ఈ-ఫార్మసీ అమ్మకాలపై నిరసన ర్యాలీలు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25వేలకు పైగా తెరుచుకోని దుకాణాలు
అత్యవసర మందులకు ఆస్పత్రుల దుకాణాలు ఓపెన్
నవతెలంగాణ- విలేకరులు
ఈ-ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ.. ఫార్మసీ వ్యాపార సంఘాల (ఏఐఓసీడీ, టీటీసీడీఏ) పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేలకుపైగా దుకాణాలు మూతపడగా.. ఒక్క హైదరాబాద్ నగరంలోని 12వేల మెడికల్ షాపులు తెరచుకోలేదు. హబ్సిగూడ- నాచారం కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్‌ల నిర్వాహకులు హబ్సిగూడ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో ఓపెన్ చేసి ఉంచిన మెడికల్ షాప్ వద్ద నిరసన వ్యక్తం చేసి బంద్ చేయించారు. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో బంద్ జరిగింది. మంచిర్యాల జిల్లాలో మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ బంద్ జరిగింది. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న నియంత్రణ లేని ఆన్‌లైన్ మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ నలగొండ్ల జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మెడికల్ షాపుల బంద్ చేపట్టారు.
చిట్యాల మండల కేంద్రంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఔషధ దుకాణాల బంద్ విజయవంతమైంది. ఖమ్మం, మధిరలో వ్యాపారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో భారీ మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మెడికల్ షాపులు సంపూర్ణ బంద్ పాటించాయి. చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులతో పాటు కార్పొరేట్ ఫార్మసీలు కూడా మద్దతు ప్రకటించాయి. అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో ర్యాలీ నిర్వహించారు.



