Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅనుమతి లేని ప్రయివేటు కాలేజీల దందా

అనుమతి లేని ప్రయివేటు కాలేజీల దందా

- Advertisement -

చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
తరగతులు ప్రారంభమై
 నెల రోజులైనా గుర్తింపేది?
వెయ్యికి పైగా ప్రయివేటు జూనియర్ కాలేజీల దరఖాస్తులు పెండింగ్
నిబంధనల మేరకే ముందుకెళ్తున్నామంటున్న అధికారులు
ప్రతి ఏడాదిలాగే 
ఈ సారి జాప్యమే..

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎవరైనా ప్రయివేటు వ్యక్తులు జూనియర్ కాలేజీలు నడిపించుకోవాలంటే ముందుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అనుమతి పొందాలి. తగిన పత్రాలు సమర్పిస్తే బోర్డు గుర్తింపునిస్తుంది. ఆ తర్వాత ప్రవేశాలు చేపట్టి విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ రాష్ట్రంలో సీన్ రివర్స్. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటారు. విద్యార్థులను చేర్చుకుంటారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జారీ చేసే అకడమిక్ క్యాలెండర్ కు సంబంధం లేకుండా తరగతులను ప్రారంభిస్తారు. ఒకవైపు అనుమతి కోసం తిరుగుతూనే మరోవైపు విద్యార్థులకు చదువులు చెబుతుంటారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగుతోంది. ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే గుర్తింపు ప్రక్రియను చేపట్టినా ఇప్పటికీ రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రయివేటు జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పేరుగాంచిన కార్పొరేట్ కాలేజీల నుంచి బడ్జెట్ కాలేజీల వరకు చాల వరకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. దాదాపు 1,350 వరకు జూనియర్ కళాశాలలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం 250 జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుమతించారు. 


రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనైతే ఒకట్రెండు కాలేజీలు మినహా మిగిలిన కాలేజీలు వాటి రెకగ్నైజేషన్ కోసం పడిగాపులు కాస్తున్నాయి. అయితే నిర్దేశిత నిబంధనలు పూర్తి చేయకపోవడం, అనుమతికి అవసరమైన పత్రాలను సమర్పించకపోవడమే ఆలస్యానికి కారణమని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా వాటిలో దాదాపు అన్ని కళాశాలలకు గుర్తింపు లభించింది. మరోవైపు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ తదితర కళశాలలు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు లభించింది. ప్రయివేటు జూనియర్ కాలేజీలు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం నాటికి 1405 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. దాదాపు అవే కళాశాలలకు ఈ ఏడాది అనుమతి పొందడం కష్టసాధ్యంగా మారుతున్నది. ముఖ్యంగా మల్టీ కాంప్లెక్స్ భవనాల్లోని కాలేజీలు సమర్పించిన పత్రాలేవి సరిగ్గా లేవనీ, సవరించుకుని తిరిగి సమర్పించాలని అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి గడువు విధించి ధృవపత్రాల సమర్పణకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతో వేగంగా తనిఖీలు పూర్తి చేసి గుర్తింపు ప్రక్రియను ముగించాలని ఆదేశించారు.జూనియర్ కాలేజీల అనుమతికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 29, ఇతర నిబంధనలను పూర్తి చేయడంలో ప్రయివేటు కాలేజీలు అపసోపాలు పడుతున్నాయి.

మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎలాంటి ప్రాంగణాల్లో ప్రయివేటు కళాశాలలను ఏర్పాటు చేశారో తెలుస్తున్నదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మే 31తో ఇంటర్మీడియట్ ప్రవేశాల మొదటి దశ ప్రవేశాలు ముగిశాయి. రెండో దశలో చేరేందుకు బోర్డు విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విద్యార్థులను ఆయా కళాశాలల్లో చేర్చే ముందు ఆ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు ఆ కాలేజీలకు అనుమతి ఇచ్చిందా? లేదా? తరచి చూసుకోవాలని సూచించింది. అయినప్పటికీ వెయ్యికి పైగా అనుమతి లేని కాలేజీల్లో లక్షలాది మంది విద్యార్థులు ఇప్పటికే చేరి చదుకుంటున్నారు. ఆ కాలేజీల్లో ఎవరికి గుర్తింపు లభిస్తుందో? ఎవరి గుర్తింపును రద్దు చేస్తారో? అనేది ప్రశ్నార్థకంగా మారింది.విద్యార్థుల భద్రత, పరిశుభ్రత తదితర సౌకర్యాల రీత్యా అనుమతి ప్రక్రియ కోసం పలు నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీతో పాటు బిల్డింగ్ స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికెట్. శానిటరీ సర్టిఫికెట్, ల్యాండ్ డాక్యుమెంట్లు / లీజ్ అగ్రిమెంట్, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ వివరాలు, ల్యాబ్, లైబ్రరీ ఫొటోలు తదితర నిబంధలను ప్రయివేటు కాలేజీలు పాటించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -