Wednesday, May 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమతోన్మాదం కింద నలుగుతున్న ప్రజాస్వామ్యం

మతోన్మాదం కింద నలుగుతున్న ప్రజాస్వామ్యం

- Advertisement -

భారత రాజకీయాల ప్రస్తుత దిశను గమనిస్తే, దేశం క్రమంగా ఒక ప్రమాదకర మలుపు వైపు నడుస్తోందన్న ఆందోళన పెరుగుతోంది. ఒకప్పుడు ప్రాంతీయ స్వాభిమానానికి, భాషా అస్తిత్వానికి, సామాజిక న్యాయ రాజకీయాలకు ప్రతీకలుగా నిలిచిన రాష్ట్రాలు ఇప్పుడు క్రమంగా కేంద్రీకృత రాజకీయాల ఒత్తిడిలో తమ స్వతంత్ర స్వరాన్ని కోల్పోతున్నాయి. దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ మార్పును మరింత స్పష్టంగా బయటపెట్టాయి. ప్రజాస్వా మ్యం ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నా, దాని ఆత్మ క్రమంగా బలహీనపడు తోందనే భావన విస్తృతంగా వినిపిస్తోంది. ఎన్నికలు జరుగుతు న్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రచారాలు సాగుతున్నాయి. కానీ ఆ ప్రక్రియ మొత్తం సమాన అవకాశాల వేదికగా కాకుండా, ఒకే సిద్ధాంతానికి అనుకూలంగా మలచబడు తున్నదన్న అనుమానం దేశవ్యాప్తంగా పెరుగుతోంది.

ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాన్ని పరిశీలిస్తే, అది కేవలం ఓట్ల రాజకీయంగా మాత్రమే కనిపించదు. సామాజిక విభజనలను, మతపరమైన భావోద్వేగాలను, భయాలను, అభద్రతా భావనలను ఒక రాజకీయ ఆయుధంగా మార్చే క్రమబద్ధమైన ప్రణాళికగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముస్లింలను ఒక శాశ్వత రాజకీయ ‘శత్రువు’గా చిత్రిస్తూ, హిందూ ఓటర్లను సమీకరించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న తీరు దేశ లౌకిక స్వభావానికి తీవ్ర సవాలుగా మారింది. ‘అభివృద్ధి’, ‘జాతీయత’, ‘భద్రత’ వంటి ఆకర్షణీయ పదజాలం వెలుపల కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం మతపరమైన ధృవీకరణ రాజకీయమే ప్రధానంగా నడుస్తోంది.

పశ్చిమ బెంగాల్ దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. ఒకప్పుడు వామపక్ష భావజాలానికి పెట్టని కోటగా నిలిచిన ఆ రాష్ట్రం ఇప్పుడు మతపరమైన రాజకీయ ప్రయోగాలకు ప్రధాన వేదికగా మారింది. బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల ఒక్కరోజులో జరిగిన రాజకీయ అద్భుతం కాదు. అది సంవత్సరాలపాటు సాగిన భావోద్వేగ నిర్మాణం, మతపరమైన విభజన, మీడియా మేనేజ్‌మెంట్, కేంద్ర సంస్థల వినియోగం, ప్రతిపక్ష వైఫల్యాల సమ్మేళనం. ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో బాబ్రీ మసీదు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం, ఇటుకల సేకరణ పేరుతో భావోద్వేగ రాజకీయాన్ని రెచ్చగొట్టడం, ఆ తరువాత దాన్ని హిందూ వ్యతిరేక భావనగా మార్చడం – ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావు. ఇవి హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి రచించబడిన పక్కారాజకీయ స్క్రిప్టులు.

ఎన్నికల ప్రక్రియపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితాల నుంచి పెద్దఎత్తున పేర్లు తొలగించడం, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల అతిశయ ప్రదర్శన, ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా కనిపించే తనిఖీలు, ఒక వర్గానికి చెందిన ఓటర్లలో భయ వాతావరణం సృష్టించడం – ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడని పరిణామాలు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటే, అది కేవలం ఒక పార్టీకి లాభం కాదు; మొత్తం ప్రజాస్వామ్య నిర్మాణానికే ప్రమాదం. ఇక్కడ మరో కీలక అంశం మీడియా పాత్ర. దేశంలోని ప్రధాన మీడియా వేదికలలో పెద్దశాతం ఇప్పుడు అధికార అనుకూల ప్రచార యంత్రాంగాల్లా పనిచేస్తున్నాయన్న విమర్శ బలపడుతోంది. అధికారాన్ని ప్రశ్నించే జర్నలిజం బలహీనపడుతూ, అధికారాన్ని మహిమపరిచే కథనాలు ప్రధాన ప్రవాహంగా మారాయి.

ప్రతిపక్షాలపై ఆరోపణలు రోజంతా ప్రసారం అవుతుంటే, అధికార పక్షంపై వచ్చే ప్రశ్నలు చాలా సందర్భాల్లో ప్రస్తావనకే రావడం లేదు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక వాచ్‌డాగ్‌గా కాకుండా, అధికారానికి కవచంగా మారితే ప్రజలు నిజాన్ని తెలుసుకునే అవకాశమే క్రమంగా తగ్గిపోతుంది. ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కూడా తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు అవినీతి, నేరాలను దర్యాప్తు చేయడానికి ఉద్దేశించిన సంస్థలు ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై ఒత్తిడి తెచ్చే రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికల సమయంలోనే దాడులు, నోటీసులు, అరెస్టులు ఎక్కువవడం యాదృచ్ఛికమా? అనే ప్రశ్నలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అధికార పక్షంలోకి వెళ్లిన వెంటనే కేసులు బుట్టదాఖలా కావడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతోంది.

