Tuesday, May 19, 2026
E-PAPER
Homeజాతీయంపడిపోతున్న జననాల రేటు

పడిపోతున్న జననాల రేటు

- Advertisement -

యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ వేదికలు
భయాందోళనలు కలిగిస్తున్న టీవీ సీరియల్స్‌
న్యూఢిల్లీ
: మన దేశంలో జనాభా కథ వేగంగా మారిపోతోంది. మూడు దశాబ్దాల క్రితం భారతీయ మహిళలు సగటున 3.4 మంది పిల్లలను కనేవారు. ప్రభుత్వ సర్వే గణాంకాల ప్రకారం ఇప్పుడు ఒక్కో మహిళ ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తోంది. వలసలు లేకుండా జనాభా తన పరిమాణాన్ని నిలుపుకోవాలంటే ఒక్కో మహిళ 2.1 మంది పిల్లలను కనాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక్క మన దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జననాల రేట్లు గణనీయంగా తగ్గి పోతున్నాయి. పలు దేశాలలో ఒక్కో మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య ఇప్పుడు ఒకటి కంటే తక్కువగా ఉంటోంది. కొన్ని చోట్ల అయితే ఇది జీరోగా కూడా ఉండడం ఆందోళనకర పరిణామం.

సాంకేతికత వినియోగంతో క్షీణిస్తున్న సంబంధాలు
సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి నిపుణులు అనేక కారణాలు చూపు తున్నారు. పెరుగుతున్న జీవనవ్యయం, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, వృత్తిపరమైన ఒత్తిడులు, మారుతున్న సామాజిక నియమాలు వంటి అందిరికీ తెలిసిన కారణాలను ప్రస్తావిస్తున్నారు. ఇవి నిజమే అయినప్పటికీ కొందరు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ వేదికల వైపు వేలెత్తి చూపుతుండడం గమనార్హం. సాంకేతికతను వినియోగిం చుకోవడం ఎక్కువవుతున్న కొద్దీ మానవ సం బంధా లు క్షీణిస్తున్నాయి. ఇది సంతానోత్పత్తి సామర్ధ్యంపై ప్రభావం చూపుతోంది. సిన్సినాటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నాథన్‌ హడ్సన్‌, హెర్నన్‌ మాస్కోసో-బోడో ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. అమెరికా, బ్రిటన్‌ దేశాలలో అందుబాటులోకి వచ్చిన 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం జననాల రేటుపై చూపుతున్న ప్రభావాన్ని వారు పరిశీలించారు. హై-స్పీడ్‌ మొబైల్‌ కనెక్టివిటీ కలిగిన ప్రాం తాలలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని గమనించారు.

పలుకే బంగార మాయెరా…
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేనప్పుడు కుటుంబ సభ్యులు… ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంభాషణలు ఎక్కువగా జరుగు తుండేవి. అవి వారి మధ్య ప్రేమానుబంధాన్ని పెంచేవి. స్మార్ట్‌ఫోన్లు రావడంతో పరిస్థితి మారిపోయింది. పలుకే బంగార మాయెరా అన్న చందంగా తయారైంది. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే కాలం గడిచిపోతోంది. ముఖాముఖి మాట్లాడు కునే సందర్భాలే అరుదైపోతున్నాయి. ఈ ధోరణి కేవలం అమెరికా, బ్రిటన్‌కే పరిమితం కాలేదు. స్మార్ట్‌ఫోన్లు విస్తృతంగా అందు బాటులోకి వచ్చిన సమయంలోనే అనేక దేశాలలో జననాల రేటు పడిపోవడం మొదలైందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణలో తేలింది.

ప్రభావం చూపుతున్న సోషల్‌ మీడియా
అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలలో 2000వ సంవత్సరంలోనూ, ఆ తర్వాత టీనేజర్లు, యువతలో జననాల రేటు సాపేక్షంగా స్థిరంగానే ఉంది. అయితే 2007 తర్వాత….అంటే స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ యాప్‌లు వంటివి వెల్లువలా వచ్చి పడడంతో ఆ రేటు గణనీయంగా పడిపోయింది. చిన్న వయసు వారిలో సంతానోత్పత్తి రేటు తగ్గుదల మరింత తీవ్రంగా ఉంటోంది. అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు వినియోగించేది వీరే కావడం విశేషం. దీనికితోడు మానవ సంబంధాలపై సోషల్‌ మీడియా ప్రభావం అధికంగా ఉంటోంది. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమ వేదికలకు అతు క్కుపోతుండడంతో వారిలో లైంగిక సామర్ధ్యం క్షీణిస్తోంది. వైవాహిక జీవితంపై ఆసక్తి కలగడం లేదు. మానవ సంబంధాలు దీర్ఘకాలం కొనసాగకపోవడానికి సోషల్‌ మీడియాయే కారణమని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికలు యువత జీవన శైలిని మార్చేస్తున్నాయి. ఆర్థిక పరంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. సామాజిక పోలికలను సృష్టిస్తున్నాయి. దీంతో యువతలో అభద్రత, అస్థిరత నెలకొంటోంది.

టీవీలు…మీడియా కూడా…
డిజిటల్‌ వేదికలు అంతటితో ఆగడం లేదు. ఆర్థిక, వృత్తిపరమైన, గృహ వసతికి సంబంధించిన ఆందోళనలను పెంచు-తున్నాయి. దీంతో యువత తల్లిదండ్రులుగా మారడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. గతంలో నిర్వహించిన అధ్యయనాలు కూడా ఇలాంటి మార్పులనే సూచించాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడానికి మీడియా కూడా కారణమవుతోంది. చిన్న కుటుంబాలు చింతలు లేని కుటుంబాలంటూ చూపించే టీవీ సీరియల్స్‌ కారణంగా వివాహిత మహిళలు తక్కువ మంది పిల్లలతో సరిపెట్టుకుంటున్నారని గత అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రింబవళ్లూ టీవీలు చూస్తూ కాలం గడిపే భార్యాభర్తలు వైవాహిక జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేక పోవడం కూడా జననాల రేటు పడిపోవడానికి కారణమవుతోంది. అయితే టీవీలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ల ప్రభావమే అధికంగా ఉంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యువత వాటికి బానిసలుగా మారిపో తున్నారు. వారిపై అవి బలమైన ప్రభావాన్ని చూపుతు న్నాయి. తగ్గిపోతున్న జననాల రేటుకు సాంకేతికత ఒక్కటే కారణం కాదని నిపుణులు అంటున్నప్పటికీ అది ప్రపంచ జనాభా మార్పును వేగవంతం చేస్తోందని నమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -