కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు
పరిస్థితి విషమించి మృతి
నవతెలంగాణ – మెహదీపట్నం
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం దారుణ ఘటన జరిగింది. ప్రముఖ న్యాయవాద ఖాజా మొయినుద్దీన్ ఇంటి బయటకు వచ్చి కారు ఎక్కబోతుండగా ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో కారుతో ఢీకొట్టి కొద్ది దూరం అలాగే ఈడ్చుకెళ్లారు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్(63) శనివారం ఉదయం తన నివాసం నుంచి వ్యక్తిగత పనిపై బయటకు వచ్చి కారు వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన కదలికలను గమనిస్తున్న దుండగులు నెంబర్ ప్లేట్ లేని కారుతో వేగంగా వచ్చిన ఆయనను బలంగా ఢీకొట్టారు. దాంతో కిందపడిన న్యాయవాదిని కారుతో అలాగే కొద్దిదూరం ఈడ్చుకెళ్లి వదిలేసి.. నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. భూ వివాదాలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల కేసుల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి కుమారుడు ఫర్హాన్ కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన తండ్రి హత్యపై స్పందించిన ఆయన.. మలక్‌పేట్, మల్లేపల్లి, హైదరాబాద్ శివార్లలోని వక్ఫ్ ఆస్తుల అక్రమ ఆక్రమణలు, కబ్జాలు, ప్రయివేటు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కేసులను తన తండ్రి వాదిస్తున్నారని తెలిపారు. ఈ కేసుల నేపథ్యంలో పలువురి నుంచి తన తండ్రికి బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు జరిగినట్టు చెప్పారు. వారే ఈ హత్య చేసి ఉంటారని, ప్రభుత్వం తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.



