Friday, May 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆదివాసుల బతుకులింతేనా?

ఆదివాసుల బతుకులింతేనా?

- Advertisement -

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడిచాయి. అంతరిక్ష‍ంలోకి పయనిస్తున్నాం, సాంకేతికంగా ఎంతో ముందుకు సాగుతున్నాం. మరి దేశంలో మూలవాసుల పరిస్థితి ఏమిటి? దాదాపు ఎనిమిది దశాబ్దాలు తర్వాత కూడా స్వాతంత్ర్య ఫలాలు వారికి అందడం లేదా? వారు ఇంకా మారుమూల అడవుల్లో కొండ కోనల్లోనే మగ్గుతున్నారు. అభివృద్ధికి దూరంలోనే ఉన్నారు. రవాణా సౌకర్యం ఉండదు. విద్యుత్తు అంటే తెలియదు. కందమూలాలు తింటూ అటవీఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. తరతరాల నిరక్షరాస్యత వారికి శాపంగా పరిణమించింది. నేటికీ ప్రభుత్వ పథకాలు వారికి చేరడం లేదు. ఆదివాసీలు ఇంకా నిరుపేదలుగానే కారడవుల్లో మగ్గుతున్నారు. గర్భిణులను, జబ్బు వచ్చిన వారిని డోలీలలోను, మంచాల మీద మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడిచి సమీప పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే సదరు వ్యక్తులు మరణించడం లాంటివార్తలు ఎన్నో చదివాం.

ఎందుకీ దుస్థితి? ఎందుకింత అలసత్వం? ఏమైంది మనం ఘనంగా చెప్పుకునే అభివృద్ధి? అదంతా అంకెల గారడీయేనా? ఏ ప్రాజెక్టులు కట్టినా లేక కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ తవ్వకాలకు లీజుకిస్తూ అనుమతులిచ్చినా అందుకు మొదటగా బలయ్యేది ఆదివాసీలే. వారి భూములు పోతాయి, వారి గూడు చెదిరిపోతుంది. అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగించేవారు మనం చెప్పుకునేనాగరిక సమాజంలో మనగలగలేరు. ప్రభుత్వాలేమో వారిని అడవుల నుండి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీలకు చదువు విలువ తెలియదు. చదువుకునే అవకాశాలు కూడా తక్కువే.సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితులు వారికి లేవు. అందుకే తరతరాలుగా అజ్ఞానంలో మగ్గుతూ తరచూ మోసాలకు గురవుతుంటారు.}

ఇటీవల ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేసింది.మనం చెప్పుకుంటున్న అభివృద్ధిని నిగ్గదీసింది. అజ్ఞానానికి, అమాయకత్వానికి ఆదివాసీలు పరాకాష్టగా ఈ ఘటన వెలుగు చూసింది. జీతూ ముండా అనే వ్యక్తి తన సోదరి ఆమె మరణం తర్వాత, ఆమె దాచుకున్న రూ.19,300 ఇవ్వాలని కోరగా బ్యాంకు అధికారులు డెత్ సర్టిఫికెట్ లేదా ఏదైనా సాక్ష్యం చూపించమని కోరారు. చివరకు జీతూ నిస్సహాయ పరిస్థితుల్లో కార్యాలయాల చుట్టూ తిరగలేక బలమైనసాక్ష్యంగా తన సోదరి ఆస్తిపంజరాన్ని బ్యాంకు అధికారులకు చూపించాడు. ఈ ఘటన మన వ్యవస్థ దుస్థితిని తెలుపుతుంది. ఒక పేద గిరిజనుడిని అందునా నిరక్షరాస్యుడిని పలుమార్లు తిప్పుకున్న బ్యాంకు అధికారులు ఒక పెద్ద మనిషి, ధనవంతుడు, లేదా ఒక కార్పొరేట్ వ్యక్తిని ఇన్నిసార్లు తిప్పుకుంటారా? అంటే న్యాయం వ్యక్తిని బట్టి మారుతుంటుందా? నిబంధనలు ఉండవలసిందే కానీ, అవి అందరికీ ఒకే తీరుగా ఉండాలి.

