నిబంధనలు ఉల్లంఘిస్తున్న
విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి:
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
యం. అడివయ్య
మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేట్, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్లను నియమించాలని, నిబంధనలు ఉల్లంగిస్తున్న విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య డిమాండ్ చేశారు. ప్రయివేట్, కార్పొరేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అడివయ్య, మెదక్ జిల్లా కార్యదర్శి కె.యశోదలు మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని ప్రయివేట్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్‌ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాల, కళాశాలల్లో ర్యాంపులు నిర్మించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 16,17 మరియు జీఓ యం.ఎస్ నెం 3, 01.05.2018 ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు అంగవైకల్యం కలిగిన పిల్లలకు సమగ్ర విద్యా అందించడంతో పాటు ప్రత్యేక బోధన కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని నిబంధనలు ఉన్న ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీబీఎస్‌ఈ ఆఫిలియేషన్ బై లా మరియు 2024 మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఇంక్లూసీవ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు కల్పించడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్లను నియమించాలని నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో అమలు కావడం లేదన్నారు.
ఇండివిడ్యుయల్ ఎడ్యుకేషన్ ప్లాన్, బ్రెయిలీ, సైన్ లాంగ్వెజ్ బోధన పద్ధతులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉన్న జిల్లాలో అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ టీచర్స్ నియామకాలు చేసిందన్నారు. ప్రయివేట్ విద్యా సంస్థల్లో కూడా స్పెషల్ టీచర్స్ నియమించడంతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బోధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బాలభరోసా పథకంలో భాగంగా ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్తుల్లో వైకల్యాలను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో గత సంవత్సరం మానసిక వైకల్యం కలిగిన విద్యార్థికి అడ్మిషన్ నిరాకరించడం జరిగిందని అన్నారు. ప్రయివేట్ విద్యా సంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించే వరకు ఉద్యమం చెస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కె. మల్లేశం, జిల్లా అధ్యక్షులు ముత్యాలు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె. కవిత, వై దుర్గ, టి.యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప, గుమ్మడిదల శ్రీనివాస్, కె.చంద్రం, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, పి.చంద్రం, వెంకన్న జిల్లా నాయకులు సాయిలు, భాగయ్య, రమేష్, సత్యమ్మ, పోచమ్మ, లింగయమ్మ తదితరులు పాల్గొన్నారు.



