Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు ఏవి.?

ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు ఏవి.?

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది.కూలీ అందిస్తూనే పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. పనిచేసేటప్పుడు ప్రమాదం జరిగితే చికిత్స కూడా అందించాల్సి ఉంటుంది. పని చేస్తున్న కూలీలకు పనిముట్లు కూడా అందించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రారంభంలో పనిముట్లు అందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో పని చేసే కూలీలే పనిముట్లు కొనుగోలు చేస్తూ పనులు చేపడుతున్నారు. దీంతో కూలీలకు అదనపు భారం పడుతోంది. గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పనిముట్లు అందక, బయట సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, పని ప్రదేశంలో టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వేసవిలో కూడా మండుటెండల్లో పనిచేయడం వల్ల కూలీలు అనారోగ్యానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం, 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో పనులు ఉంటే రవాణా భత్యం, వేసవిలో పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి, కానీ అవి ఆచరణలో కనిపించడం లేదు.


జిల్లాలో 5.17 లక్షల మంది కూలీలు..
జిల్లాలో 23 మండలాల పరిధిలో 5.17 లక్షల మంది కూలీలు ఉన్నారు. జిల్లాలో 2.49 లక్షల జాబ్‌కార్డులు, క్రియాశీలక జాబ్‌కార్డులు 1.67 లక్షలు ఉన్నాయి. ఇందులో 2.88 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. గతంలో పథకం ప్రారంభించిన సమయంలో కూలీలకు అవసరమైన గడ్డపారలు, తట్టలు,పారలు సరఫరా చేసింది. కూలీలు చెరువుల్లో పూడికతీత, పంట కాలువలు, కందకాలు, గుంతలు తవ్వడం తదితర పనులకు వినియోగించేవారు. అయితే గత పదేళ్లుగా పనిముట్ల పంపిణీ లేదు. దీంతో ఉపాధి పనికి వెళ్తున్న కూలీలకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. ప్రతి ఏటా కూలీలు పనిముట్లను కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూలీలు వాపోతున్నారు. చాలీచాలని కూలీతో పని చేస్తున్నా అదనంగా పనిముట్లను కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో మరింత భారంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు గతంలో ఇచ్చినట్లుగా పనిముట్లను పంపిణీ చేయాలని కూలీలు కోరుతున్నారు.

సరఫరా లేదు: ఏపీఓ రింగు కృష్ణయ్య
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పనిముట్లను ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. గతంలో కూలీలకు పనిముట్లు ఇచ్చారు.గత కొన్ని సంవత్సరాల నుంచి పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం సరఫరా చేసినట్లయితే కూలీలకు అందజేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -