Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీలో అసంతృప్త జ్వాలలు

బీజేపీలో అసంతృప్త జ్వాలలు

- Advertisement -

కార్యవర్గ సమావేశానికి ఎంపీ అర్వింద్‌ డుమ్మా
ముభావంగా బండి, ఈటల, నలుగురు ఎమ్మెల్యేలు

కిషన్‌‌రెడ్డి, రాంచందర్‌‌రావు తీరుపై ఇతర నాయకుల గుస్సా
నితిన్‌ నబిన్ సూచనలు బేఖాతరు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాతీయ నాయకత్వం ఎంత ఫోకస్‌ ‌పెట్టినా..జాతీయ అధ్యక్ష‍ులు నితిన్‌ ‌నబిన్‌ ‌స్వయంగా వచ్చి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినా..బీజేపీలో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అంతర్గత పోరు తారాస్థాయికి చేరుతున్నది. బీజేపీ తెలంగాణ శాఖలపై కిషన్‌‌రెడ్డి గుత్తాధిపత్యం, రాష్ట్ర అధ్యక్ష‍ులు రాంచందర్‌‌రావు తీరుపై ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఎంపీ అర్వింద్‌ ‌డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌ ‌వచ్చినా ముభావంగా కనిపించినట్టు ఆ పార్టీ నేతలే లీకులిచ్చారు. తెలంగాణపై పట్టుసాధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్ష‍ులు నితిన్‌ ‌నబిన్‌ ‌చెప్పిన విషయాన్ని పక్కనపడేసి ఎవరి అజెండాతో వారు ముందుకు సాగుతుండటంతో ఎవరికి వారే యయునా తీరే అన్న చందంగా పరిస్థితి తయారైంది. జాతీయ అధ్యక్ష‍ులు హాజరైన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సైతం ఆ పార్టీ ఎంపీ ధర్మపూరి అర్వింద్‌ డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. ‘అధ్యక్ష‍ులు కనీసం ఫోన్‌ ‌చేసి కూడా చెప్పకుంటే ఎట్లొస్తం’ అని అర్వింద్‌ తన ‌సన్నిహితులు, పలువురు ఎమ్మెల్యేల వద్ద వాపోయినట్టు తెలిసింది. ‘అందరికీ బొట్టు పెట్టి పిలవడానికి ఇదేం పేరంటం కాదు’ అంటూ రాంచందర్‌‌రావు అగ్నికి ఆజ్యం పోశారు.

దీనిని బట్టే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మాడిపోయేలా పరిస్థితి తయారైందని అర్థమవుతున్నది. ఆ సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌కుమార్‌, ఎంపీ ఈటల సైతం ముభావంగానే ఉన్నట్టు తెలిసింది. వారికి సమావేశంలో సరైన గౌరవం దక్కకపోవడంతో వారు ఒకింత అసహనంతో ఉండలేక ఆ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తున్నది. పార్టీలో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి గ్రూపు అధిపత్యం కొనసాగు తుండటంతో ఆయన వ్యతిరేకుల పరిస్థితి బండకింద చేయిపడ్డ తీరుగా తయారైంది. అధ్యక్ష‍ులు రాంచందర్‌‌రావు అయినప్పటికీ కిషన్‌‌రెడ్డి ఏం చెబితే అదే అన్నట్టు పరిస్థితి ఉందనీ, ఇది పార్టీకి చేటుగా మారిందని రాంచందర్‌‌రావు వ్యతిరేక గ్రూపు వాళ్లు చెబుతున్నారు. నేతల మధ్య ఉన్న పరిస్థితిని చక్కదద్దడానికి వచ్చిన నితిన్ నబిన్‌కు వాస్తవాలు తెలియకుండా ఆయన చుట్టూ కిషన్‌‌రెడ్డి గ్రూపు ఇనుప కంచెలా వ్యవహరించిందనే విమర్శలు ఆ పార్టీ శ్రేణుల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆధిపత్య ధోరణిపై ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలు అధిష్టానానికి లేఖలు కూడా రాసినట్టు సమాచారం. మరోవైపు బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి పార్టీతో పొసగడం లేదు. వారు దూరం దూరంగా ఉంటున్నారు. బీజేపీఎల్పీ నేత అయినప్పటికీ ఏలేటి మహేశ్వరరెడ్డికి కూడా పార్టీలో ఏం జరుగుతుందనే సమాచారం ఉండటం లేదు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటే అనుమతిలేనిదే ఇక్కడ ప్రెస్‌‌మీట్లు పెట్టొద్దని ఆయన మొహం మీదనే చెప్పారనే చర్చ నడుస్తున్నది. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద మహేశ్వర్‌‌రెడ్డి చెప్పి తెగ బాధపడిపోతున్నారట. ఆ దెబ్బతో ఆయన ఆఫీస్‌‌వైపు రావడాన్ని తగ్గించేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారందరినీ ఒకతాటి పైకి తీసుకరావడంలో రాంచం దర్‌‌రావు విఫలమవుతున్నారనే టాక్‌ ‌వినిపి స్తున్నది. ఇలాంటి దయనీయ పరిస్థితుల కారణంగా క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు కని పించడం లేదనే చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పని తీరు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ముఖ్య నాయకులను భాగ స్వామ్యం చేయకపోవడం, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తి కొనసాగుతున్నది. ఇటీవల పలువురు నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి పూర్తిగా తగ్గలేదనేది అర్థమవుతోంది. నితిన్ నబిన్ రాష్ట్ర నాయకులతో విడివిడిగా సమావేశమై సమన్వయంతో పనిచేయాలని, మీడియా ముందుకు విభేదాలు తీసుకురావద్దని సూచించినట్టు సమాచారం. అయితే కార్యవర్గ సమావేశం వంటి కీలక కార్యక్రమానికి అందరూ ఒకే వేదికపై కనిపించకపోవడం వల్ల ఆ సూచనలు ఫలించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలకు పార్టీ సిద్ధమవుతున్న సమయంలో అంతర్గత విభేదాలు కొనసాగడం బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో విభేదాలు ఇంకా సమసిపోలేదని సంకేతాలు తాజా పరిణామాలతో వెల్లడవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -