ప్యాకింగ్ ప్లాంట్ పునరుద్ధరణ సాకుతో మూత
పాల సేకరణ పెంచాలి.. డెయిరీని రక్షించాలి
లీటర్‌కు రూ.4 బోనస్ ఇవ్వాలి
వారానికోసారి బిల్లులు చెల్లించాలి
తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు
డెయిరీని సందర్శించిన సంఘం నేతలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్యాకింగ్ ప్లాంట్ పునరుద్ధరణ సాకుతో ఖమ్మం విజయ డెయిరీని మూసివేతపై తెలంగాణ రైతు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లాంట్‌ను పునరుద్ధరించడంతో పాటు పాల సేకరణ పెంచాలని డిమాండ్ చేసింది. డెయిరీని తక్షణం తెరవకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం బృందం మూతబడిన విజయ డెయిరీ ప్యాకింగ్ యూనిట్‌ను మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 సంవత్సరాలుగా రైతుల నుండి విజయవంతంగా పాలు సేకరిస్తున్న విజయ డెయిరీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మూత వేసిందని విమర్శించారు. గతంలో 30 వేల లీటర్ల పాల సేకరణ చేసిన డెయిరీని దిగజార్చి నేడు 3,500 నుంచి 7000 లీటర్లు మాత్రమే సేకరిస్తుండటం సరికాదన్నారు. ఇక్కడ సేకరిస్తున్న 7000 లీటర్ల పాలను హైదరాబాద్ తరలించి అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు.
ఖమ్మం డెయిరీలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బంది రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రకటించిన బోనస్‌ను ఇవ్వకపోగా ప్రతి నెలా చెల్లించాల్సిన పాల బిల్లులను రెండు నెలలకోసారి చెల్లిస్తున్నారని అన్నారు. ప్రయివేటు డెయిరీల తరహాలో వారానికోసారి బిల్లులు చెల్లిస్తే విజయ డెయిరీ వైపు రైతులు మొగ్గుచూపుతారని సూచించారు. అంతేకాదు, పాల సేకరణ ఎందుకు తగ్గిపోయిందో.. విశ్లేషణ చేయాలని, అందుకు పరిష్కారాన్ని వెతకాలని కోరారు. విజయ డెయిరీ భూములను కబ్జా చేయాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. డెయిరీని సందర్శించిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె మీరా, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు చిలకల్ల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బోడేపూడి వీరభద్రం, వేదగిరి మురహరి, వీరాస్వామి, కృష్ణ తదితరులు ఉన్నారు.
విజయ డెయిరీ మూతపై ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



