత్రి, కె.ఆర్. విజయ, ఆర్.ఎస్. మనోహర్, చంద్రబాబు సరసన లక్ష్మి పాత్రను పోషించింది. మరుసటి ఏడాది ఆమె పి.వేణు ‘ఉద్యోగస్థ’ చిత్రం ద్వారా మలయాళ సినిమాలోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు బేబీ శోభగా గుర్తింపు లభించింది. ఈ చిత్రం మలయాళ మొట్టమొదటి ‘మల్టీ-స్టారర్’ సినిమా. ఇందులో సత్యన్, ప్రేమ్ నజీర్, కె.పి.ఉమ్మర్, పద్మిని, శారద, షీలా, రాజశ్రీ వంటి అగ్ర నటులు నటించారు. ఈ చిత్ర భారీ విజయం, బాలనటిగా శోభ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
1978లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ‘ఉత్రాడ రాత్రి’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించింది. 1978లో ‘బంధనం’, ‘ఎంతే నీలకాశం’ చిత్రాలకు కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అదే ఏడాది ఆమె కన్నడ సినిమా ‘అపరిచిత’ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. 1979లో తిరువాంకూరు సోదరీమణులలో ఒకరైన లలిత నిర్మించిన తమిళ చిత్రం ‘పసి’కి ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును, ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును, 1977లో ‘ఓర్మకల్ మరిక్కుమో” చిత్రానికి కేరళ ప్రభుత్వం నుండి రెండవ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
శోభకు ఉన్న అత్యంత బలమైన ఆస్తులలో ఒకటి ఆమె ఆత్మవిశ్వాసం. సీనియర్, అప్పటికే మంచి గుర్తింపు పొందిన నటులతో కలిసి నటించేటప్పుడు కూడా ఆమె ఏ మాత్రం బెదరక, నిబ్బరంగా ఉండేది. కొన్ని రోజుల ముందే, ‘పసి’ అనే విభిన్నమైన చిత్రానికి గాను ‘ఉత్తమ నటి’గా జాతీయ పురస్కారాన్ని అందుకోవడానికి, సర్వాభరణ భూషితయై ఆమె వేదికపైకి నడిచింది. కానీ 1980 మే 1వ తేదీన మద్రాసులోని తన నివాసంలో శోభ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసినప్పుడు ఆమెను అభిమానించే వారి ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. మలయాళ చిత్రసీమలో సహాయ నటిగా రాణించిన శోభతల్లి ప్రేమ, ఇది హత్యేనని ఆరోపించడంతో ఆమె మరణంపై వెంటనే వివాదం చెలరేగింది. ఏడాదిన్నర కాలంగా శోభకు భర్తగా ఉన్న, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అయిన బాలు మహేంద్రపైనే అనుమానపు వేళ్లు చూపబడ్డాయి. అయితే ఇది ఆత్మహత్యేనన్న వాదనకు బలం చేకూరడంతోనూ, ఫోరెన్సిక్ విచారణలో మరణానికి కారణం హత్య కాదని తేలడంతోనూ ఈ కేసు క్రమంగా నీరుగారి పోయింది.
బాలనటిగా తెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలోనే నాలుగు దక్షిణాది భాషల చిత్రాలలో తనదైన ముద్ర వేసిన ఆ బాలతార కెరీర్ అలా ముగిసిపోయింది. శోభ ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాలలో పనిచేసినప్పటికీ, ఆమె ఒకటి రెండు తెలుగు చిత్రాలలోనూ, నాలుగు కన్నడ చిత్రాలలోనూ నటించింది. బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్, మోహన్ ప్రధాన పాత్రలలో వచ్చిన ‘కోకిల’ ఆమె నటించిన విజయవంతమైన కన్నడ చిత్రాలలో ఒకటి కాగా, తమిళ సినిమా రంగంలో నూతన ప్రతిభను గుర్తించే ప్రముఖ దర్శకుడు బాలచందర్ తన దర్శకత్వంలో వచ్చిన ‘నిళల్ నిజమాగిరదు’ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం శోభను ఎంపిక చేసుకున్న తొలి దర్శకులలో ఒకరు. అయితే, ‘ఒరు వీడు ఒరు ఉలగం’ చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించిన దర్శకుడు దురైనే, ‘పసి’ చిత్రం ద్వారా శోభకు ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించారు.
