– ఏ పార్టీ అధికారంలోకొచ్చినా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి : ప్రొఫెసర్ హరగోపాల్
– గన్‌పార్కు నుంచి నిరుద్యోగ చైతన్య యాత్ర ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ పాలనలో ఉద్యమ నినాదమైన నియామకాల అంశం పక్కకుపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమేననీ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉద్యోగ నియామకాల ప్రక్రియను సరైన పద్ధతిలో చేపట్టి యువతకు భవిష్యత్ చూపాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గర నుంచి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ..”నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అని జయశంకర్ సార్ పదేపదే చెప్పేవారు. అది ఇంకా నెరవేరలేదు. ఉద్యమ నినాదమైన ఉద్యోగ నియామకాల ఆకాంక్ష నెరవేరుతుందని తెలంగాణ యువత కేసీఆర్‌ను నమ్మి గెలిపించింది. రెండోసారైనా నెరవేర్చకపోడా? అనే ఆశతో మళ్లీ గెలిపించింది. కానీ, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా జరగలేదు. సిటీ లైబ్రరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీ, అశోక్‌నగర్ హాస్టళ్లల్లో వేలాది మంది పోటీపరీక్షల కోసం కష్టపడుతున్నారు. ప్రభుత్వమేమో నోటిఫికేషన్లను సరిగా వేయడం లేదు. వేసినా పరీక్ష పత్రాలు లీకవుతున్నాయి. అనేక అవకతవకలు జరిగాయి. ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనూ ఎండగట్టాలని సూచించారు. ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ..ప్రజావ్యతిరేక పాలన రాష్ట్రంలో నడుస్తున్నదన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల పాఠశాలలను మూసివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు నిర్వీర్యమైపోయాయని వాపోయారు. 33 జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 3 లక్షల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఏఐసీసీ మీడియా ఇన్చార్జి అజరు మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ ఓ నిరుద్యోగి ఉన్నారనీ, వారంతా తలుసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం 25 లక్షలకుపైగా ఉన్న నిరుద్యోగుల సమస్య పరిష్కారం ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణలో అత్యధిక నిరుద్యోగముందని చెప్పారు. ఈ యాత్రకు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయని తెలిపారు. రియాజ్ మాట్లాడుతూ..ఈ యాత్రకు తాను కన్వీనర్‌గా, రెండు బస్సు యాత్రలకు లీడర్లుగా సలీంపాషా, అరుణకుమార్ ఉంటారని తెలిపారు.
ఉత్తర, తెలంగాణ జిల్లాల్లో రెండు యాత్రలు 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తాయన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..విద్యార్థుల చావులను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తూ వారిపై లేనిపోని నిందలు మోపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదనపు పోస్టులు క్రియేట్ చేస్తామని చెప్పారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్..పరీక్ష..రిజల్ట్…నియామక పత్రాల అందజేతను నిర్ధిష్ట కాలంలో టైం ప్రకారం పూర్తిచేస్తామని హామీనిచ్చారు.
టికెట్ రాకున్నా..
పార్టీ గెలుపు కోసం పనిచేస్తా – హాంగ్ కోసం బీజేపీ ప్రయత్నం :అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పార్టీ కోసం రెబల్స్‌గా నామినేషన్ చేసిన అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడం చాలా సంతోషమని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. నాకు టికెట్ రాకున్నా… పార్టీ గెలుపు కోసం పని చేస్తానన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘2014లో నేను కాంగ్రెస్‌లో చేరిన నెల రోజులకే నాకు టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తా. టికెట్ రాని నేతలంతా కలిసి 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయి కారి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ మీటింగ్‌లకు లేని నిబంధనలు కాంగ్రెస్‌కే ఎందుకు?. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. హాంగ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది’ అని విమర్శించారు. తనకు టికెట్ రాలేదని చాలా మంది ఫోన్లు చేశారని తెలిపారు. కాంగ్రెస్‌లో మాల మాదిగలు అన్నదమ్ముల్లా ఉంటామని తెలిపారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా మరో నలుగురు నియామకం
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా కొత్తగా మరో నలుగుర్ని నియమించింది. ఈమేరకు బుధవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ ఆ నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. అల్దాస్ జానయ్య, చీటి. ఉమేష్‌రావు, ఠాగూర్ బాలాజీసింగ్, కకర్ల అశోక్‌లను నియమించారు.