నవతెలంగాణ – పరకాల
ఎరువుల కంపెనీల స్వార్థపూరిత ‘లింకు’ విధానాలు, అనైతిక వ్యాపార తంత్రాల వల్ల గ్రామీణ రిటైల్ వ్యవస్థ పూర్తిగా దివాలా తీసిందని, దీనివల్ల అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్టేట్ అసోసియేషన్‌కు సమస్యలను నివేదిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లుగా ప్రముఖ కంపెనీలు రిటైల్ డీలర్ల మార్జిన్లను నామమాత్రం చేశాయని, రవాణా మరియు నిర్వహణ ఖర్చులు కూడా గిట్టుబాటు కాక డీలర్లు దుకాణాలకు తాళాలు వేసే పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా రైతులకు అవసరమైన యూరియా కావాలంటే, డిమాండ్ లేని నాసిరకం ఉత్పత్తులను బలవంతంగా అంటగడుతూ కంపెనీలు ‘లింకు’ మాఫియాగా మారాయని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. సీజన్ సమయంలో కృత్రిమ కొరత సృష్టించి పాత స్టాక్ వదిలించుకోవడానికి డీలర్లను పావులుగా వాడుకుంటున్నారని, దీనివల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా యూరియా సరఫరాకు ‘లింకు’ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా డీలర్లకు 8-10 శాతం గౌరవప్రదమైన మార్జిన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎరువుల సరఫరా వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి పారదర్శకత పాటించాలని, మార్క్ ఫెడ్ ద్వారా ఇచ్చే ధరలకే రిటైల్ డీలర్లకు కూడా సరఫరా చేయాలని కోరారు. ఇది కేవలం డీలర్ల సమస్యే కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు రైతుల మనుగడ ప్రశ్న అని ఆయన స్పష్టం చేశారు.



