Sunday, May 24, 2026
E-PAPER
Homeనల్లగొండఅమెరికా-ఇరాన్ యుద్ధంతో సామాన్యుడిపై మోయలేని భారం

అమెరికా-ఇరాన్ యుద్ధంతో సామాన్యుడిపై మోయలేని భారం

- Advertisement -
  • సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

నవతెలంగాణ–ఆలేరు రూరల్:

అమెరికా,ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం భారతదేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,వారి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోందని సీపీఐ (ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆలేరులో నూతనంగా ఎన్నికైన సీపీఐ (ఎం) నాయకులు,మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన “అంతర్జాతీయ యుద్ధాలు – దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం” అనే సెమినార్‌లో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎండి జహంగీర్ మాట్లాడుతూ,భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో 85 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేశారు.ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయని,దాని ప్రభావం దేశీయంగా పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తోందని పేర్కొన్నారు.ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు, వంటనూనెలు,నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుతున్నాయని విమర్శించారు.అదేవిధంగా సబ్బులు,ప్యాకేజ్డ్ వస్తువులు వంటి వినియోగ వస్తువుల ధరలపై కూడా భారం పెరుగుతోందన్నారు.

యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా రసాయన ఎరువుల ముడిపదార్థాల సరఫరా దెబ్బతిని,దేశంలో ఎరువుల కొరతతో పాటు ధరలు పెరిగాయని, డీజిల్ ధరల పెరుగుదల రైతులపై అదనపు పెట్టుబడి భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ముడి చమురు దిగుమతుల కోసం అధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయి విలువ బలహీనపడుతోందని, ఫలితంగా దిగుమతి వస్తువుల ధరలు మరింత పెరుగుతున్నాయని తెలిపారు.దీనివల్ల ఒక సగటు కుటుంబంపై నెలకు వేల రూపాయల అదనపు భారం పడుతోందని పేర్కొంటూ,కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు.

యుద్ధాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సెమినార్‌లో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం,పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్,పట్టణ నాయకులు మోరిగాడి రమేష్,మండల నాయకులు సూదగాని సత్యరాజయ్య,జూకంటి పౌలు,ఘనగాని మల్లేష్, మొరిగాడి మహేష్,మాదాని నవీన్,కాసుల నరేష్, ముప్పిడి యాదగిరి,పిక్క గణేష్,మహిళా సంఘం నాయకులు మోరిగాడి భాగ్యలక్ష్మి,స్వరూప,ఘనగాని భాగ్యలక్ష్మి,మహాలక్ష్మి,అనిత,బొప్పిడి యశోద తదితరులు పాల్గొన్నారు.అలాగే మండల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -