ముఖ్యమంత్రి కుర్చీ కోసం హోరాహోరీ పోరు
ఎమ్మెల్యేతో పరిశీలకులు- వన్ టూ వన్ మీటింగ్.. ఏఐసీసీ కసరత్తు
ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు
రేసులో వి.డి.సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల
ఈ నేతల మద్దతుదారుల మధ్య పోస్టర్ వార్
మే 10కల్లా సీఎం ఎంపికపై ప్రకటన?
తిరువనంతపురం : కేరళ నూతన ముఖ్యమంత్రి రేసు రసవత్తరంగా మారింది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ, నూతన సీఎం ఎంపికకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్‌పీ) సమావేశాన్ని పర్యవేక్షించడానికి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించిన పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ తిరువనంతపురంనకు చేరుకున్నారు. నగరంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన సీఎల్‌పీ సమావేశంలో వారు పాల్గొన్నారు. కేరళ సీఎం ఎంపికపై తుది నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. వెంటనే ఏఐసీసీ పరిశీలకులు ప్రతీ ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా ముఖాముఖిగా మాట్లాడారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనే దానిపై అందరు ఎమ్మెల్యేల రహస్య ప్రాధాన్యతలను నమోదు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన సమాచారంలోని ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయానికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రాధాన్యం ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విధంగా కేరళ సీఎం ఎంపిక ప్రక్రియతో ఓ వైపు తిరువనంతపురం, మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ వేడి రాచుకుంది.
కేసీ వేణుగోపాల్‌కు ఛాన్స్ దక్కేనా?
పదేండ్ల విరామం తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూటమి కేరళలో గెలిచింది. 102 సీట్ల మెజారిటీని సాధించింది. ఇప్పుడు సీఎం సీటు కోసం జరుగుతున్న పోటీలో ప్రధానంగా ముగ్గురు అగ్రనేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారే వి.డి.సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) హోదాలో ఉన్నారు. పార్టీ హైకమాండ్‌లోని ముఖ్య నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రనేత రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉంది. దీనికి తోడు మాజీ కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్ బహిరంగ మద్దతును ప్రకటించ డంతో, రాష్ట్ర సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారనే టాక్ మొదలైంది. మాజీ సీఎంలు కే కరుణాకరన్, ఊమెన్ చాందీల బాటలోనే కాంగ్రెస్‌ను వ్యవస్థాగతంగా కేసీ వేణుగోపాల్ బలోపేతం చేస్తున్నారని ఇటీవలె కె.సుధాకరన్ వ్యాఖ్యానించారు. కేసీ వేణుగోపాల్ 2024 సాధారణ ఎన్నికల్లో కేరళలోని ఆలప్పుళ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. లోక్‌సభకు ఎన్నికవ్వడానికి ముందు ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉండేవారు.
ప్రతిపక్ష నేతగా రాణించిన వి.డి. సతీశన్
2021 నుంచి కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వి.డి. సతీశన్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన గత ఐదేండ్లు గా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి ఘనవిజయం సాధించారు. కేరళ సీఎం పదవికి ఈయనే ప్రధాన పోటీదారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఇచ్చిన తీర్పు వి.డి. సతీశన్ నాయకత్వానికి ప్రత్యక్ష ఆమోదం లాంటిదని ఆయన మద్దతుదారులు, ముస్లిం లీగ్ వంటి ప్రధాన మిత్రపక్షాలు వాదిస్తు న్నాయి. తనకు సీఎం పదవిని కేటాయించ కుంటే, ఇతరత్రా మంత్రి పదవులను అంగీకరించకూడదు అనే గట్టి వైఖరిని వి.డి.సతీశన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏఐసీసీ పరిశీలకుల నివేదికే కీలకం
రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు సాగేలా చూసేందుకు ఏకే ఆంటోనీ వంటి సీనియర్ నాయకులతో, ముస్లిం లీగ్ వంటి కీలక సంకీర్ణ భాగస్వాములతోనూ ఏఐసీసీ పరిశీలకులు సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో తాము గుర్తించిన, నమోదు చేసిన వివరాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారు కాంగ్రెస్ హైకమాండ్‌కు సమర్పించనున్నారు. గురువారం రాత్రే ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. బహుశా ఆదివారం (మే 10) నాటికి సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తుది ప్రకటనను విడుదల చేయొచ్చని పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్ తెలిపారు. సంస్థాగత సీనియారిటీతో పాటు స్థానిక నాయకత్వ యోగ్యతలను కలిగిన కాంగ్రెస్ నేతను సీఎంగా ఎంపిక చేసే వరకు దీనిపై ఉత్కంఠ కొనసాగనుంది.
పాలనా, సంస్థాగత అనుభవం కలిగిన రమేశ్ చెన్నితాల
సీఎం రేసులో బలమైన పోటీదారుగా నిలుస్తున్న మరో సీనియర్ నేత పేరు రమేశ్ చెన్నితాల. ఆయన గతంలో కేరళ రాష్ట్ర హోం మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (2016-2021), కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రమేశ్ చెన్నితాల శాశ్వత ఆహ్వానితుడిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు పరిశీలకుడిగా, ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు చూస్తున్నారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హరిపాడ్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి ఘనవిజయం సాధించారు.ఆయనకు దశాబ్దాల పరిపాలనా, సంస్థాగత అనుభవం ఉంది.
మద్దతుదారుల మధ్య పోస్టర్ వార్
కేరళ నూతన సీఎం ఎవరనే దానిపై వి.డి.సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ మద్దతుదారుల మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఆలప్పుళ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఆయన సొంత జిల్లా కూడా ఆలప్పుళే. ఒకవేళ వేణుగోపాల్‌ను కేరళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆలప్పుళలో మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఈనేపథ్యంలో ఆలప్పుళపై ఉప ఎన్నికను రుద్దే ప్రయత్నాన్ని మానుకోండి అనే సందేశంతో, కాంగ్రెస్ సహయాత్రికులు పేరుతో ఆలప్పుళ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి. వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా ఆలప్పుళ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఎదుట వెలిసిన పోస్టర్లను ఒక వర్గం కార్యకర్తలు చించివేశారు. కొట్టాయం వంటి ప్రాంతాల్లో వేణుగోపాల్‌ను విజయ శిల్పి అని పొగిడే పోస్టర్లపై గుర్తుతెలియని వ్యక్తులు నల్ల రంగు పూశారు. మరోవైపు, ఇందిరా భవన్ బయట వేణుగోపాల్‌కు మద్దతుగా ఫ్లెక్సీ బోర్డులు కనిపించాయి. ఈవిధమైన అంతర్గత కలహాలు, ప్రజల్లో వ్యక్తమవుతున్న భావోద్వేగాల వల్ల కేరళ సీఎం ఎంపిక ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారుతోంది.



