ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చెప్పారు. బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని మార్కెట్ లో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్టాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా కల్పించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేర గన్నీ బ్యాగులు, టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డిఓ సురేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.