మహేంద్రన్ దర్శకత్వం వహించిన ‘ముల్లుమ్ మలరుమ్’ చిత్రంలో రజనీకాంత్ చెల్లెలి పాత్ర పోషించిన శోభ, రజనీకాంత్, శరత్ బాబు వంటి అనుభవజ్ఞులైన నటులతో సమానంగా నటించింది. ఆమె తన నటనను ఆ నటుల నీడలోకి ఎప్పుడూ వెళ్లనివ్వలేదు. ఏ దృశ్యాన్ని అయినా తనవైపు తిప్పుకునే ప్రతిభ ఆమెది. ఎంతో విషాదకరమైన విషయం ఏమిటంటే, ఆమెకు కేవలం 15 ఏండ్ల వయసులో బాలు మహేంద్రతో వివాహం జరిగింది. కెమెరా ముందు ఒక నిష్ణాతురాలిగా వ్యవహరిస్తూ, తన పాత్రలను అత్యంత పరిణితితోనూ, లోతైన అవగాహనతోనూ పోషించగలిగిన శోభ తన జీవితాన్ని పూర్తిగా చిందరవందర చేసుకున్నానని తన జీవితపు చివరి దశలో గానీ గ్రహించలేకపోయింది. వెండితెరపై కొత్త శిఖరాలను అధిరోహించి, గొప్ప భవిష్యత్తును నిర్మించుకునే సత్తా, ధైర్యం పుష్కలంగా ఉన్న ఆ నటి, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం దారి తప్పింది. శోభ మరణించిన నాలుగేండ్ల తర్వాత, తన కుమార్తె మరణాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ఆమె తల్లి ప్రేమ కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే శోభ మరణించిన తీరు మాత్రం నేటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ సత్యం బహుశా ఎప్పటికీ వెలుగు చూడకపోవచ్చు. ఇక ప్రస్తావన కోసం చెప్పాలంటే, దర్శకుడు కె.జి.జార్జ్ శోభ జీవిత విశేషాలను ఆధారంగా చేసుకుని ‘లేఖయుడే మరణం – ఒరు ఫ్లాష్‌బ్యాక్’ అనే చిత్రాన్ని రూపొందించారు. 1983లో విడుదలైన ఈ చిత్రంలో యువ నటి నళిని శోభ పాత్రను, బాలూ మహేంద్ర పాత్రను భారత్ గోపి పోషించారు.
శోభ తెలుగులో బాపు దర్శకత్వంలో ‘మన ఊరి పాండవులు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు తెలుగులో నటించిన మరో సినిమా ‘తరం మారింది’. ఆ సినిమాలో ఆమె నటన మరువలేం. అంత చక్కగా తెలుగు అమ్మాయి కూడా వుండదేమో అన్నట్టుగా నటించింది. శోభ మరణించే నాటికి ఆమె వయసు 17 సంవత్సరాలే. తన 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో బాలనటిగా మొదలుకొని హీరోయిన్‌గా నటించిన సినిమాలు 30కి మించవు. కానీ ఆమె 300 చిత్రాలలో నటించిన తారలకు మించిన పేరును సంపాదించుకున్నది. ఆమె మరణం భారత దేశ సినీ ప్రేక్షకులకు అంతులేని బాధను మిగిల్చింది. ఒక కెమెరా కన్ను మింగిన తార శోభ.
(మే 1న శోభ 46వ వర్ధంతి)
శోభ ఎలాంటి వ్యక్తి? అన్న ప్రశ్నకు ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ సి.వి. అరవింద్ మాటల్లోనే చెప్పాలంటే…
‘పసి’ రోజుల నుండి నాకు ఆ నటితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే సినిమా పత్రిక కోసం నేను ఆమెను ఇంటర్వ్యూ చేసినందుకు శోభకు నేను ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆంగ్ల పత్రికలలో ఆమెకు అదే మొదటి పరిచయం. ‘పసి’లోని పాత వస్తువులు ఏరుకునే మహిళ పాత్ర, ఆమె తన మునుపటి చిత్రాలలో పోషించిన పాత్రలకు పూర్తిగా భిన్నమైనది. మద్రాసులోని నా ల్యాండ్‌లైన్‌కు ఆమె నుండి ప్రతిరోజూ సాయంత్రం ఫోన్ వచ్చేది (ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు). ఆ తర్వాత ఆ రోజు షూటింగ్ గురించి ఉత్సాహభరితమైన చర్చ జరిగేది, అందులో శోభే ఎక్కువగా మాట్లాడేది. తన ముఖానికి, చేతులకు మసి పూయడం, అలాగే తను వేసుకోవలసి వచ్చిన చిరిగిన దుస్తులు పలుచోట్ల చిరిగిపోయి ఉండటం ఆమెకు ముఖ్యంగా చికాకు తెప్పించేది. కానీ, ఆ పాత్ర ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. దురై ఆ చిత్రాన్ని నగరంలోని పలు ప్రదేశాలలో చిత్రీకరించడంతో, పాత