స్వచ్ఛమైన కల్లు, తాగునీటి సంరక్షణపై కీలక నిర్ణయాలు
నవతెలంగాణ – బిబిపేట్
బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామపంచాయతీలో గురువారం వార్డ్ సభ్యుల సాధారణ సమావేశం సర్పంచ్ మట్ట శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజారోగ్యం, తాగునీటి సమస్యలు, ప్లాస్టిక్ నివారణ తదితర అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామంలో గతంలో లభించిన స్వచ్ఛమైన ఈత కల్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆ కల్లును సేవించే వారిలో పక్షవాతం, నరాల బలహీనత వంటి అనరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామంలో కల్లు విక్రయించాలనుకునే వారు చెరువు కుంటల పరిసరాల్లో లేదా తమ సొంత భూముల్లో ఈత వనాలను పెంచి, ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
గ్రామ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు సమావేశంలో తెలిపారు. మహిళా భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. తాగునీటి సమస్యలు ఉన్న వార్డుల్లో శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఎల్‌డీఓ (LDO) ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ, గ్రామస్తులు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ పాత స్వామి, గ్రామ కార్యదర్శి రవి, వార్డ్ సభ్యులు వడ్ల నరసింహాచారి, బెల్లె వంశీ, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.



