పేదరికాన్ని జయిస్తూ పరుగు పందెంలో దూసుకెళ్తున్న సూర్యాపేట యువ అథ్లెట్ ఉమ… ఇప్పటికే పది జాతీయ పతకాలు.. వందకు పైగా మెడల్స్ సాధించి కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెస్తానంటుంటి మన పరుగుల రాణి. 2028 ‘కామన్వెల్త్ పోటీల్లో ఇండియా తరఫున నిలిచి స్వర్ణ పతకం సాధించడమే నా కల` అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
పూట గడవాలంటే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. నివాసం పూరిగుడిసె.. సరైన పౌష్టికాహారం కూడా అందని నిరుపేద కుటుంబం. అయినా లక్ష్యంపై నమ్మకం కోల్పోలేదు ఆ యువ అథ్లెట్. కడుపులో ఆకలి మెలేస్తున్నా గ్రౌండ్‌లో చెమటోడ్చుతూ పరుగు పందెంలో దేశానికి పేరు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఆమే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మరిపెళ్లి ఉమ. తన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వర్షం కురిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరైన ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అందితే 2028 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించడం తన లక్ష్యమని ఉమ ధైర్యంగా చెబుతోంది.
పీఈటీ ప్రోత్సాహంతో…
రోజువారీ కూలీలు అయిన మరిపెళ్లి వీరయ్య, రేణుక దంపతుల కూతురైన ఉమ చిన్నప్పటి నుంచే కష్టాల్లో పెరిగింది. గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివిన ఆమెను ఆరవ తరగతికి నూతనకల్ జడ్పీ హైస్కూల్‌లో చేర్పించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న సమయంలో పాఠశాల మైదానంలో తోటి విద్యార్థులతో ఆడుతున్న ఆమె వేగాన్ని పీఈటీ హనుమంతరావు గుర్తించారు. పరుగు పందెంలో ఉమ రాణిస్తున్న తీరును గుర్తించిన ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. ఇంటి పరిస్థితులు దయనీయంగా ఉండటంతో సరైన ఆహారం కూడా అందని పరిస్థితుల్లో ఉమ శిక్షణ కొనసాగించింది. ఆమె పరిస్థితిని గమనించిన పీఈటీ స్వయంగా పౌష్టికాహారం అందిస్తూ అథ్లెటిక్స్ పోటీలకు తీసుకెళ్లి ప్రోత్సహించారు. ఫలితంగా చిన్న వయసులోనే ఉమ జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ప్రారంభించింది.
రికార్డు సృష్టించింది
పదో తరగతి పూర్తయ్యే నాటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు బంగారు పతకాలు గెలుచుకున్న ఉమ ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు హనుమంతరావు పదవీ విరమణ అనంతరం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి) అకాడమీలో చేర్పించి ఉన్నత శిక్షణకు మార్గం సుగమం చేశారు. అక్కడ డాక్టర్ జీవీ సుబ్బారావు పర్యవేక్షణలో శిక్షణ పొందిన ఆమె మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందింది. మూడు వేల మీటర్ల పరుగు పందాన్ని 10 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేసి జాతీయస్థాయిలో స్వర్ణ పతకం అందుకుంది. 45 కిలోమీటర్ల మారథాన్‌ను 3 గంటల 17 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
దేశవ్యాప్తంగా ప్రశంసలు
గత మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఐఏయూ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 50 కిలోమీటర్ల పరుగు పోటీలో భారతదేశం తరపున పాల్గొన్న ఉమ 3 గంటల 38 నిమిషాల 15 సెకండ్లలో రేసును పూర్తి చేసి ప్రపంచ స్థాయిలో 15వ ర్యాంకు సాధించింది. ఈ ఘనతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటి వరకు 10 జాతీయ పతకాలు, 50 కప్పులు, 100కు పైగా మెడల్స్ సాధించిన ఉమ ప్రస్తుతం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడుతున్నాయి. ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చులు భరించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. “ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తే దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెడతా. 2028 కామన్వెల్త్ పోటీల్లో భారత్ తరఫున నిలిచి స్వర్ణ పతకం సాధించడమే నా కల” అని ఉమ అంటుంది. పేదరికాన్ని జయిస్తూ లక్ష్య సాధన కోసం పరుగులు తీస్తున్న ఈ యువ అథ్లెట్‌కు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంస్థలు చేయూతనిస్తే తెలంగాణ నుంచి మరో గొప్ప అథ్లెట్ అవతరించడం ఖాయం.
జహంగీర్, 9849217086.



