Sunday, May 3, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్వేసవి నేర్పిన పాఠం

వేసవి నేర్పిన పాఠం

- Advertisement -

అదొక చిన్న గ్రామం. పేరు శెట్టు పల్లి. పచ్చని చెట్లు, పొలాలు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో అభిరామ్‌, ఆరాధ్య, అజరు, అశ్విని అనే నలుగురు పిల్లలు చాలా మంచి స్నేహితులు. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, చక్కగా చదువుకునేవారు. పరీక్షలు ముగిసి సెలవులతో పాటు వేసవి కాలం వచ్చింది. ఎండలు ఎక్కువయ్యాయి. చెరువులు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలో నీటి కొరత కనిపించసాగింది. కానీ పిల్లలకు ఈ విషయం అంతగా అర్థం కాలేదు. వాళ్లు నీటిని వథా చేసేవారు. ట్యాప్‌ ఓపెన్‌ చేసి మర్చిపోవడం, నీటితో ఎక్కువసేపు ఆడుకోవడం వాళ్లకు అలవాటుగా… సరదాగా ఉండేది.
ఒక రోజు గ్రామ పెద్ద అయిన పరంధామయ్య గారు పిల్లలను పిలిచారు.
”పిల్లలూ… నీరు ఎంత విలువైనదో మీకు తెలుసా…?” అని అడిగారు.
అభిరామ్‌ నవ్వుతూ…. ”నీరు చాలా ఉంది కదా తాతయ్య! ఎక్కడ చూసినా ట్యాప్‌లో వస్తుంది. ఊర్లో బావులు కూడా ఉన్నాయిలిలి అన్నాడు.
పరంధామయ్య గారు చిరునవ్వుతో, ”ఇప్పుడు ఉంది. కానీ రేపు లేకపోతే?” అని ప్రశ్నించారు.
పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లకు సమాధానం తెలియలేదు.
అప్పుడాయన వారిని గ్రామం బయట ఉన్న ఎండిపోయిన చెరువు దగ్గరికికి తీసుకెళ్లారు.
”ఇది ఒకప్పుడు నీటితో నిండిపోయి కళకళ లాడుతూ ఉండేది. ఇప్పుడు చూడండి… పూర్తిగా ఎండిపోయి బిక్కు బిక్కు మంటుంది. ఎందుకంటే మనం నీటిని జాగ్రత్తగా వాడలేదు” అని చెప్పారు.
పిల్లలు ఆశ్చర్యపోయారు. ఆరాధ్య బాధగా, ”మనం కూడా నీటిని వథా చేస్తున్నాం కదా!” అని చెప్పింది.
అజరు తల వంచి, ”ఇక మీదట అలా చేయకూడదు” అన్నాడు.
ఆ రోజు నుంచే పిల్లలు మారిపోయారు. వాళ్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు:
ట్యాప్‌ను అవసరం లేకపోతే వెంటనే ఆపేయడం, నీటితో ఆటలు ఆడకపోవడం, మొక్కలకు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే నీరు పోయడం…
ఇతరులకు కూడా నీటి విలువ చెప్పడం..
అశ్విని ఒక మంచి ఆలోచన చెప్పింది. ”మన గ్రామంలో అందరికీ నీటి పొదుపు గురించి చెప్పాలి!” అని.
అందరూ చప్పట్లు కొట్టి అంగీకరించారు. వాళ్లు పోస్టర్లు తయారు చేసి, ”నీరు అంటే జీవం”, ”ఒక్క చుక్క నీరు… పొదుపు చేసే తీరు” అనే సందేశాలు రాశారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నీటి ప్రాముఖ్యతను వివరించారు.
కొన్ని రోజుల్లో గ్రామంలో మార్పు కనిపించింది. ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడడం ప్రారంభించారు. ట్యాప్‌లు వథాగా వదిలేయడం తగ్గింది. పిల్లలు కూడా తమ స్నేహితులకు ఈ విషయాలు నేర్పించారు. తల్లిదండ్రుల వాట్సప్‌ గ్రూపుల్లో ఈ విషయాలను పంపమని ప్రేమగా కోరారు. గ్రామస్తులు పిల్లల మంచి కోర్కెలను ఆచరించారు. వారి పిల్లలకు నీటి పొదుపు తెలిపారు.
కొద్ది రోజుల తర్వాత వర్షాలు వచ్చాయి. చెరువు మళ్లీ నిండిపోయింది. శెట్టుపల్లి గ్రామం మళ్లీ పచ్చగా మారింది. పరంధామయ్య గారు పిల్లలను చూసి ఆనందపడ్డారు.
”మీరు చిన్నవాళ్లైనా, పెద్ద మార్పు తీసుకువచ్చారు” అని అభినందించారు.
అభిరామ్‌ గర్వంగా, ”ఇది మా గ్రామం కోసం చేశాం తాతయ్య!” అన్నాడు.
నీతి:
నీరు మన జీవితానికి అత్యవసరం. దాన్ని వథా చేయకుండా జాగ్రత్తగా వాడితేనే మన భవిష్యత్తు సురక్షితం అవుతుంది. చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి.

డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -