నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వ్యవారావుపేట వసాయ కళాశాల, ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని మండలంలోని దురదపాడు లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ ఐ.వి. శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి. శ్రవణ్ కుమార్, మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. రవీందర్ రావు, సర్పంచ్ పాండా రాజులు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఐ.వి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా యూరియాను ఒకేసారి కాకుండా దఫాలవారీగా, తగిన మోతాదులో వేయడం ద్వారా పంట ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. అలాగే చీడపీడల ఉధృతి తగ్గి సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. అవసరమైన మేరకు మాత్రమే రసాయనాలను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సాగునీటి యాజమాన్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించి భావితరాల భవిష్యత్తును రక్షించాలని పిలుపునిచ్చారు.
అనంతరం డాక్టర్ టి. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు, రసాయనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట ఉత్పత్తుల విక్రయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. రాష్ట్రంలో సాగుకు అనువైన, మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న వరి విత్తన రకాలు మరియు వాటి లక్షణాలను రైతులకు వివరించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. రవీందర్ రావు మాట్లాడుతూ రైతులు సంవత్సరాల తరబడి ఒకే పంట సాగు చేయకుండా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. పంట మార్పిడి వల్ల భూసారం పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడులు పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముచ్చవరం గ్రామ రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