వస్తువులు ఏరుకునే వారి జీవితాలను చూసే అవకాశం కూడా ఆమెకు లభించింది. తాగుబోతు తండ్రి కూతురైన కుప్పమ్మ పాత్రను శోభ పోషించింది. ఆమె తన కుటుంబ ఆదాయానికి అదనంగా డబ్బు సంపాదించడానికి పాత వస్తువులు ఏరుకోవలసి వస్తుంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఒక స్త్రీలోలుడు ఆమెను లొంగదీసుకుంటాడు. ఆమెకు అవాంఛిత గర్భం వస్తుంది. కానీ కుప్పమ్మ ఆ వ్యక్తి పేరును వెల్లడించడానికి నిరాకరిస్తుంది. తరువాత, అతనికి పెళ్లయిందని ఆమె తెలుస్తుంది. ఇవేమీ తెలియని అతని భార్య కుప్పమ్మ దుస్థితిని చూసి జాలిపడుతుంది. చివరకు కుప్పమ్మ ప్రసవ సమయంలో మరణిస్తుంది. ఆ దంపతులు ఆ బిడ్డను దత్తత తీసుకుంటారు. కుప్పమ్మ బిడ్డకు తండ్రైన రంగన్ (విజయన్)తో కలిసి వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. 1979 సంవత్సరానికిగాను శోభకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఇంకా కౌమారదశలోనే ఉన్న శోభ, 1978లో ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఐన బాలు మహేంద్రతో గాఢంగా ప్రేమలో పడింది. ఆమె అతని చిత్రాలైన కోకిల, అళియాత కోలాంగళ్, మూడు పని వంటి వాటిలో కీలక పాత్రలు పోషించింది. బాలు మహేంద్ర, ఆ నటికీ, అలాగే ఆమె తల్లి ప్రేమకూ, ఏళ్ల తరబడి కుటుంబ మిత్రుడిగా ఉన్నారు. ఆమె కంటే దాదాపు మూడు దశాబ్దాలు పెద్దవాడు కావడంతో, శోభ మొదట్లో ఆయనను ఒక తండ్రి స్థానంలోనే చూసేది. అయితే, బాలు తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఆమెను ఒక దివ్య సుందరిగా మలిచిన తీరు చూసి, ఆమె ఆయన ఛాయాగ్రహణ నైపుణ్యాలకు ఎంతగానో ముగ్ధురాలై, విస్మయానికి లోనయ్యేది. నేను ఆమె ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ, బాలు వివిధ భంగిమల్లో ఆమెను చిత్రీకరించిన ఫొటో ఆల్బమ్‌లను శోభ ఎంతో నిమగమై పరిశీలిస్తూ కనిపించేది. కాలక్రమేణా, ఆ దర్శకుడిపై ఆమెకు ఉన్న అభిమానం ప్రేమగా మారింది. తన తల్లిదండ్రుల, శ్రేయోభిలాషుల అభీష్టానికి వ్యతిరేకంగా ఆ జంట వివాహం చేసుకున్నారు అప్పటికే బాలుకు వివాహమై ఉన్నప్పటికీ. బాలు తన మొదటి భార్య అఖిలేశ్వరిని, అలాగే తాను ప్రాణంగా ప్రేమించే తన కుమారుడు శంకిని వదిలిపెట్టి, తన జీవితంలో ఏకైక స్త్రీగా తనను మాత్రమే స్వీకరిస్తాడని శోభ నమ్మింది. కానీ ఆ విషయం జరగలేదు. శోభ మరణానంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలలో ”ఆమె తన జీవితంలో ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉందో, ఆమె మరణం తనను ఎంతగా కుంగదీసిందో” అని బాలు నిర్మొహమాటంగా అంగీకరించారు. అయినప్పటికీ, ఆమె ఆత్మహత్యకు ఆయనే కారణమని చాలామంది బలంగా విశ్వసించారు.”
2014లో బాలు మరణించే సమయానికి, అఖిలేశ్వరితో పాటు, సినీ, టీవీ నటి మౌనికను కూడా ఆయన వివాహం చేసుకుని ఉన్నారు.
శోభ అందుకున్న అవార్డులు
1979హొ-హొపసికిహొఉత్తమ నటిగా జాతీయ చలనచిత్రహొపురస్కారం
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్
1978 -హొఅపరిచితహొచిత్రానికిహొఫిల్మ్‌ఫేర్
ఉత్తమ కన్నడ నటి అవార్డు
1979 -హొపసిహొచిత్రానికిహొఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డు
కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారంహొ
1971 యోగమ్ముల్లావల్, అవల్ అల్పం వైకిప్పోయి చిత్రాలకుహొఉత్తమ మహిళా బాలనటి
1977 -హొఒర్మకల్ మరిక్కుమోహొచిత్రానికిహొరెండవ ఉత్తమ నటి
1978 -హొఎంత నీలాకాశంహొచిత్రానికిహొఉత్తమ నటి అవార్డు
హెచ్ రమేష్ బాబు,
7780736386



