ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘వేద వ్యాస్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ విజువల్ లోగో ఆవిష్కరణ ఘట్‌కేసర్‌లోని కేపీఆర్‌ఐటీ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమూరి ప్రతాప్ రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దశ్యాన్ని బ్యానర్ లోగోలో చిత్రీకరించారు. కేపీఆర్‌ఐటీ సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కొమూరి ప్రతాప్ రెడిహీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ లోగో ఆవిష్కరణ వేడుకకు 4 వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరై, కేరింతలు కొడుతూ వేద వ్యాస్ యూనిట్‌కు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రతాప్ రెడ్డితో పాటు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు కె. అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాధ్, నటుడు రఘుబాబు, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి రామ్ వెంకటేష్, కేటీఆర్ ఐటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, కేపీఆర్ సెక్రటరి రాకేష్ రెడ్డితోపాటు అనేకమంది ప్రముఖులు అథితులు హాజరై ‘వేద వ్యాస్’ సినిమా విజయవంతం కావాలని అభిలషిస్తూ, ప్రసంగించారు. ‘ఎస్వీకృష్ణారెడ్డి సినిమాలంటే సకుటుంబ సమేతంగా చూడొచ్చు. ఆ తరహా లోనే ‘వేదవ్యాస్’ సినిమా ఉంటుంది. అలాగే ఆ సినిమాల్లో కథ, కథనానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈసినిమాలోని సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. భిన్నకథతో రూపొందుతున్న ఈ సినిమాని త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం’ అని మేకర్స్ తెలిపారు.



