వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జుకంటి పౌలు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక,పటేల్ గూడెం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలకు తాగునీరు,నీడ,ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జుకంటి పౌలు డిమాండ్ చేశారు.బుధవారం ఆయా గ్రామాల్లో పనులను పరిశీలించిన ఆయన,ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలకు కొంగు బంగారంలా ఉన్న ఉపాధి హామీ చట్టం ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.గతంతో పోలిస్తే పని దినాల కల్పనలో తగ్గుదల, బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితులు లక్షలాది మంది కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధి హామీ పథకానికి నిధుల కోతలు విధిస్తూ వస్తోందని,గత ఏడాది నుంచి పని దినాలను కూడా తగ్గిస్తున్నారని విమర్శించారు.నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, చేసిన కూలికి గిట్టుబాటు కాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
అదేవిధంగా పాత చట్ట స్థానంలో కొత్త నిబంధనలతో పథకాలను అమలు చేయడం, ఆధార్ అనుసంధానం,ఫోటో క్యాప్చర్ విధానం తప్పనిసరి చేయడం వల్ల కూలీలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫోటో క్యాప్చర్ విధానం సరిగా పనిచేయకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని,దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పనిముట్లు (గడ్డపారలు, వారలు) అందించడంతో పాటు కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మోత్కూర్ మల్లయ్య,కొంగరి కలమ్మ,పైసా సంతోష్,భీమగాని హేమ,కొమ్మూరి అనూష,గ్యార భాస్కర్,పొన్నం లక్ష్మయ్య,గ్యార పద్మ,సునీత,బొమ్మకంటి జ్యోతి,ఎంటిక శ్రీలత, కొండం నీరజ,కాల్వ రజిని,నల్గొండ మంజుల,తాడూరి బాలబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.



