ఆర్టీఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా నాయకులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలో మాట్లాడారు లీటర్ పెట్రోల్ పై రూ.3.40,డీజిల్పై రూ.3.27 పెంపు సామాన్యుడి నడ్డి విరవడమేనన్నారు.కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని,ఇప్పటికే గ్యాస్ ధరల పెరుగుదల,కొరతతో హోటళ్లు,చిన్న వ్యాపారాలు మూతపడుతున్న తరుణంలో.. తాజా పెంపు ‘మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్లు’ తయారైందన్నారు.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సాకుతో కేంద్రం ఇంధన ధరలను సవరించింది. పెట్రోల్, డీ జిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై నేరుగా పడనుందని,ఫలితంగా నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, నూనె ధరలు పెరగనున్నాయని,కూరగాయలు,రవాణా ఖర్చులు పెరగడంతో సామాన్యుడిపై భారం పడనుందని,స్టీల్, సిమెంట్ ధరలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం కానుందని వాపోయారు.తాజా పెంపు వల్ల ప్రజలపై ప్రతి నెలా కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మధ్యతరగతి జీవి బడ్జెట్ తలకిందులవుతోందన్నారు.పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.