కావలసిన డాక్యుమెంట్లు ఉన్నా లేకపోయినాకార్పొరేట్ కంపెనీలకు క్షణాల్లో రుణం మంజూరు అవుతుంది. కొంతమంది బ్యాంకు మేనేజర్లు పలుకుబడి గల వారి ఇళ్లకు వెళ్లి మరీ చెక్కులందజేస్తారు. కానీ ఒక పేద గిరిజనుడికి సంబంధించి ఆయనకు అందవలసిన డబ్బు విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు. వారి మీద తమ ప్రతాపం చూపిస్తారు. మన అధికారులు సహజంగా వినడానికి ఇష్టపడరు. రూల్స్ పదేపదే వల్లే వేస్తారు. బలమైన సాక్ష్యం తీసుకువస్తే బ్యాంకు అధికారులు కదల్లేదు. అదే ధనవంతుల విషయంలో చాలా గౌరవంగా మర్యాదతో మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. క్షణాల్లో పని పూర్తి చేస్తారు. నిబంధనల మాటున జరిగే అక్రమాలు మనకు తెలియనివి కావు.సమాజం ఉదాసీనత అధికారులు పబ్బం గడుపుకోవడానికి సహాయ పడుతున్నది.

చదువుకున్న వాడికైనా ఈ రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల వంటివి సంపాదించ డానికి కనీసం నెల రోజులు పడుతుంది. అనేకమార్లు కార్యాలయాలకు తిరగాలి. అక్కడ పని ఎంత త్వరగా పూర్తి అవుతుందో అందరికీ అనుభవమే. మరి చదువు రాని పేద అమాయక గిరిజనుడికి పని ఎప్పుడు పూర్తయ్యేను? ఇలాంటి ఘటనలే వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయేలా చేస్తాయి. మరి కొంతమంది అధికారులు, కొన్ని ప్రభుత్వాధినేతలు వాట్సాప్ లోనే మీకు అన్ని పనులు అయిపోతాయి, టెక్నాలజీ మీ చేతిలోనే ఉంటుంది, అందులోనే అన్నిపనులు చేయవచ్చు అంటూ ఊదరగొడుతున్నారు. నిరక్షరాస్యుడైన పేద గిరిజనుడు స్మార్ట్ ఫోన్ వాడే పరిస్థితిఉందా? అందులో అప్లికేషన్లు, ఓటీపీలు అతనికి సాధ్యమేనా? దేశంలో ఇంకా నలభై కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడేపరిస్థితిలో లేరు.

వారు కొనుక్కోలేరు, వారి ప్రాంతంలో సిగ్నల్ ఉండదు. సాంకేతిక రంగంలో మన అభివృద్ధి నేతి బీరకాయ సామెతను గుర్తు చేస్తున్నది. నిబంధనలు వ్యవస్థను సక్రమంగా నడిపించడానికి. అవి మనంరాసుకున్నవే, తయారు చేసుకున్నవే! కానీ మానవత్వం ముందు ఏ నిబంధనలు పనికి రావని వ్యవస్థ గ్రహించాలి. కావాలనుకుంటే బ్యాంక్ అధికారులు ఆ గిరిజనుడికి సకాలంలో సాయం చేయలేరా? అందుకోసం కలెక్టర్ కల్పించుకోవాలా? మరి ఇప్పుడు నిబంధనలు ఏమయ్యాయి? ‘అందరూ సమానమే కానీ కొందరు ఎక్కువ సమానం’ అన్న జార్జ్ ఆర్వెల్ మాటలను మన అధికారులు నిజం చేస్తున్నారు. ఇంకా నయం బ్యాంక్ అధికారులు ఈ అస్తిపంజరం తన అక్కది అని చెప్పడానికి జీతూను నిరూపణ అడగకపోవడమే సంతోషం.

శ్రీ శ్రీ కుమార్, 9440350092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -