Tuesday, May 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినయా ఉదారవాద విష వృక్ష ఫలాలు

నయా ఉదారవాద విష వృక్ష ఫలాలు

- Advertisement -


ప్రస్తుతం డాలర్తో పోల్చితే రూపాయి విలువ బాగా పడిపోయింది. ఒక డాలర్ విలువ 96 రూపాయలు దాటిపో యింది. ఇది ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో డాలర్ కు రూ.100 దాటి చెల్లించవలసి వుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఆసియాలోకెల్లా అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీ గా ఇప్పుడు మన రూపాయి ఉంది. ప్రపంచంలోని అతి బలహీనమైన కరెన్సీల జాబితాలో చేరింది. రూపాయి విలువ ఈ విధంగా పడిపోడానికి కారణం పశ్చిమాసియా యుద్ధమేనని మోడీ ప్రభుత్వం చెప్తోంది. ​

యుద్ధం తలెత్తిన కారణంగా కరెన్సీల మారకపు విలువలలో చోటు చేసుకునే మార్పుల గురించి షేర్ మార్కెట్ లో అంచనాలు ముందుగానే తెరమీదకు వస్తాయి. దాంతో నిజంగానే మారకపు రేటు మీద ఆ ప్రభావం పడుతుంది. ఐతే, ఈ యుద్ధం తలెత్తక ముందునుంచీ కూడా మన రూపాయి విలువ పడిపోవడం మొదలైంది. 2024 చివరికి ఒక డాలర్ కు రు.85.47 ఉంటే, ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయిల్ దాడి ప్రారంభం కన్నా ముందే, ఫిబ్రవరి 27, 2026 నాటికి మన రూపాయి విలువ 91.08 కి పడిపోయింది.
మన దేశం నుండి డాలర్ రూపంలో ఉండే ద్రవ్య పెట్టుబడులు బయటకు పోవడం వల్లనే మన రూపాయి విలువ పడిపోయిందని కారణం చూపిస్తారు. యుద్ధం మొదలయ్యాక మన దేశం నుంచి బయటకు పోయిన పెట్టుబడులు గణనీయంగానే ఉన్నప్పటికీ, ఈ యుద్ధం ప్రారంభం కాకముందునుంచీ పెట్టుబడులు బైటకు పోవడం మొదలైంది. దాని ప్రభావాన్ని అరికట్టడానికి మనవద్ద నున్న విదేశీ మారకపు నిల్వలను ఏకంగా 5.2 శాతం మేరకు మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ, రూపాయి విలువ పడిపోవడం ఆగలేదు.
ఇక్కడ రిజర్వు బ్యాంక్ చేసుకున్న జోక్యంలో సమతూకం లోపించింది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు బాగా వచ్చి పడుతున్నప్పుడు మన కరెన్సీ విలువ ఆ మేరకు పెరగడం దేశానికి నష్టం. రూపాయి విలువ పెరిగితే మనం దిగుమతి చేసుకునే సరుకుల ధరలు తగ్గిపోతాయి. వాటితో పోల్చినప్పుడు దేశీయ సరుకుల ధరలు ఎక్కువగా ఉంటాయి. అందువలన విదేశీ దిగుమతులతో మన దేశీయ ఉత్పత్తి దారులు పోటీ పడలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశీయ పరిశ్రమలు మూత పడతాయి. పైగా ఈ విదేశీ పెట్టుబడులన్నీ మనం తిరిగి చెల్లించవలసిన ‘రుణాలు’గా భారంగా మారుతాయి. దేశీయ పరిశ్రమలు మూత పడినందువలన దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. మరోవైపు చెల్లించవలసిన విదేశీ రుణాలు పెరిగిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కోసం విదేశాల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి రిజర్వుబ్యాంక్ తన వద్ద ఎక్కువ మొత్తంలో విదేశీ నిల్వలను ఉంచుకుంటుంది. అప్పుడు రూపాయి విలువ పెరిగిపోకుండా అదుపులో ఉంటుంది.
మరి విదేశీ పెట్టుబడులు దేశం విడిచిపెట్టి పోతున్నప్పుడు రిజర్వుబ్యాంక్ దగ్గర ఉన్న విదేశీ మారకపు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రూపాయి విలువ పడిపోకుండా అరికట్టడం సాధ్యమే కదా అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. కాని ఇక్కడే సమతూకం దెబ్బ తింటుంది.

