నవతెలంగాణ-కాటారం
బండి భగీరథుని తక్షణమే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐసా) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏఐసా జిల్లా కార్యదర్శి బి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి లు మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదై ఎన్నో రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. చట్టం అందరికీ సమానమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ కేసులో మాత్రం ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు.
బీజేపీ నాయకత్వం, మహిళా నేతలు ఈ ఘటనపై స్పష్టంగా స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టి, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బండి భగీరథను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.