దక్షిణ భారత రాజకీయాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాల బలహీనత, కొత్త తరపు నాయకత్వాల ఎదుగుదల, రాజకీయ అలసట – ఇవన్నీ కలిసి ఒక కొత్త రాజకీయ శూన్యాన్ని సృష్టిస్తున్నాయి. బీజేపీ అక్కడ ఇంకా పూర్తి స్థాయి శక్తిగా ఎదగకపోయినా, భావజాల స్థాయిలో తన ప్రభావాన్ని నెమ్మదిగా విస్తరించుకుంటోంది. కేరళలో కూడా మతపరమైన చర్చలను అంతర్లీనంగా ముందుకు తెస్తూ సంప్రదాయ రాజకీయ సమీకరణాల్లో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేసిన ‘వయా రాజకీయాలు’ ఇప్పుడు దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాల్సిన అంశంగా మారాయి. ముందుగా మిత్రుడిగా చేర్చుకోవడం, ఆ తరువాత ఆ పార్టీలో చీలికలు సృష్టించడం, నేతలను తమవైపు తిప్పుకోవడం, చివరికి ఆ ప్రాంతీయ శక్తిని నిర్వీర్యం చేయడం – ఇది ఇప్పుడు ఒక రాజకీయ నమూనాగా మారింది. శివసేనలో జరిగిన పరిణామాలు, జేడీయూ బలహీనత, అస్సాంలో ఏజీపీ పరిస్థితి ఇవన్నీ ఈ వ్యూహానికి ఉదాహరణలు.

ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుతో ఉన్న పొత్తు కూడా ఈ ‘వయా మార్గం’ వ్యూహంలో భాగమే. టీడీపీ ఓటు బ్యాంకును ఆక్రమించుకుంటూ, జనసేన వంటి శక్తులను విలీనం చేసుకుని భవిష్యత్తులో తమకు అనుకూలమైన వారిని పీఠంపై కూర్చోబెట్టడమే కేంద్రంలోని పెద్దల అంతిమ లక్ష్యం. ప్రాంతీయ భావజాలం ఉన్న చోట కూడా జాతీయవాదాన్ని, మతాన్ని మిక్స్ చేసి ప్రాంతీయ పార్టీలను చరిత్ర పుటలకే పరిమితం చేసే ప్రమాదం పొంచి ఉంది.అయితే, ఈ మొత్తం పరిస్థితికి కేవలం బీజేపీని మాత్రమే కారణంగా చూపడం ద్వారా పూర్తి చిత్రం కనిపించదు. ప్రతిపక్షాల చారిత్రక తప్పిదాలు, అవకాశవాద రాజకీయాలు, తాత్కాలిక అధికార ప్రయోజనాల కోసం మతోన్మాద శక్తులతో చేతులు కలపడం కూడా నేటి సంక్షోభానికి కారణమే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (మాజీ) మమతా బెనర్జీ ఉదాహరణ దీనికి స్పష్టమైన నిదర్శనం. నేడు మతోన్మాదం గురించి తీవ్రంగా మాట్లాడుతున్న మమత, గతంలో ఇదే బీజేపీతో కలిసి ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచే శారు. కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికి ఆమె బీజేపీకి రాజకీయ వేదిక కల్పించారు.


ఆ సమయంలో అధికార రాజకీయాల కోసం మతపరమైన ఎజెండాను పట్టించుకోకపోవడం, నేడు అదే శక్తి తన అస్తిత్వానికే సవాలుగా మారుతుందని ఊహించకపోవడం ఆమె రాజకీయ వైఫల్యమే. మిత్రుడిగా చేరి, మెల్లగా వేళ్లూనుకుని, తరువాత అదే వృక్షాన్ని కూల్చేయడం బీజేపీ రాజకీయ శైలిలో భాగమని ఆమె చాలా ఆలస్యంగా గ్రహించారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, భారత ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలకే పరిమితమవు తుందా? లేక ప్రజల హక్కులు, విభిన్న స్వరాలు, ప్రాంతీయ అస్తిత్వాలు, రాజ్యాంగ విలువలు కూడా సమానంగా రక్షించబడతాయా? ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే రాజకీయం దేశమంతా వ్యాపిస్తే, అది ప్రజాస్వామ్యం రూపంలో కనిపించే కేంద్రీకృత ఆధిపత్య వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం ఎన్నికలు మాత్రమే కావు. ప్రశ్నించే సమాజం, స్వతంత్ర మీడియా, నిష్పాక్షిక సంస్థలు, చైతన్యవంతమైన పౌరులే అసలు బలమైన గోడలు. ఆ గోడలు బలహీనపడితే, ఎన్నికలు ఉన్నా ప్రజాస్వామ్యం ఉండకపోవచ్చు.

యండి. ఉస్మాన్ ఖాన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -