గృహహింస అనేది కేవలం శారీరక, మానసిక గాయాలకే పరిమితం కాదు. ఇది మహిళల హార్మోన్ల వ్యవస్థను, ముఖ్యంగా రుతుక్రమ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుందట. ఈ క్రమంలో గృహహింసకు, మెనోపాజ్ మధ్య సంబంధం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోలిస్తే వేధింపులకు గురయ్యే మహిళల్లో ముందుగానే రుతుక్రమం ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. గృహహింసకు, రుతుక్రమం ఆగిపోవడానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం!
గృహహింస, వేధింపులకు గురైన మహిళల్లో రుతుక్రమం ముందుగానే ఆగిపోయే (మెనోపాజ్) లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సాధారణ మహిళలతో పోలిస్తే వీరికి 20 నెలల ముందే మెనోపాజ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం.. వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో దుష్ప్రభావాలు నడి వయసు వరకూ కొనసాగుతాయట. అకస్మాత్తుగా ముఖం, మెడ భాగాల్లో విపరీతమైన వేడి ఆవిర్లు రావడం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం (వాసోమోటర్ లక్షణాలు) వంటి సమస్యలతో పాటు ఆందోళన, కుంగుబాటు (డిప్రెషన్), నిద్రలేమి, పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక లైంగిక, మూత్రనాళ సంబంధిత విషయాల్లో యోని పొడిబారడం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి.
అనేక సమస్యలు
మెనోపాజ్ తర్వాత శారీరకంగా, మానసికంగా, లైంగికంగా జీవన నాణ్యత తగ్గుతుందని కూడా అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్లను నియంత్రించే వ్యవస్థ దెబ్బతినడం, జన్యువుల పనితీరులో మార్పులు రావడం దీని ముఖ్య కారణమంటున్నారు పరిశోధకులు. వేధింపుల వల్ల మనో వ్యధకు గురైన మహిళలకు అకాల అండాశయం వైఫల్యం ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జీవితంలో ఎదురైన హింస అనేది వయసు పైబడిన తర్వాత ఇతర శారీరక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందంటున్నారు పరిశోధకులు. దీర్ఘకాలిక ఒత్తిడి, శరీరంలో వచ్చే వాపుల కారణంగా.. రక్తపోటు, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి గుండె, జీవక్రియ సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎముకల ఆరోగ్యం విషయానికి వస్తే.. ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత, మెదడులో వచ్చే వాపుల కారణంగా జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లోపించడం వంటి మానసిక, జ్ఞానపరమైన సమస్యలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేస్తున్నారు. ఇక గృహహింస, వేధింపులు అనేవి కీలక ప్రజారోగ్య సమస్యగా పేర్కొంటున్నారు. దీని ప్రభావాలు దాడి జరిగిన దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతాయని తెలియజేస్తున్నారు. ఇటువంటి రుగ్మతలను ఎదుర్కొంటున్న మహిళల సమస్యలను గోప్యంగా ఉంచడం, లైంగిక అంటువ్యాధులు, గర్భాశయ క్యాన్సర్ కోసం ముందస్తు స్క్రీనింగ్ నిర్వహించడం వంటి చర్యలు అవసరమని సూచిస్తున్నారు.
గృహహింసతో ముందస్తు మెనోపాజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



