ఉపాధిహామీ కూలీలకు నిలిచిన పంపిణీ
కేవలం ఆన్లైన్లో వివరాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో నూతన నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో చేతికందే పే స్లిప్పుల పంపిణీ నిలిచిపోయింది.ఎంత పని చేశామో,ఖాతాల్లో ఎంత జమ అవుతుందో తెలియడం లేదు.అక్షరాస్యత తక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంత కూలీలతోపాటు చదువురాని పేదలు దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది.యాప్ లపై అవగాహన లేకపోవడం.వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.
జూలై 1 నుంచి వీబీ జీరామ్ జీ
2005 నుంచి అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. జూలై 1 నుంచి దీని స్థానంలో వీబీజీ రామ్ జీ చట్టాన్ని అమలు చేయనున్నారు.పనిదినాల సంఖ్య 125 రోజులకు పెంచను న్నారు.మండల వ్యాప్తంగా 8,495 జాబ్ కార్డులు ఉండగా,18,873 వేల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు.ఇందులో 10,632 వేల మంది కూలీలు యాక్టీవ్ గా ప్రస్తుతం 1670 మంది కూలీలు పనులకు హాజరవుతున్నట్లుగా ఉపాధి ఎపిఓ హరీష్ తెలిపారు.
నిలిచిన పే స్లిప్పులు..
మండలంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేపడుతున్న కూలీలకు వేతన స్లిప్పులు ఇవ్వడం లేదు.నాలుగేళ్ల క్రితం వరకు సక్రమంగా అందజేసినా ప్రస్తుతం వివిధ కారణాలను చూపిస్తూ పంపిణీ నిలిపివేశారు.పే స్లిప్ లో కూలి పెరు,పని చేసిన ప్రదేశం, ఎన్ని రోజులు పని చేశారు.. రోజువారీ వేతనం మొత్తం ఎంత వచ్చింది అనే వివరాలతోపాటు వంద రోజులు నిండడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం పూర్తిగా ఉంటుంది తద్వారా కూలీలకు ఏపని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో ఎంత వేతనం వస్తుందో స్పష్టంగా తెలిసేది.ప్రస్తుతం స్లీప్పుల పంపిణీ కాకపోవడంతో వారానికి ఎంత వేతనం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.ప్రతి వారం వేతనాలు తెలిస్తే ఓకవారం తక్కువ డబ్బులు పడినా తదుపరి వారం గరిష్ట వేతనం కోసం పని చేసేందుకు కూలీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
కూలీలు నష్టపోయే అవకాశం..!
సాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన నిధులను పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. మండలంలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీసు ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వారాల పేమెంట్లు జమ చేస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన కూలీలు అధికంగా ఉండటంతో తమ ఖాతాల్లో ఎంత నగదు జమ అయిందో తెలియని పరిస్థితి.ఈ నేపథ్యంలో గతంలో బీపీఎంలు నగదు విత్అడ్రా సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినా సమీపంలో ఏటీఎం కేంద్రాలు అందుబాటులో లేవు. దీంతో మినీ ఏటీఎం నిర్వాహకులను ఆశ్రయించాల్సిందే.ఆ సమయంలోనూ అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. కూలీల వేతన వివరాలను జన్ మన్ రేగా.. అనే యాప్లో పొందుపరుస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో కూలీలకు దానిపై అవగాహన లేకపోవడంతో ఉపయోగపడటం లేదు.
యాప్లో వివరాలు : ఉపాధిహామీ…ఎపిఓ హరీష్
ఉపాధి కూలీల వేతన వివ రాలను ఎప్పటికప్పుడు జన్ మన్ రేగా యాప్ లో పొందుపరుస్తున్నాం.మండలంలో కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం.యాప్పై క్షేత్రస్థాయిలో మా సిబ్బంది ద్వారా కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం.