విదేశీ పెట్టుబడులు బయటకు తరల డం మొదలుకాగానే, రిజర్వుబ్యాంక్ దగ్గర ఉన్న నిల్వలను మార్కెట్ లోకి విడుదల చేయడం జరుగుతుంది. దాంతో స్టాక్ మార్కెట్ లోని స్పెక్యులేటర్లలో అంచనాలు మొదలౌతాయి. రిజర్వు బ్యాంక్ దగ్గర ఉండే నిల్వలు తగ్గిపోతున్నాయి కనుక రూపాయి విలువ పడిపోకుండా ఆపగలిగే దాని శక్తి తగ్గింది కనుక రాబోయే రోజుల్లో రూపాయి విలువ పతనం ఇంకా కొనసాగుతుందన్న అంచనాలకు వారు వస్తారు. దాంతో రూపాయి విలువ మరింత పడిపోతుంది. అందుచేత రిజర్వుబ్యాంక్ దగ్గర ఉండే నిల్వలను విడుదల చేయడం ద్వారా రూపాయి విలువను నిలబెట్టడం సాధ్యం కాదు. ముఖ్యంగా విదేశీ వ్యాపారంలో ఎప్పుడూ లోటు ఉండే దేశాలలో (మన దేశం కూడా అటువంటిదే) ఇది సాధ్యపడదు. విదేశీ వ్యాపారంలో లోటు ఉండే దేశాలకు తమ కరెన్సీ విలువ ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం పొంచివుంటుంది. ఇక యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు వేరే చెప్పనక్కరలేదు. ఇటువంటి దేశాల్లో కరెన్సీ విలువ ఒకే దిశలో మారుతూ వుంటుంది. అదే పతనమయ్యే దిశ.
ఈ పతనాన్ని ప్రభావితం చేసే మరో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి: కరెన్సీ స్వయంపతన స్వభావం. దిగుమతుల ధరలు పెరగగానే, ముఖ్యంగా చమురు వంటి ప్రధాన సరుకుల ధరలు పెరగగానే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అందువలన రూపాయి విలువ మరింత పడిపోతుందన్న అంచనాలు తలెత్తుతాయి. రెండో అంశం: రూపాయి విలువ పడిపోనుందన్న అంచనాలకు తోడు, తమ సంపద భద్రంగా ఉండాలంటే ‘పన్నులే లేని స్వర్గాల’ వంటి దేశాల్లో ఆ సంపదను దాచుకోవడం మంచిది అని మూడవ ప్రపంచ దేశాల్లోని సంపన్నులు భావించడం. అలా దాచుకునేది డాలర్ల రూపంలో గనుక డాలర్ కు డిమాండ్ పెరుగుతుంది. రూపాయి విలువ మరింత పడిపోతుంది.
ఇలా ద్రవ్యోల్బణం తలెత్తడం, ఆ వెంటనే రూపాయి విలువ పడిపోవడం, ఒక చక్రభ్రమణం మాదిరిగా నిరంతరాయంగా కొనసాగవలసిందేనా? ప్రపంచ మార్కెట్ లో స్వేచ్ఛాయుత పోటీ ఉంది గనుక ఎక్కడో ఒక దగ్గర ఈ కరెన్సీల మారకపు ధరలు స్థిరపడతాయి అని అనుకోలేము. దేశీయ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ స్పెక్యులేటర్లు వ్యవహరించే తీరు వలన మన కరెన్సీ విలువ పడిపోకుండా నిలదొక్కుకునే పరిస్థితి ఏనాటికీ ఏర్పడదు. ఈ వాస్తవాన్ని ద ష్టిలో ఉంచుకునే మూడవ ప్రపంచ దేశాల్లోని కరెన్సీల మారకపు రేట్లను డాలర్ తో పోల్చినప్పుడు ఏదో ఒక రేటు దగ్గర స్థిరంగా ఉంచే విధానాన్ని గతంలో పాటించారు. అప్పుడు విదేశీ మారకపు ద్రవ్యం ఎంత కావాలంటే అంత మోతాదులో లభించేది కాదు. దానికి ‘రేషనింగ్’ విధానాన్ని అమలు చేసేవారు. 1949లో రూపాయి మారకపు విలువను ఒక డాలర్ కు 5 రూ. గా నిర్ణయించారు. 1966 వరకూ అదే రేటు కొనసాగింది. అందువలన విదేశీ, స్వదేశీ స్పెక్యులేటర్ల దురాశల పర్యవసానాలు మన రూపాయి విలువ మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

కాని నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాక అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా రూపాయి విలువను ఎప్పుడు బడితే అప్పుడు మార్చే పద్ధతి ప్రవేశించింది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు డాలర్ల రూపంలో ఎంత మొత్తంలోనైనా స్వేచ్ఛగా ప్రవేశించడానికి తలుపులను బార్లా తెరిచారు. దాంతో మన రిజర్వు బ్యాంక్ దగ్గర డాలర్ నిల్వలు అమాంతం పెరిగిపోయాయి. 2026 ఫిబ్రవరి 27 నాటికి 72,850 కోట్ల డాలర్ల నిల్వలు చేరాయి. ఇలా డాలర్ నిల్వలు పెరుగుతున్న కాలం లోనే, డాలర్ విలువ 1992లో రు.22.74 గా ఉన్నది కాస్తా ఇరాన్ మీద దాడి మొదలయ్యే ముందురోజు నాటికి రు.91.08 కి చేరింది. ఒకపక్క డాలర్లు వచ్చిపడుతూనేవున్నాయి, మరోపక్క రూపాయి విలువ పడిపోతూనేవుంది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న రూపాయి పతనం తీరు ఇంతకు ముందు కాలంలో మాదిరిగా కాక, విభిన్నంగా ఉంది. మొదటిది: గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ పతనం చాలా ఎక్కువ మోతాదులో ఉంది. రెండవది: ఎక్కడో ఒక దగ్గర, తాత్కాలికంగానైనా, ఈ పతనం ఆగేట్టు కనిపించడం లేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది: ఇరాన్ తో యుద్ధాన్ని అమెరికా ఇప్పుడిప్పుడే ఆపేట్టు లేదు. ఎందుకంటే అమెరికా ఓటమిని ఒప్పుకోడానికి సిద్ధంగా లేదు. మరోవైపు యుద్ధాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకుపోగలిగే స్తోమతా లేదు. యుద్ధం కొనసాగినంత కాలమూ భారతదేశపు విదేశీ చెట్టింపుల ఖాతా మీద వత్తిడి కొనసాగుతూనే వుంటుంది. దానితోబాటు రూపాయి విలువ పడిపోవడమూ కొనసాగుతుంది. రెండవ కారణం: ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న మాంద్యం. ఈ మాంద్యం నయా ఉదారవాద విధానాల పర్యవసానం. ఈ మాంద్యం కారణంగా అమెరికా మూడవ ప్రపంచ దేశాలమీద వత్తిడి పెంచి అసమాన వాణిజ్య ఒప్పందాలను రుద్దుతోంది. తద్వారా తాను ఈ సంక్షోభంలోంచి బైట పడేందుకు ప్రయత్నిస్తోంది. అంటే సంక్షోభాన్ని భారత దేశంతో సహా మూడవ ప్రపంచ దేశాలకు ‘ఎగుమతి’ చేస్తోంది. ఇటువంటి అసమాన వాణిజ్య ఒప్పందాల ద్వారా భారతదేశం విదేశీ చెల్లింపుల ఖాతా మరింత ప్రతికూలంగా మారుతుంది. మన కరెన్సీ విలువ మరింత దిగజారతుంది. ఈ విధంగా నయా ఉదారవాద విషవృక్ష ఫలాలు మనకు లభిస్తున్నాయి!

ఈ మోడీ ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించిన అవగాహన ఏమాత్రమూ లేదు. పైగా చాలా అనైతికమైన రీతిలో అది అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో అంటకాగుతోంది. దాంతో బయటపడే దారులను వెతికే అవకాశాలు కూడా లేకుండా పోయాయి.
చివరికి పాకిస్తాన్ కు కూడా దౌత్యం నెరపగలుగుతోంది కాని మన ప్రభుత్వం ఏమీ చేతకాని స్థితిలో ఉండిపోయింది. ఐతే ప్రస్తుతం రూపాయి విలువ పడిపోడానికి మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని నిందించవచ్చు. కాని, ఈ సంక్షోభానికి మూలాలు మాత్రం రూపాయి మారకపు విలువను ‘స్వేచ్ఛా మారకపు’ విధానం ప్రకారం నిర్ణయించడం మొదలు పెట్టిప్పటి నుంచీ ఉన్నాయి. ఒక మూడవ ప్రపంచ దేశం, అందునా, దీర్ఘకాలంగా విదేశీ వాణిజ్యలోటు కలిగివుండే దేశం, తన కరెన్సీ విలువను నిర్ణయించే అధికారాన్ని ‘మార్కెట్ శక్తులకు’ విడిచిపెడితే జరిగేది ఇదే. మరోలా చెప్పాలంటే, ఒక చిన్న స్పెక్యులేటర్ల గుంపు దయా దాక్షిణ్యాలకు దేశంలోని కోట్లాదిమంది శ్రామిక ప్రజల జీవితాలను విడిచిపెట్టడమే.
ఇప్పుడు దేశం నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పెక్యులేటర్లను సంతృ ప్తిపరిచే కొన్ని చర్యలను చేపట్టవచ్చు. కొన్ని రకాల ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లను పెంచడం, లేదా పన్ను రాయితీలను ప్రకటించడం వంటివి చేయవచ్చు. గతంలో 2013లో ఇటువంటి పరిస్థితే వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం ఆ విధంగానే చేసింది. కాని అటువంటి చర్యలు శ్రామిక ప్రజానీకపు జీవితాలమీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వారికి అందవలసిన సంక్షేమ పథకాలు తగ్గిపోతాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం వారి ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుంది. ఇంత జరిగినా, రూపాయి విలువ పతనం ఆగేది మాత్రం తాత్కాలికంగానే సుమా. ఆ పతనం మళ్లీ మొదలవగానే మళ్లీ శ్రామిక ప్రజానీకం మరిన్ని త్యాగాలకు సిద్ధం కావలసివస్తుంది.
అందుచేత రూపాయి మారకపు విలువను ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా నిర్ధారించి అక్కడే కొనసాగేట్టు చేయడమే పరిష్కారం. అందుకోసం పెట్టుబడుల రాకపోకలమీద ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణను చేపట్టాల్సిందే. అప్పుడే మన ఆర్థిక పరిస్థితి మనగలుగుతుంది. ప్రజల జీవితాలు స్పెక్యులేటర్ల దురాశకు బలికాకుండా ఉంటాయి.
ప్రభాత్ పట్నాయక్


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -