ఆయనొక విజ్ఞానగని..గొప్ప ఆచరణవాది
సాహిత్యం, సామాజిక అంశాలపై అపారపట్టుDSC_0624
రఘుపాల్ ప్రథమ వర్థంతి సభలో వక్తలు
రఘుపాల్‌పై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సారంపల్లి మల్లారెడ్డి
తొలి ప్రతిని అందుకున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవితాంతం నమ్మిన సిద్ధాంతాన్ని, విలువలను వీడని ఆదర్శనేత రఘుపాల్ అనీ, ఆయన ఆదర్శానికి నిలువుటద్ధమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రఘుపాల్ ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు. రఘుపాల్‌పై సాంబరాజు యాదగిరి రాసిన పుస్తకాన్ని సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. తొలి ప్రతిని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులుకు అందజేశారు. ఈ సభలో బీవీ.రాఘవులు మాట్లాడుతూ..1990 దశకంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగులతో హైదరాబాద్ ముందుకెళ్తే..నేడు ఐటీరంగం హవా నడుస్తున్నదని చెప్పారు. ఆనాడు విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నేడు ప్రజలకు అందకుండా ప్రయివేటు ఆధిపత్యంలోకి వెళ్లిపోయాయని తెలిపారు.
పారిశ్రామిక రంగం కంటే విద్యారంగం నేడు కార్పొరేట్లకు లాభసాటి రంగంగా మారిందనీ, పారిశ్రామిక రంగంలో ఏటా 20 శాతం లాభాలుంటే విద్యారంగంలో 50 శాతం దాకా లాభాలు గడిస్తున్న పరిస్థితి ఉందని వివరించారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ విద్యాసంస్థల వాళ్లు చట్టసభలను శాసిస్తున్నారనీ, ఈరోజు ప్రయివేటు దోపిడీ పెద్ద సమస్యగా ముందుకొచ్చిందని వివరించారు. నిజాయితీగా పనిచేయడం సులభం కాని పరిస్థితి నెలకొందని చెప్పారు. తమ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్లను సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి దారిలోకి తెచ్చుకుంటున్న పరిస్థితి కండ్ల ఎదుట కనిపిస్తోందన్నారు. నిజాయితీగా బతికితే కూడా అనుమానంగా చూసే రోజుల్లో బతుకుతున్నామనీ, ఏ రూపంలోనైనా సరే డబ్బలు సంపాదించినోళ్లే గొప్పోళ్లు అనే సమాజంలో ఉన్నామని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ..పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన గొప్ప నేత రఘుపాల్ అని కొనియాడారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా సీపీఐ(ఎం) పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తుచేసుకున్నారు.
అన్ని అంశాలపైనా ఆయన విస్తృంగా అధ్యయనం చేసేవారనీ, పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపైనే జీవింత చరమాంకంలో కూడా తనను కలిసిన నేతలతో చర్చించేవారని తెలిపారు. రఘుపాల్ ఆశయబాటలో నేటి యువతరం నడవాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ క్యాంపస్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆవేశంతో ఆయన దగ్గరకు వెళ్తే తమను ఆలోచనాపరులుగా మార్చి పంపేవారని గుర్తుచేసుకున్నారు. తాను చదివిన అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం రఘుపాల్ కే సాధ్యమన్నారు. జీవితాంతం సమసమాజం కోసం పరితపిస్తూ ఆదిశగా పనిచేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ..డబ్బులకంటే నైతిక విలువలను పాటించడం, సామాజిక సేవ చేయడమే ముఖ్యమని బతికిన వారిలో రఘుపాల్ ఒకరని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను అనుభవాలను సేకరించి చరిత్రను నిక్షిప్తం చేసిన వారిలో ఆయన ఒకరని గుర్తుచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. సాహిత్యం, సామాజిక అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించేవారిమని తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అభివృద్ధి కోసం విలువైన సూచనలు ఇచ్చేవారని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఐప్సో జాతీయ నాయకులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం నుంచి రఘుపాల్ వచ్చారనీ, తన కుటుంబం మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పాటించేలా, సమ సమాజం కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించి, ఆచరణలో పెట్టిన మహనీయుడు రఘుపాల్ అని కొనియాడారు. ఆయన సతీమణి భారతి ఉద్యమకారులను సొంత బిడ్డల్లాగా చూసుకునేదని మననం చేసుకున్నారు. బొల్షివిక్ విప్లవ స్ఫూర్తితో రఘుపాల్ ప్రపంచ రాజకీయాలను నిరంతం అధ్యయనం చేసేవారనీ, ప్రపంచ శాంతికి కాంక్షించే ఐప్సో విస్తరణలో ఆయన పాత్ర కీలకమని చెప్పారు. ఐప్సో అఖిల భారత అధ్యక్షవర్గ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ..ఐప్సో ఉద్యమంలో ఆయనతో పదేండ్ల పాటు కలిసి పనిచేశానని గుర్తుచేశారు. నేడు దేశం మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నదనీ, కమ్యూనిస్టులు ముక్కలు కావడం వల్లనే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు కలవాలని ఆకాంక్షించారు. జస్టిస్(రిటైర్డ్) చంద్రకుమార్ మాట్లాడుతూ..మనుషులను ప్రేమించే ప్రేమమూర్తి రఘుపాల్ అని కొనియాడారు. తన ఆదర్శ వివాహం ఆయన చేతులమీదుగానే జరిగిందని గుర్తుచేసుకున్నారు.
తాను రాసిన ‘అవీ..ఇవీ’ హాస్య కథల పుస్తకాన్ని రఘుపాల్‌కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మాదిరిగా నేటి కమ్యూనిస్టు యువ నేతల ఆదర్శ విలువలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పుస్తక రచయిత సాంబరాజు యాదగిరి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మోతుకూరి నరహరి, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాస్, జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, హైదరాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి పీఎస్‌ఎన్.మూర్తి, తదితరులు రఘుపాల్‌తో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత డీజీ నర్సింహారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఎ.మల్లారెడ్డి, రఘుపాల్ సతీమణి భారతి, కూతురు సుప్రియ, ఐప్సో రాష్ట్ర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, ఐప్సో నాయకులు తిప్పర్తి యాదయ్య, గురుబచన్, తదితరులు పాల్గొన్నారు.



