భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నర్సింహకు సంపూర్ణ మద్దతు

భువనగిరిలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నర్సింహకు సంపూర్ణ మద్దతు– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ – భువనగిరి
నవంబర్‌ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న కొండమడుగు నర్సింహకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక అసమానతలు భారీగా పెరిగిపోతున్న క్రమంలో, వాటి నివారణకు కృషి చేస్తున్న నర్సింహ సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీలో ఉన్నారన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవాలని, ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కృషి చేస్తున్నానన్నారు. కొండమడుగు నర్సింహ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. అందువల్లనే ఆయనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతూ, భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి నర్సింహను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రభుత్వాలకు కూడా ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. ఈ పథకంలో ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా డబ్బు మొత్తాన్ని పెట్టుబడిదారులకు అప్పనంగా అర్పించడమే కన్నిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని నికరంగా వ్యతిరేకించినవని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నర్సింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, నాయకులు దాసరి పాండు, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్‌, వడ్డబోయిన వెంకటేష్‌, ఈర్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు.

Spread the love