మేనేజ్‌మెంట్ కోటా పేరుతో దోపిడీని అరికట్టాలి
ఓయూ బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను మార్చాలి : ఎస్.ఎఫ్.ఐ
‘ఇంజినీరింగ్’పై ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బి-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) సీట్ల భర్తీని ఆన్‌లైన్ ద్వారానే పూర్తి పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విద్యార్థులకు తగిన ప్రిపరేషన్ సమయం కల్పించేలా సవరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జూనుగరి రమేష్, రాష్ట్ర నాయకులు అరుణ్ లతో కూడిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బి-కేటగిరీ సీట్ల వివరాలు, సీట్ల సంఖ్య, దరఖాస్తుల ప్రక్రియ, ఎంపిక విధానం వంటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేర్కోన్నారు.. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, అనేక కళాశాలలు ఇప్పటికే బి-కేటగిరీ సీట్లను విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
కొన్ని కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ దరఖాస్తు చేసుకునే లింకులను యాక్టివ్‌లో ఉంచడం లేదని, మరికొన్ని కళాశాలలు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. దీంతో అర్హత కలిగిన అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్వీనర్ కోటాలో 70 శాతం సీట్లు ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే వాస్తవానికి మెరిట్‌కు బదులుగా భారీ మొత్తంలో ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు బి-కేటగిరీ సీట్లలో ప్రవేశం కోసం కళాశాలలను సంప్రదిస్తే రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఫీజులు, అదనంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డొనేషన్లు డిమాండ్ చేస్తున్నారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలతో విద్యా హక్కును ధనికులకు మాత్రమే పరిమితం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ దుస్థితిని అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలల బి-కేటగిరీ సీట్లను ఒకే ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయాలని, ప్రతి కళాశాల సీట్ల వివరాలు, దరఖాస్తులు, మెరిట్ జాబితా, ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ప్రజల ముందుంచాలని, అక్రమ ఫీజులు, డొనేషన్ల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను పరీక్షలకు కేవలం పది రోజుల ముందే ప్రకటించడంతో విద్యార్థులకు సరైన ప్రిపరేషన్‌కు అవకాశం లేకుండా పోతోందని నాగరాజు తెలిపారు. సెమిస్టర్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని, తగిన సమయం లేకపోవడంతో వారు ఒత్తిడికి గురై ఆశించిన స్థాయిలో పరీక్షలు రాయలేకపోతారని, వారికి పరీక్షలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను సవరించి, ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉండేలా కొత్త షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.



