బస్తాలు నింపి ఎండలో కాపలా కాస్తున్నాం
మండుటెండలో మక్క రైతుల ‘అరిగోస’
చెట్ల నీడే ఆశ్రయం..తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు
కొనుగోలు కేంద్రాల వద్ద గుట్టలుగా నిల్వలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రైతుల ఆగ్రహం
నవతెలంగాణ-గూడూరు
టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. బస్తాలు నింపి ఎండలో కాపలా కాస్తున్నాం. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ధాన్యం కేంద్రం వద్ద ఒకరు, మక్కల కేంద్రం వద్ద మరొకరు.. ఎండలో వేసి చూస్తున్నాం.. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఏ రైతునూ కదిలించినా వారి బాధలు వర్ణనాతీతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకవైపు భగభగలాడే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మండలంలో అధికారుల లెక్కల ప్రకారం 16 వేల ఎకరాలలో మక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి 35 క్వింటాళ్ల నుండి 40క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు గత నెల 23 నుంచి గన్ని సంచుల పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం రూ.15కే ఇవ్వాల్సిన సంచిని, రైతులు బయట రూ.20పెట్టి కొనాల్సి వస్తోంది. కాంటా పూర్తయిన తర్వాత మక్కలను గోదాములకు తరలించేందుకు లారీలు దొరకడం లేదు. మార్క్‌ఫెడ్ నుంచి రోజుకు కేవలం 4లారీలు మాత్రమే వస్తుండటంతో, దిక్కుతోచని స్థితిలో రైతులు ప్రైవేట్ లారీలను ఆశ్రయిస్తూ వేల రూపాయలు నష్టపోతున్నారు.
ఇక్కడి నుంచి లోడ్ అయిన లారీలు కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట గోదాములకు వెళ్తున్నా.. అక్కడ దిగుమతిలో జాప్యం జరగడంతో లారీలు తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నుండి ఇప్పటివరకు మండలలో కొనుగోలు కేంద్రాలకు 74వేల గన్ని సంచులను రైతులకు అందజేశారు. గూడూరు కొనుగోలు కేంద్రం నుండి 70 లారీలల్లో 609 మంది రైతులకు సంబంధించి 68,490 బస్తాలు, కొల్లాపురం కొనుగోలు కేంద్రంలో 10లారీల్లో 101 రైతులకు సంబంధించి 13240. బస్తాలను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు గూడూరు కేంద్రం నుండి 54342 బస్తాలు, కొల్లాపురం కేంద్రం నుండి 5226 బస్తాలను లారీల ద్వారా తరలించారు. ఇంకా క్వాంటలు అయి గోదాములకు పంపించ వలసినవి గూడూరు నుండి 14 147, కొల్లాపురం లో 8034 బస్తాలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్నాయి. కొనుగోలు మక్కలను మార్క్ ఫైడ్ గోదాముల్లో నిల్వ చేసేందుకు కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, శారాపల్లి, చింతలపల్లి ప్రాంతాలకు లారీ లోడులను తరలిస్తున్నారు, దిగుమతిలో కూడా రోజులు ఆలస్యం పరిస్థితి నెలకొంది.
పేరుకుపోయిన మక్కలు
ప్రభుత్వం క్వింటాకు రూ.2400 కేటాయించి కొనుగోలు చేస్తుంది. బయట వ్యాపారులు రూ.1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మండలంలోని రెండు కొనుగోలు కేంద్రాలకు మక్కలను తరలించడంతో మక్కల నిల్వలు పేరుకుపోయాయి. కాంటాలు నిర్వహించి నేటికీ తరలించని మక్కలు ఉన్నాయి. ఎండల తీవ్రతతో పాటు సాయంకాలం గాలి, దుమారం తో రైతాంగం బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు.
రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షణ
కేసముద్రం రూరల్ : కేసుమద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వపురం తండా, పెద్దవ¶రి తండా, రంగాపురం, ధర్మారం తండా, అన్నారం, గాంధీ నగర్ నుండి రైతులు మక్కలు ఇక్కడి కేంద్రానికి తరలించారు. లారీల కొరత కారణంగా మక్కలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 300 మంది రైతులు కొనుగోలు కేంద్రం వద్దే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అక్కడ సరైన షెడ్లు లేక రైతులు, కూలీలు చెట్ల నీడలోనే కాలం వెలిబుచ్చుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక చెట్ల నీడలోనే రోజంతా గడుపుతున్నారు. తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఇంటి దగ్గర నుంచే నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
టోకెన్లు ఇచ్చినా..
టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. 164 బస్తాలు నింపి ఎండలో కాపలా కాస్తున్నాం.
-బానోత్ భద్రమ్మ, బొల్లపల్లి
ప్రభుత్వం విఫలమైంది
‘రైతును రాజు చేస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం మక్క రైతులను గాలికొదిలేసింది. మార్క్‌ఫెడ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలి, లేదంటే ఆందోళనలు ఉధతం చేస్తాం.
సాదుల శ్రీనివాస్,
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
త్వరలోనే కొంటాం
గోదాముల్లో దిగుమతి జాప్యం వల్లే లారీల కొరత ఏర్పడింది. వచ్చే 3, 4 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న మక్కలన్నిం టినీ కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు.
-శ్యామ్‌కుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్
వెంటనే స్పందించాలి
ధాన్యం కేంద్రం నా భార్య, మక్కల కేంద్రం వద్ద నేను ఉంటున్నాం. ఎండలో మా దంపతుల పరిస్థితి కష్టంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
-మూడు బాలరాజు, వంపు తండా



