విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్(ఎన్‌ఈఈటి) పరీక్షాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. “ఒకే పరీక్ష-ఒకే దేశం-ఒకే మెరిట్” అంటూ కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన విధానం చివరకు ఇరవై రెండు లక్షల మంది భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది. ఈ కుంభకోణంలో అత్యంత ఆందోళనకర అంశం పేపర్ లీక్ కంటే, దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి. కేంద్రీకృత విధానాన్ని బలవంతంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన సర్కార్, భద్రతా ప్రమాణాలు, పారదర్శకత, పరీక్షా నిర్వహణలో కనీస బాధ్యతను కూడా నిలబెట్టుకోలేక పోయింది. లీకేజీలపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఘటన తర్వాత కూడా స్పష్టమైన సమాధానాలివ్వక పోవడం, దీన్నిసాధారణ వైఫల్యం లా చూపించడం, సమస్య తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేయడం శోచనీయం. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యామంత్రులు గానీ, ప్రధానిగానీ ఇప్పటివరకు స్పందించలేదు.
వైద్య విద్యలో ప్రవేశం కోసం మే 3న జరిగిన నీట్ పరీక్ష వెనక విద్యార్థుల సంవత్సరాల శ్రమ దాగుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, వారి మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, కుటుంబాల త్యాగాలు ఉన్నాయి. కానీ, ఈ శ్రమంతా ఒక్కరోజులోనే బూడిదలో పోసిన పన్నీరు అయింది. ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) మాత్రం ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షా వ్యవస్థ పేపర్‌లీక్‌ల మాఫియాల చేతిలో బందీ అయితే ప్రభుత్వం ఏం చేస్తున్నదనేదే ఇక్కడ ప్రశ్న. అసలు అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఉందా? ఇదే కాదు, గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు సాధారణ వార్తలుగా మారిపోయాయి. నీట్-యూజీ 2024లో బీహార్‌లో జరిగిన లీక్ కేసులో విద్యార్థులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాలు, అధికార యంత్రాంగంతో సంబంధాలున్న వ్యక్తులు అరెస్టయ్యారు. సీబీఐ దర్యాప్తులో అంతర్రాష్ట్ర ముఠాలు పనిచేసినట్లు బయటపడింది. తాజాగా రాజస్థాన్ ఘటనలో బీజేపీకి సంబంధికుడిని నిందితుడిగా అరెస్టు చేశారు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే ఇలాంటి లీక్ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పరీక్షా మాఫియాలు రాజకీయ ఆశ్రయం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో పనిచేయలేవు! పలు దర్యాప్తుల్లో అధికార వర్గాలకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పేర్లు వినిపించడం యాదృచ్ఛికమేమీ కాదు. ఈ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సమంజసం కాదు. ఇందులో మరో విఫలపాత్ర ఎన్‌టిఎది. పరీక్ష నిర్వహణ దీనికి అప్పగించినప్పటి నుంచే పారదర్శకత, విశ్వసనీయతపై అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. సాంకేతిక లోపాలు, ప్రశ్నాపత్రాల లీక్‌లు, మార్కుల గందరగోళం, గ్రేసు మార్కుల వివాదాలు పునరావృత మయ్యాయి. ప్రధానంగా యూజీసి-నెట్ 2024 పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదనే పేరుతో రద్దు చేయడం ఎన్‌టిఎ వైఫల్యానికి అతిపెద్ద ఉదాహరణ. నీట్‌లో పేపర్ లీక్ ఆరోపణలు, అసాధారణంగా టాపర్లు పెరగడం, ఒకే కేంద్రం నుంచి పలువురికి పూర్తి మార్కులు రావడం దేశవ్యాప్తంగా అనుమా నాలకు దారితీసింది. అందుకే ఎన్‌టిఎను రద్దుచేసి, పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
ఈ వ్యవహారంలో ప్రధానంగా నష్టపోయింది సాధారణ, మధ్య తరగతి, గ్రామీణ విద్యార్థులే. కోచింగ్ మాఫియాలు, డబ్బు ఆధారిత అవినీతి నెట్‌వర్కులు పరీక్షా వ్యవస్థను ఆక్రమిస్తున్నప్పటికీ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పైగా పరీక్షా పత్రం లీక్ వంటి ఘటనలు పునరావృత మవుతున్నా పట్టించుకోవడం లేదు. బాధ్యులపై వేగవంతమైన చర్యలు లేకపోవడం పట్ల అధికార యంత్రాంగంపై అనుమానాలు పెంచుతోంది. ఈ ప్రవేశ పరీక్షకు ఏడాది కాదు… రెండేళ్లు, జీవితాన్ని పణంగా పెట్టి సిద్ధమయ్యే విద్యార్థులున్నారు. అలాంటి సమయంలో కొందరు డబ్బుతో ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసి ముందే పరీక్ష రాస్తే, నిజాయితీగా చదివిన విద్యార్థి మనసులో ఎంత విరక్తి పుడుతుంది? “కష్టపడి చదివితే ఫలితం వస్తుంది” అనే నమ్మకాన్నే ఈ వ్యవస్థ చంపేస్తోంది. ఇప్పుడు కూడా పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో పరీక్షా నిర్వహణకు ఒకరోజు ముందే రూ.5లక్షలు, గంటకు ముందు రూ.30వేలకు ప్రశ్నపత్రాల్ని మాఫియా అమ్మకాలు చేసినట్టు విద్యార్థుల తల్లిదండ్రులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
“మెరిట్” పేరుతో విద్యను కేంద్రీకరించిన పాలకులు, అదే మెరిట్‌ను ఇప్పుడు మార్కెట్ శక్తులకు, అవినీతి ముఠాలకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఈ నిర్లక్ష్య ధోరణిని ప్రజాస్వామ్య సమాజం తీవ్రంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పరీక్షా వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరిం చాలంటే, కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా పారదర్శక విచారణ, బాధ్యులపై కఠిన చర్యలు, భద్రతా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలి. దీనికోసం కేంద్రంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవాలి.
‘నీట’ముంచారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



