Tuesday, May 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితెలంగాణలో విద్యాసంస్కరణ ఉత్తిమాటేనా?

తెలంగాణలో విద్యాసంస్కరణ ఉత్తిమాటేనా?

- Advertisement -

నూతన విద్యా సంవత్స రం మొదలు కాబోతోంది, రాష్ట్రంలో అందుకు తగిన ప్రణాళికలు లేవు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ పదిహేనుకల్లా పాఠశాలలకు అందిం చాల్సిన సామాగ్రి అందజేస్తామని ప్రకటించారు. ఆయన పేర్కొన్న ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో మార్పులు చేర్పులు ఉండబోవు. పాఠశాల సంస్కరణ ఉత్తిమాట? ఇక ఇంటర్‌‌ను పాఠశాల విద్యలో విలీనం చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలైతే ఇచ్చారు.మళ్లీ ఏమైందో? ఈ ఏడాది ఇంటర్ విలీనం జోలికి వెళ్లడం లేదని ముఖ్యమంత్రినే స్వయంగా ప్రకటించారు. అంటే కళాశాల, పాఠశాల విద్యలో మార్పులేదు.యదాతథమన్నట్లే? వాస్తవంగా విద్యా శాఖ నూతన విద్యా సంవత్సరానికి ప్రణాళిక రూపొందించాలి. ఇంటర్ విలీనం ఆర్డినెన్సు తేవాలి. కానీ తెలంగాణా పాఠశాల వ్యవస్థ గమనం అగమ్య గోచరంగా మందకొడిగా ఉంది. ఇప్పటికే సేకరించిన యుడైస్ గణాంకాల ప్రకారం గతేడాది నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. మిగిలిన 26వేల ప్రభుత్వ బడుల్లో మూడింట రెండొంతుల పాఠశాలలు అతితక్కువ నమోదుతో మూత దశకు చేరుకుంటున్నాయి. సాక్షాత్తు భారత పార్లమెంటులో ప్రకటించిన గణాంకాలు ననుసరించి గతేడాది తెలంగాణాలో1920 ప్రభుత్వ పాఠశాలలు జీరో నమోదుతో మూతపడి, మూతపడిన పాఠశాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాము. నాణ్యమైన పాఠశాల విద్యలో మనం 26వ స్థానంలో ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన విద్యావ్యవస్థ అభివృద్ధి సూచిక అంత ఆశాజనకంగా లేదు? తిరోగమన దశలోనే ఉంది. ఈ స్థితిలో ప్రభుత్వ బడిని సంస్కరించాలి, ప్రయివేటు బడిని నియంత్రించాలి. ఈ రెండూ చేయడంలో తెలంగాణా ప్రభుత్వం “నిమ్మకునీరెత్తి నట్లు వ్యవహరిస్తుంది”తప్ప ముందుకు పోవడంలేదు. మళ్లీ పాఠశాలలు తెరిచేలోగా ఓ ప్రణాళికాబద్ధ కృషి చేస్తే తప్ప పాఠశాల వ్యవస్థ సంస్కరణ సాధ్యం కాదు. ఈలోగా ఎప్పటి మాదిరిగా ‘బడిబాట’ లాంటి ఫలితం ఇవ్వని ఆర్భాటాలు మోదలౌతాయి. పాఠశాలలో తమ పిల్లలకు పూర్తి భద్రత, నాణ్యమైన విద్యా గ్యారెంటీ లభిస్తే తప్ప తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి ముందుకొచ్చే అవకాశం లేదు. ఆవాస ప్రాంత నియంత్రణ, నియమబద్దత మాత్రమే పాఠశాల నమోదు పెరుగుదలకు ఏకైక మార్గం.
ఇక ప్రయివేటు పాఠశాలల్లోవిద్యాహక్కుచట్టం నిబంధన 12(1)సి ప్రకారం బడుగు బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపునకు ముందుకు రావడంలేదు. హైకోర్టు తీర్పులు యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నారు. ఇక ప్రయివేటు విద్యావ్యవస్థలో నియంత్రణ లేని ఫీజుల మోత మోగిపోతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఏజెంట్లను నియమించు కొని ఇంటింటా ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రయివేటు విద్యావ్యవస్థ ఐఐటీ,జీ, టోఫెల్ లాంటి కోర్సులు నడపాలని తెలంగాణా విద్యా ప్రణాళికలో స్పష్టంగా ప్రకటించినా ప్రయివేటు వ్యవస్థ ఖాతరు చేయడం లేదు? ఎప్పటిలాగే తమ ప్రచారం నడిపిస్తున్నది. నేరుగా ప్రకటనలే గుప్పిస్తున్నది. కార్పోరేట్ కళాశాలలో ఫీజులు దండుకోవడం ఆగడం లేదు. వాటి పరిస్థితి తెలంగాణాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. నియంత్రణ అనే మాటకు ఇక్కడ అర్థమే మారిపోయింది.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌‌లో 26వేల కోట్లు కేటాయిం చింది. గతేడాది కంటే కేవలం మూడు వేలకోట్లు మాత్రమే ఎక్కువగానే పెంచింది. నిధులు పెంపుదల పెద్దగా లేకపోయినా తెలంగాణా విద్యా కమిషన్ రూపొందించిన “తెలంగాణా విద్యా ప్రణాళిక”ను మాత్రం ప్రకటించి కొత్త ఆశలు రేకెత్తించడం, ప్రభుత్వ బడులు సంస్కరణ చేస్తున్నట్లు ఊరించడం తప్ప ఆచరణ రూపంలో ఒక్క అడుగు ముందుకు వేసింది లేదు? బడ్జెట్‌‌లో అందుకు తగ్గ కేటాయింపులు కూడా లేవు. తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ఒక్కో పాఠశాలకు15కోట్ల ఖర్చుతో మండలానికి రెండు పాఠశాలలు నర్సరీ నుండి ఇంటర్ వరకు పూర్తి ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. తొలుత విద్యా ప్రణాళికలో ఉన్నది ఒక్కో నియోజకవర్గంలో రెండు మండలాలు, మండలానికి రెండు పబ్లిక్ స్కూల్స్ చొప్పున 200 మండలాల్లో ఈ ఏడాది 400 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తీరా బడ్జెట్ సమయానికి వంద పాఠశాలలే ఈ ఏడాది ఏర్పాటు లక్ష్యమన్నారు. అందుకు తగ్గ బడ్జెట్ తెలంగాణా బడ్జెట్‌‌లో కనిపించలేదు. చివరకు ఈ ఏడాది ఎన్ని అందుబాటులోకి తెస్తారో స్పష్టత లేదు. ఎందుకంటే నిజంగా ప్రారంభం ఉద్దేశ్యం ఉంటే ఇప్పటికే అందుకు సంబంధించిన నోటిఫి కేషన్లు రావాలి. కానీ ఇంతవరకు రాలేదు. ఈ పబ్లిక్ స్కూల్స్ ప్రభుత్వ బడిలో అంతర్భాగంగా కొన్ని స్కూల్స్ ఇప్పటికే ఎంపిక చేశారు. అంటే ఇక మిగతా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ బడులు యధాతధంగా కొనసాగుతాయన్న మాట.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రికగా చెప్పబడుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ‘ప్రణాళిక పెద్దదే.ఆచరణే చాలా చిన్నది. ఒక్కో పాఠశాల25ఎకరాల సువిశాల ప్రాంగణం, 26వందల పిల్లలు, 125మంది ఉపాద్యాయులు,200కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఇదో రంగుల కళ! 2024 ఏప్రిల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 58పాఠశాలలకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ, భవన నిర్మాణం టెండర్లు పిలిచారు. గతేడాది ఈ పాఠశాలల కోసం15,500కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రినే ప్రకటించారు. మూడవ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్నా పాఠశాల ప్రారంభం,ఎడ్మీషన్ల ఊసులేదు. అవి ఎప్పుడు ఉనికిలోకి వస్తాయో! ఎవరూ నిర్దిష్టంగా నిర్ధారించలేని పరిస్థితి. ఈ ఐదేళ్ల కాలపరిమితి లోనైనా అందు బాటులోకి వస్తాయా? అనుమా నమే. ఒకవైపు కేసీఆర్ అద్దె భవనాల్లో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ లో పుడ్ పాయిజనింగ్, భద్రతా లోపం తరచుగా బహిర్గతం అవుతుంది.వాటికి భవనాలు నిర్మిస్తూ మరోవైపు యంగ్ ఇండియా స్కూల్స్ ఆలోచన మరింత ఇరుకైనదిగా కనిపిస్తుంది. ప్రచారానికి,ఆర్భాటానికే సరికొత్త పాఠశాల రూపుదిద్దినా అది ప్రభుత్వ పాఠశాల నమోదునే అంతిమంగా దెబ్బతీస్తుంది.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి, గత రెండున్నర దశాబ్దాలుగా సర్వశిక్షా అభియాన్ కేంద్రం నిధులు, రాష్ట్ర వాటా తో నిర్మించిన రెండు లక్షల కోట్ల విలువైన తరగతి గదులు నిరుపయోగంగా మారతాయి.అంతిమంగా చారిత్రాత్మకమైన ప్రభుత్వ బడి అనాధ శరణాలయాలు, ధాన్యం నిల్వా చేసే గోడౌన్లులేక శిధిల స్వప్నాలుగా మారిపోయో ప్రమాదం కనిపిస్తోంది. కనుక తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన ప్రణాళికతో విద్యా వృధాను అరికట్టి నాణ్యమైన, సౌకర్య వంతమైన విద్యా ప్రణాళికతో ముందుకు రావాలి.ఈ ఏడాది నర్సరీ నుండి ఇంటర్ వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం సకాలంలో పాఠశాలలకు చేర్చాలి. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పాలు, రాగి జావ లాంటి అల్ఫాహారం రాష్ట్రంలోని అరవై లక్షల మంది విద్యార్థులకు అందుబాటు లక్ష్యంగా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యంతో పాటు, మారిన విద్యా సామర్థ్యాల కనుగుణంగా పాఠశాల సౌకర్యాలు, బోధనా సిబ్బంది, వనరులు అందుబాటులోకి తేవాలి.ఇవన్నీ మాటలు చెప్పినంత సులువుకాదు. ఎంతో దూర దృష్టి గలిగిన ముందస్తు ప్రణాళిక, నిధులు అందుబాటుతో మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రణాళిక ఉంటే సరిపోదు!అయితే అందుకు సంస్కరణ చేసే ప్రభుత్వాలకు ఆచరణ, చిత్తశుద్ది మాత్రం తప్పనిసరి!

ఎన్.తిర్మల్, 9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -