‘ఇప్పుడే పిల్లలు వద్దు, తర్వాత చూద్దాం’ అనుకునే యువ దంపతులు.. మితిమీరిన జాప్యంతో ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వ్యక్తిగత లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, కెరీర్‌కు ప్రాధాన్యమిచ్చి పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకున్న జంటలు తర్వాత శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
విదేశాలకు వెళ్లే ప్లానింగ్స్, అప్పులు తీర్చుకోవడం, చిన్న కుటుంబాలపై ఆసక్తి, ఇంకా టైం ఉందనే భావన, వ్యక్తిగత లక్ష్యాలు లేదా కెరీర్లో స్థిరపడాలని కోరిక, ఇద్దరూ ఉద్యోగాల్లో ఉండటం వంటి కారణాలతో నేటి యువత పిల్లల్ని కనడాన్ని వాయిదా వస్తున్నారు. అయితే 30 ఏండ్ల తర్వాత అండాల సంఖ్య, నాణ్యత క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 35 ఏండ్లకు తగ్గుదల మరింత వేగంగా ఉంటుందని అంటున్నారు. 40 ఏండ్ల తర్వాత సహజ గర్భధారణ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో గర్భస్రావం, గర్భధారణ సమస్యల ప్రమాదం పెరుగుతుందట.
మరి ఏం చేయాలి?: ఏడాది పాటు ప్రయత్నించినా గర్భం రాకపోతే డాక్టర్ని సంప్రదించాలి. అదే మహిళ వయసు 35 దాటితే.. 6 నెలలు ప్రయత్నించినా గర్భం రాకపోతే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక 40 ఏండ్లు దాటితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫెర్టిలిటీ నిపుణులను కలవాలని సలహా ఇస్తున్నారు.
పిల్లలపై నిర్ణయం తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భధారణను చాలా ఏండ్లు వాయిదా వేయకూడదు. కెరీర్‌తో పాటు జీవ సంబంధ అంశాలూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ప్రశాంతమైన నిద్ర అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యంకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జీవనశైలీ కారణమే: అధిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్‌ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఒబెసిటీ, పర్యావరణ కాలుష్యం వంటి నేటి జీవనశైలి కూడా గర్భధారణ ఆలస్యానికి కారణంగా ఉంటున్నాయి.
పరీక్షలు చేయించుకోవాలి: హార్మోన్ పరీక్షలు, స్కానింగ్, వీర్య పరీక్ష, జీవనశైలి మార్పులు, అండోత్పత్తి చికిత్సలు వంటివి చేయించుకోవల్సి వుంటుంది.
గర్భధారణ ఆలస్యంతో వచ్చే సమస్యలు : పిల్లల్ని లేటు వయసులో కనేవారిలో హైబీపీ, మానసిక ఒత్తిడి, గర్భాధారణ సమయంలో మధుమేహం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం, సిజేరియన్ అవకాశాలు, ముందస్తు ప్రసవం, గర్భస్రావ ప్రమాదం వంటివి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి: కుటుంబ ప్రణాళికను కెరీర్ ప్లానింగ్‌తో సమతుల్యం చేయాలి, సంతాన సమస్య అనుమానం ఉంటే దంపతులిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. వీటిని పాటిస్తే చాలా వరకు సమస్యను దూరం చేసుకోవచ్చు.
వాయిదా వేస్తున్నారా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



