న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు రికార్డ్ పతనాన్ని చూస్తోన్న వేళ నిటి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా రూపాయిని గాలికి వదిలేయండంటూ పరోక్షంగా అత్యంత బాధ్యత రహిత్య వ్యాఖ్యలు చేశారు. డాలర్‌తో రూపాయి విలువ 100కు తగ్గాల్సిందేనన్నారు. చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా రూపాయి విలువ పడేల్సిందేనని ఆర్‌బిఐ పలు సూచనలు చేయడం ఆర్థిక నిపుణులను ఆగ్రహానికి గురి చేస్తోంది. డాలర్‌కు రూ.100 అనేది కేవలం మానసిక భావనే అని పనాగరియా పేర్కొన్నారు. చమురు దిగుమతులు తగ్గగానే తిరిగి రూపాయి పుంజుకోవచ్చన్నారు. రూపాయి విలువ తగ్గితే దిగుమతులకు అయ్యే ఖర్చు పెరగొచ్చని.. అదే సమయంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా రూపాయి విలువ తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయొచ్చని పనాగరియా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రస్తుత చమురు కొరత కొన్ని నెలల నుంచి ఒక ఏడాది వరకు కొనసాగితే రూపాయి మొదట్లో బలహీనపడుతుంది. కానీ పెట్టుబడిదారులు పెరగడం వల్ల భవిష్యత్తులో భారీగా కోలుకుంటుంది. అయితే ఈ చమురు సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే విదేశీ మారక నిల్వలను హరించివేస్తుంది. రూపాయి విలువ తగ్గింపు తప్ప మరే ఇతర మార్గాన్ని అనుసరించినా అది నష్టానికే దారితీస్తుంది. ఈ సమయంలో డాలర్లలో జారీ చేసిన సావరిన్ బాండ్లు లేదా అధిక వడ్డీ ఇచ్చే ఎన్నారై డాలర్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడకూడదు.’ అని ఆర్‌బిఐకి16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా పని చేసిన అరవింద్ పనాగరియా సూచించారు. 2013 నాటి కరెన్సీ సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశ స్థూల ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉందని చెప్పకొచ్చారు.



