వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకమైన గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతిని అందజేస్తారు. అలాంటి బహుమతి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరుగురు మహిళా కార్యకర్తలకు ప్రదానం చేశారు. దాతలైన రిచర్డ్, రోడా గోల్డ్‌మన్ 1989లో ఈ బహుమతిని స్థాపించినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ఈ పురస్కార గ్రహీతలందరూ మహిళలే కావడం విశేషం. నైజీరియాకు చెందిన ఇరోరో తాన్షి, దక్షిణ కొరియాకు చెందిన బోరిమ్ కిమ్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన సారా ఫించ్, పపువా న్యూ గినియాకు చెందిన థియోనిలా రోకా మాట్‌బాబ్, యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన అలన్నా అకాక్ హర్లీ, కొలంబియాకు చెందిన యువెలిస్ మొరాలెస్ బ్లాంకో ఈ జాబితాలో ఉన్నారు. ఇంతటి గొప్ప పురస్కారానికి ఎంపికైన వారి కృషి గురించి క్లుప్తంగా నేటి మానవిలో…
సాధారణంగా “గ్రీన్ నోబెల్”గా వర్ణించబడే గోల్డ్‌మన్ బహుమతి గ్రహీతలను ప్రపంచంలోని ఆరు ప్రధాన ప్రాంతాల నుండి ఎంపిక చేస్తారు. వారిలో ప్రతి ఒక్కరూ బహుమతి సొమ్ముగా $200,000 అందుకుంటారు. “ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రాణాలను కాపాడే వాతావరణ విధానాలను అమలు చేయడానికి మనం తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ, నిజమైన నాయకులు మన చుట్టూనే ఉన్నారని స్పష్టమవుతోంది” అని ఈ సందర్భంగా గోల్డ్‌మన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు జాన్ గోల్డ్‌మన్ అన్నారు.
తీవ్రంగా అడ్డుకున్నారు
“ధైర్యం, కఠోర శ్రమ, ఆశ అనేవి అర్థవంతమైన పురోగతిని సాధించడంలో ఎంతగానో దోహదపడతాయనడానికి 2026 బహుమతి విజేతలే తిరుగులేని నిదర్శనం.” దక్షిణ, మధ్య అమెరికా ప్రాంత విజేత అయిన మొరాలెస్ బ్లాంకో, కొలంబియాలో వాణిజ్య ఫ్రాకింగ్‌ను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. దీనికోసం ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద చమురు కంపెనీలతో పోరాడారు. 24 ఏండ్ల ఈమె, ప్యూర్టో విల్చెస్ అనే ఆఫ్రో-కొలంబియన్ కమ్యూనిటీలోని మాగ్డలీనా నది ఒడ్డున ఉన్న జాలర్ల కుటుంబంలో పెరిగింది. “మాకు ఆ నది తప్ప మరేమీ లేదు, ఆ నది నన్ను ఓ తల్లిలా చూసుకుంటుంది” అని ఆమె అన్నారు.
బెదిరింపులకు గురయినా…
2018లో జరిగిన ఒక భారీ చమురు లీకేజీ ఘటన తర్వాత ఆమె తన నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ ఘటన వల్ల ఎన్నో కుటుంబాలు సొంత ప్రాంతాన్ని విడికి వెళ్లిపోవల్సి వచ్చింది. అంతేకాదు వేలాది జంతువులు మరణించాయి. దీనికి నిరసనగా ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. దాంతో ఆమె అనేక బెదిరింపులకు గురయ్యింది. అంతేకాదు తాత్కాలికంగా ఆమె వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ క్రియాశీలత ప్రాజెక్టులను నిలిపివేయడానికి, కొలంబియా 2022 ఎన్నికలలో ఫ్రాకింగ్‌ను ఒక ప్రధాన సమస్యగా మార్చడానికి సహాయపడింది.
శిలాజ ఇంధనాలపై పోరాటం
ఈ ఏడాది బహుమతి పొందిన మిగతా ఐదుగురిలో ఇద్దరు కూడా శిలాజ ఇంధనాలపై పోరాటం చేశారు. ఆ ఉద్యమంపైననే తమ ప్రయత్నాలను కేంద్రీకరించారు. ఈ శిలాజ ఇంధనాలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు, అలాగే స్థానికంగా కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఆసియా విజేత అయిన బోరిమ్, ‘యూత్ 4 క్లైమేట్ యాక్షన్’ అనే సంస్థను ప్రారంభించారు. ప్రభుత్వ వాతావరణ విధానం భవిష్యత్ తరాల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం నుండి ఆమె ఒక తీర్పును గెలుచుకున్నారు. ఈ ఖండంలో యువత నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి విజయవంతమైన వాతావరణ వ్యాజ్యం ఇది.
చమురు తవ్వకాలకు వ్యతిరేకంగా
యూరప్ విజేత అయిన ఫించ్, తన బహుమతి సొమ్మును శిలాజ ఇంధనాలపై పోరాటం కొనసాగించడానికి ఉపయోగిస్తానని ‘ది టైమ్స్’ పత్రికకు తెలిపారు. వీల్డ్ యాక్షన్ గ్రూప్‌తో కలిసి ఆమె ఒక దశాబ్దానికి పైగా ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో చమురు తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. శిలాజ ఇంధనాలను వెలికితీయడానికి అనుమతి ఇచ్చే ముందు, ప్రపంచ వాతావరణంపై వాటి ప్రభావాలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ జూన్ 2024లో సుప్రీం కోర్టు నుండి “ఫించ్ తీర్పు”ను సాధించారు. మరో ఇద్దరు గ్రహీతలు మైనింగ్ ప్రాజెక్టుల విధ్వంసకర పర్యావరణ ప్రభావానికి వ్యతిరేకంగా పోరాడారు.
అభయారణ్యాన్ని కాపాడేందుకు
ద్వీపాలు, ద్వీప దేశాల విజేత అయిన పాపువా న్యూ గినియాకు చెందిన రోకా మాట్‌బాబ్, ఒక విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించారు. దీని ఫలితంగా తిరుగుబాటు తర్వాత 35 ఏండ్ల కిందట మూసివేయబడిన తన పంగునా రాగి గని వల్ల కలిగిన పర్యావరణ, సామాజిక విధ్వంసాన్ని పరిష్కరించడానికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మైనింగ్ కంపెనీ అయిన రియో టింటో అంగీకరించింది. ఉత్తర అమెరికా అవార్డు గ్రహీత, అమెరికాలోని యుపిక్ జాతికి చెందిన అకాక్ హర్లీ, ప్రపంచంలోనే అతిపెద్ద వన్య సాల్మన్ చేపల వలసలతో సహా అలస్కాలోని బ్రిస్టల్ బే ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థలకు ముప్పు కలిగించే ఒక భారీ రాగి, బంగారు మైనింగ్ ప్రాజెక్టును ఆపడానికి 15 గిరిజన జాతులతో కలిసి విజయవంతంగా పోరాడారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా విజేత అయిన నైజీరియాకు చెందిన తాన్షి అంతరించిపోతున్న పొట్టి తోక గల గుండ్రపు ఆకు గబ్బిలాన్ని తిరిగి కనుగొని, మానవ ప్రేరిత కార్చిచ్చుల నుండి దాని ఆశ్రయమైన అఫీ పర్వత వన్యప్రాణుల అభయారణ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారు.



