అకాల వర్షాలతో పొంచిఉన్న ప్రమాదం
అప్రమత్తంగా ఉండాలని..నిపుణుల సూచన
నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి.వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.ఉరుములు,మెరు పులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ఫోన్ను వినియోగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు.పిడుగుపాటు సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వెలుతురుతో పాటు విద్యుత్ శక్తి విడుదల అవుతుంది.అసలు పిడుగు ఎలా పడు తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విష యాలపై నిపుణులు పలు సూచనలు చెబుతున్నారు.
మెరుపు, ఉరుము, పిడుగులు అంటే?
పిడుగులంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదాపాతం.మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పున్నమయ్యే విద్యుత్ను పిడుగుగా పిలుస్తారు.మేఘాల్లో అతిశీతల రేణువులుగా విద్యుదావేశాలు జనింపజేస్తాయి.మేఘాల దిగువ భాగం లోని రుణవిద్యుత్ ఆవేశాలు భూమిపై ధన విద్యుత్ ఆవేశాన్ని ప్రేరేపిస్తాయి.ఈ రెండు విద్యుదావేశాలు అనుసంధానమైతే విద్యుత్ శక్తి ఉత్పన్నమవుతుంది. దీనినే పిడుగు అంటారు.వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.ఆ సమయంలో పొలం పనుల్లోనూ ఇతర అవసరాలకో బయటకు వెళ్లినప్పుడు పిడుగుబారిన పడే ప్రమాదం ఉంది.
ప్రథమ చికిత్స..
పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాలి,వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతం లో ఉంచాలి.తడి దుస్తులు తొలగించి, పొడి దుస్తులు వేయాలి.పడుకోబెట్టి, రెండుకాళ్లు పైకి ఎత్తి ఉంచాలి.తలను ఒకవైపు తిప్పి పెట్టాలి.ఆ సమయంలో నోటి ద్వారా నీరు,ఆహారాన్ని అందించకూడదు. వెంటనే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలందించాలి.
అప్రమత్తతే శ్రీరామరక్ష..
మెరుపు, ఉరుము వచ్చే సమయంలో చెవులు గట్టిగా మూసుకోవాలి.ఉరుముల,మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోతే నేలపై పూర్తిగా కిందకు వంగాలి.పొలాల్లో, ఆరుబయట ఉన్నప్పుడు చెట్టు కిందకు వెళ్లకూడదు. ఎత్తయిన చెట్లు, స్తంభాలు పిడుగులను ఆకర్షిస్తాయి.ముఖ్యంగా సెల్ఫోన్లు స్వీచ్ఎఫ్ చేసుకోవాలి.
జాగ్రత్తగా ఉండాలి: వెంకట్ రెడ్డి భౌతిక శాస్త్ర అధ్యాపకులు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో పిడుగులు పడే అవకాశం అత్యధికంగా ఉంటుంది.విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటూ క్యుములో నింబస్ మేఘాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.వర్షం వస్తుందని ముందస్తుగా తెలుస్తుంది.సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లే.



