– సుస్థిర వ్యవసాయానికి శాస్త్రవేత్తల సూచనలు
– సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యంపై అవగాహన
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం రాజానగరం గ్రామంలో శుక్రవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్. రామ్ ప్రసాద్, డాక్టర్. పి. ఝాన్సీ రాణి పాల్గొని రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
డాక్టర్. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట పంటల ప్రాముఖ్యత గురించి వివరించారు. పచ్చిరొట్ట పంటలను వినియోగించడం ద్వారా నేలకు సేంద్రియ కర్బనం చేరి భూసారం పెరుగుతుందని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే పంట మార్పిడి, పంటల వైవిధ్యీకరణ పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని సూచించారు.
డాక్టర్. పి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. వరి సాగులో నారుమడి నుంచి ప్రధాన పొలం వరకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, కలుపు నివారణ చర్యలు, మట్టి పరీక్షల ప్రాధాన్యత గురించి రైతులకు వివరించారు. అలాగే సమస్యాత్మక భూములకు అనుసరించాల్సిన పరిష్కార మార్గాలను సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ రైతులకు ఫెర్టిలైజర్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతి, విద్యార్థులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



