దశలవారీ అర్హత పరిమితులు
2 ఎకరాల వరకు ఒకేసారి బుకింగ్
ఐదు ఎకరాలకు పైబడితే
మూడు విడతల్లో..
విడతకు విడతకు
మధ్య పెరిగిన గ్యాప్
నెట్‌వర్క్ సమస్యతో
రైతుల ఇబ్బందులు
పాస్‌బుక్ లేని రైతుల అగచాట్లు
కట్టకు రూ.50కి పైన
ఇచ్చి పాస్‌బుక్‌ల సేకరణ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
యూరియా నిబంధనలు రోజురోజుకు క్లిష్టతరంగా మారుతున్నాయి. రబీలో ఎకరానికి మూడు కట్టల చొప్పున పంపిణీ చేయగా ఖరీఫ్ నాటికి దానిని రెండింటికి కుదించారు. వాస్తవానికి ఎకరానికి నాలుగు కట్టలు అవసరం అవుతుండగా.. రెండింటికి తగ్గించడంతో రైతాంగం ఇబ్బంది పడుతోంది. ఇక గతంలో 15 రోజులకు ఓ విడత చొప్పున ఇచ్చిన యూరియా కట్టలను ఇప్పుడు 20 రోజులకు పెంచడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాస్‌బుక్ ఉంటేనే యూరియా ఇస్తామనే కండిషన్ నేపథ్యంలో పట్టాలు లేని రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సుబాబుల్, జామాయిల్, ఇతర యూరియా అవసరం లేని పంటలు సాగు చేసిన రైతుల నుంచి ఒక్కో కట్టకు రూ.50కి పైన చెల్లించి పాస్‌బుక్స్ సేకరిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
పెరిగిన బుకింగ్ గ్యాప్
యూరియా బుకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవి అమల్లోకి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, రాష్ట్ర యాప్‌లో యూరియా బుకింగ్‌కు సంబంధించి దశలవారీ అర్హత పరిమితుల్లో మార్పు చేశారు. 2 ఎకరాల వరకూ ఒకేసారి పూర్తి పరిమాణం బుక్ చేసుకోవచ్చు. గతంలో రెండు కట్టలు ఒకసారి, రెండు కట్టలు మరోసారి బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఒకే విడతలో నాలుగు కట్టలను బుక్ చేసుకోవచ్చు. 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రెండవ విడతలో బుకింగ్ చేసుకోవాలి. గతంలో విడతకు విడతకు మధ్య 15 రోజుల వ్యవధి ఉండేది. కానీ ఇప్పుడు గడువును 20 రోజులకు పెంచారు. 5 ఎకరాలకు పైబడితే మూడు విడతలలో బుకింగ్ చేసుకోవచ్చు (40% : 30% : 30%) నిష్పత్తిలో చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 8 ఎకరాలకు పైబడితే అత్యధికంగా నాలుగు విడతల్లో బుకింగ్ చేసు కోవాల్సి వచ్చేది. ఇప్పుడు మూడు విడతల్లో చేసుకుంటే సరిపోతుంది. మారిన నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించి, బుకింగ్స్ జరిగే లా చూడాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య సంబంధిత ఏవోలను ఆదేశించారు.
రైతుల ఇబ్బందులు
యూరియా బస్తాల విషయంలో పలువురు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనేతర రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వీరితో పాటు హక్కు పత్రాలు లేని పోడు రైతులు, పాస్ పుస్తకాలు లేని సీలింగ్, మాన్యం, ఇతరత్ర భూములు సాగు చేసే రైతులు యూరియా బస్తాల కోసం అగచాట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్డీఎస్) రైతులను గుర్తించి యూరియా బస్తాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాన్యం భూములను సాగు చేసే రైతులను కౌలుదారులుగా గుర్తించి ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
సాంకేతిక సమస్యలు
ఇక యూరియా పంపిణీలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ సర్వర్ డౌన్ కావడం ఒకటైతే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఫోన్ నెట్‌వర్క్ సమస్య కారణంగా రైతులు సకాలంలో బుకింగ్స్ చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో యూరియా వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం డీఏపీ లభ్యత కూడా లేకపోవటంతో రైతులు యూరియాపై ఆధారపడుతున్నారు. బస్తా యూరియా రూ.266.50కి లభిస్తుండటంతో నానా ఇబ్బందులు ఎదుర్కొని పాస్‌బుక్‌లు సేకరిస్తున్నారు. ఇందుకు కట్టకు రూ.50కి పైన పట్టేదారు పాస్‌బుక్ ఇచ్చిన వారికి చెల్లిస్తున్నారు. మొత్తం మీద యూరియా కష్టాలు రైతులను ఏదో ఒక రకంగా వేధిస్తూనే ఉన్నాయి. ఎకరానికి నాలుగు కట్టల యూరియా అయితే సంపూర్ణంగా సరిపోతుంది. కానీ రెండు కట్టలు మాత్రమే ఇస్తుండటంపై రైతాంగం అసంతృప్తితో ఉంది.



