Tuesday, May 12, 2026
E-PAPER
Homeమానవిచరిత్ర సృష్టించిన కీర్తన

చరిత్ర సృష్టించిన కీర్తన

- Advertisement -

శివకాశి అనగానే మనకు దీపావళి టపాసులు గుర్తుకొస్తాయి! బాణాసంచా పేలి మంటలు వ్యాపించిన మరణాలు కళ్ళ ముందు కదలాడుతాయి! ఇప్పుడు శివకాశి అంటే “తెలుగు తూటా” కీర్తన సంపత్‌ గుర్తుకొస్తోంది. చక్కగా తెలుగు మాట్లాడే ఆమె టీవీకే పార్టీ నుంచి పోటీ చేసి శివకాశి తొలి మహిళా ఎమ్మెల్యేగా చర్రిత సృష్టించారు. అంతేకాదు విజయ్ క్యాబినెట్లో బెర్త్ దొరకబుచ్చుకుని తమనాడు చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా మంత్రిగా రికార్డు నమోదు చేసిన 29 ఏండ్ల ఆ యువతి పరిచయం నేటి మానవిలో…

తెలుగు మూలాలు వున్న కీర్తన గతంలో తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉండి ఆమె తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో గెలుపుకు తన వంతు కృషి చేశారు. నారా లోకేష్ కు పొలిటికల్ స్ట్రాస్ట్టటజిస్ట్ గా వ్యవహరించారు. కొంతకాలం పశ్చిమ బెంగాల్ గత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సోషల్ మీడియా సలహాదారులుగా కూడా వ్యహరించారు. అయితే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసిన కీర్తనలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. పుట్టి పెరిగిన జిల్లా, ఊరికి ఏమీ చేయలేకపోతున్నాను అన్న బాధ పట్టి పీడించేది. అందుకనే ఉద్యోగాన్ని వదులుకుని శివకాశికి చేరుకున్నది. అక్కడ ఒక ఆఫీసు పెట్టి స్ధానిక సమస్యలు, వాటి పరిష్కారంపై పనిచేయటం మొదలుపెట్టారు. ఎలాగూ డిజిటల్ మీడియాలో బాగా పట్టుంది కాబట్టి శివకాశిలోని సమస్యలను హైలైట్ చేస్తు జనాలందరి దృష్టిలో సమస్యలు పడేట్లు చేయగలిగారు. విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ కాల్వలపైన ప్రతిరోజు డిజిటల్ మీడియా వేదికగా పోరాటం చేశారు. ఆమెపోరాటానికి స్ధానికుల మద్దతు విపరీతంగా పెరిగిపోయింది.

మడమ తిప్పలేదు
కీర్తన చేస్తున్న కార్యక్రమాలు చూసి విజయ్‌ ‌పిలిచి మరీ ఆమెకు టికెట్‌ ఇచ్చారు. అలా టీవీకే పార్టీలో చేరి పార్టీ గెలుపు కోసం శ్రమించారు. ఆ శ్రమకు గుర్తింపే తొలి విడతలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో హిందీ దాదాపు నిషేధం. అక్కడ హిందీ మాట్లాడితే ఆటో వాళ్ళు కూడా ఇష్టపడరు. అలాంటిది తమిళనాడులో కీర్తన అవలీలగా హిందీ భాష మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. శివకాశీలో అయితే ప్రత్యర్థి పార్టీలు దీన్నే ఆమెను విమర్శించేందుకు ఉపయోగించుకున్నారు. అయినా మడమ తిప్పలేదు కీర్తన. హిందీలో మాట్లాడి తమ సమస్యను ఢిల్లీ వరకు వినిపించాలనేది విజయ్ ఆలోచన. పైగా కీర్తన పొలిటికల్ స్ట్రాటజీలు విజయ్ కి బాగా నచ్చాయి. పది సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సెంగోట్టాయన్ ఒక వైపు, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ అద్భుత ఆలోచనలతో జెన్ జెడ్‌ను ఆకట్టుకునే కీర్తనను ఇంకో వైపు పెట్టుకుని, విజయ్ పార్టీని బ్యాలెన్స్ చేసిన తీరు విజయానికి చాలా దగ్గర చేసింది.

విరుదై మగళ్ కీర్తన
కీర్తన పై నమ్మకం, కీర్తన గెలిచి వస్తుందనే ఆత్మ విశ్వాసం. అందుకే విజయ్ ఈ ఎన్నికల్లో శివకాశి ప్రచారానికి కూడా వెళ్ళలేదు. దటీజ్ కీర్తన క్యాలీబర్. విరుదై మగళ్ కీర్తన… ఇదే ఆమె నినాదం. తెలుగులో చెప్పాలంటే మీ విరుదు నగర్ బిడ్డ కీర్తన. ఈ ఒక్క మాటతో 70 ఏండ్ల చరిత్రను శివకాశీలో తిరగ రాసి విజయ దుందుభి మోగించింది. డీఎంకే అభ్యర్థి అశోకన్ ను 11,670 పైచిలుకు ఓట్లతో ఓడించింది. అన్నా డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి రాజేంద్రన్ బాలాజీకి చుక్కలు చూపించి మూడవ స్థానానికి నెట్టి వేసింది.

గత అనుభవాలతో…
కీర్తనకు తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని భాషల్లోను మంచి పట్టు వుంది. రాజకీయాలతో తనకున్న పరిచయాలు, గత అనుభతో లతో జననాడితో పాటు బ్యూరోక్రసి మనస్తత్వాలు తెలిసి వచ్చాయని, ఆ అనుభవం శివకాశిలో గెలుపుకు ప్రధాన కారణం అని కీర్తన తెలిపారు. శివకాశిలో మౌలిక సౌకర్యాలు మెరుగు పరచడం, క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే ప్రధాన లక్ష్యాలుగా పని చేస్తానని తాను ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారని, మహిళగా తొలి అవకాశం ఇవ్వండి అని కోరడం కూడా తనకు ప్లస్ పాయింట్ అయ్యిందని ఆమె అన్నారు. అలాగే శివకాశీలో తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండడంతో తెలుగులో ఆమె చేసిన ప్రచారం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఆ నియోజవర్గం నుండి పోటీ చేసిన మొదటి మహిళ కూడా కీర్తననే కావడం విశేషం.

కొత్త వ్యూహాలతో
విరుద్ నగర్ లో 1996లో పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో తమిళ మాద్యమంలో చదువుకుని, మధురై కామరాజ్ యూనివర్సిటీ కి చెందిన కళాశాల నుంచి మ్యాథ్స్ లో డిగ్రీ పూర్తి చేశారు కీర్తన. అనంతరం పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 2019లో స్టాటిష్టిక్స్ లో పీజీ పూర్తి చేశారు. అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటారు ఆమె. గతంలో పని చేసిన రాజకీయ అనుభవాలే ఆమెను విజయ్ పార్టీలో కీలకంగా మార్చాయి. భవిష్యత్ లో ఇంకా మరింతగా బలమైన రాజకీయ శక్తిగా గుర్తింపు దక్కే అవకాశాలు ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డా. మహ్మద్ రఫీ, 9848992826

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -