Monday, May 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅతని స్మరణ ఓ చైతన్యం

అతని స్మరణ ఓ చైతన్యం

- Advertisement -


అతను నిష్క్రమించి అర్ధశతాబ్దం గడిచింది. అతని చలన దృశ్యమేదీ చూసిన దాఖలా కూడా ఇప్పుడు నాలాంటి వాళ్లకు లేదు. కానీ ఒకసారి ఆయనను చదువుతూ ఉంటే మనసంతా చైతనంతో నిండిపోతుంది. అది గతించిన చరిత్రకాదు, వర్తమానపు ఉద్యమ స్పృహ ఆవహిస్తోంది. అందుకనే వాళ్లు అమరులు. వ్యక్తులుగా మనముందు ఇపుడు ఉండవచ్చు, లేదా జీవితాన్ని విరమించనూవచ్చు. మనకు మాత్రం నిత్యం ప్రేరణగా నిలుస్తూనే ఉంటారు. మార్క్సిస్టు తాత్వికతతో కమ్యూనిస్టు ఆచరణలో గడిపిన జీవితం మనలో స్ఫూర్తి నింపుతూనే ఉంటది. అలాంటి జీవితమే కామ్రేడ్ డాక్టర్ సత్యపాల్ తులిది. 1948 నుండి హైద్రాబాద్‌లో ఉద్యమ జీవితాన్ని ఆరంభించి, హైద్రాబాద్‌లోనే జీవితాన్ని ముగించారు. నగరంలోని కాస్త పెద్దతరం వామపక్ష, అభ్యుదయ శ్రేణులకు ఆత్మీయంగానే పరిచయమయి ఉంటాడు.


అతడు వృత్తిరీత్యా వైద్యుడు. ప్రవృత్తిరీత్యా విప్లవకారుడు. మనకు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాల, విప్లవాల సందర్భంగా వైద్యవఅత్తిని విప్లవ శ్రేణుల సేవకు ఎలా వినియోగించారో చాలామందిని చూడవచ్చు. ఉదాహరణకు డా॥ కొట్నీస్, నార్మన్ బెతూన్, చెగువేరా కూడా వైద్యులే! అలానే మన సత్యపాల్ తులి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటకాలంలో యోధులైన క్షతగాత్రులకు, అనారోగ్య పీడితులకు తన సేవలందించేందుకు పార్టీ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడు. డా.తులి ఆనాటి పంజాబ్ రాష్ట్రంలోని సియోల్ కోటలో 1919లో జన్మించారు. ఆ ప్రాంతం ఇపుడు పాకిస్తాన్‌లో ఉంది. సంపన్న కుటుంబమే, తండ్రి రైల్వేలో మేనేజరుగా చేశారు. ముగ్గురు సోదరులు, ఒక సోదరి, ఆయనకు రెండేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. తన సోదరే పెంచి పెద్దచేసింది. దయ, కరుణ ప్రేమ నిండిన హఅదయంతో ఎదిగాడు. అమఅతసర్ వైద్య కళాశాలలో వైద్యకోర్సును అభ్యసించి 1944లో కళాశాలలోనే ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన విద్యార్థి దశనుండే ఎదుటి వారి బాధల పట్ల ప్రతిస్పందన, అన్యా యాలకు, అక్రమాలను ఎదిరించటం. తిరుగుబాటుతత్వం అతనిలో ఉండేది. ఆనాడు బ్రిటీష్ వారి ఆంక్షలను ఎదిరించి, సియోల్ కోటలో జాతీయజెండా ఎగురవేయటం, అతనిలోని స్వేచ్ఛాకాంక్షకు అద్దం పడుతుంది. ఆ తర్వాత వైద్యుడిగా కొంతకాలం కలకత్తాలో పనిచేసినా, అక్కడి వైద్య సౌకర్యాలపై ప్రశ్నించడంతో బ్రిటీష్ వాళ్లు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. తిరిగి సియోల్‌కోటకు వచ్చినా, లక్నోలో కొంతకాలం పనిచేసినా, వైద్యంతోపాటు, అక్కడ కార్మిక సంఘాల నిర్మాణంలో కూడా పనిచేశారు. అయితే దేశవిభజన సందర్భంగా చెలరేగిన మతోన్మాదాల కారణంగా జరిగిన మారణకాండలో తాను, ఒక సోదరుడు మినహా కుటుంబ సభ్యులంతా చనిపోయారు. ఒక గుర్రపుబండి నడిపే ముస్లిం ఆయనను కాపాడి అక్కడి నుండి తరలించాడు. అందుకే ఆనాటి హిందూ ముస్లిం తగదాలకు, హింసాకాండకు ఘోర హత్యలకు మూలం, పాకిస్తాన్‌లోని ముస్లిం ప్రజలుకానీ, అటు భారతదేశంలోని హిందూ ప్రజలు కానీ ప్రధాన కారకులు కాదని ఆయన చెప్పేవారు. అప్పటికే కమ్యూనిస్టుగా మారిన డా॥ తులి, హైద్రాబాద్‌కు చేరుకున్నారు. హైద్రాబాద్‌లో ఒక క్లినిక్‌ను ఏర్పాటుచేసి పేదలకు వైద్యం చేయటం మొదలేసారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులు, కూలీలు గాయాల పాలవడం, అనారోగ్యానికి గురయిన వాళ్లకు వైద్యం అందించారు. ఇక్కడి నిజాంరాజు నాయకత్వంలో గ్రామాలలో జమీందారులు, జాగీరుదారులు ప్రజలను కాల్చివేయటం, శిక్షలు వేయించడం, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టటం చూసి చలించిపోయారు. శిక్షల నుండి కామ్రేడ్స్‌ను రక్షించడమెలా? అని ఆలోచించి లాయర్లను సంప్రదించి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులకు కావలసిన సమాచారాన్ని సేకరించి తనే స్వయంగా టైపు చేసి వాళ్లకు అందించేవారు. అప్పటికే ఆయనకు కండరాల వ్యాధి కృంగదీస్తూ ఉండేది. అయినా అవేమీ లెక్కచేయకుండా యోధుల ప్రాణాలు కాపాడటానికి చేయగలిగేదేమిటన్న తపనతోనే పనిచేశారు. ఆయన క్లినిక్ ఓ న్యాయపోరాట కేంద్రంగా పని చేసేది. పోరాట వీరులను కాపాడాలన్న ఆలోచనతో ప్రఖ్యాత అంతర్జాతీయ బారిస్టరు డి.ఎన్. ప్రిట్‌ను డిఫెన్స్ కమిటీలోకి తీసుకువచ్చి, కేసులు వాదించడానికి ఏర్పాట్లనూ చూశారు.
తెలంగాణ సాయుధపోరాటానికి మద్దతుగా డాక్టర్లు, లాయర్లు, ముస్లింవర్గ మేధావులతో కూడిన పెద్ద సంఘీభావ సభను హైద్రాబాద్‌లో ఏర్పాటు చేయటంలో డా॥ తులి ప్రధాన భూమికను పోషించారు. డా॥పరాంజపే ప్రధాన భాగస్వామిగా పాల్గొన్నారని, సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం ఆనాడు గుర్తుచేసుకున్నారు. హైద్రాబాద్ నివాసంగా తెలంగాణ ఉద్యమంతో మమేకమయినవాడు డా॥ సత్యపాల్ తులి. కేవలం పార్టీ శ్రేణులకే కాదు, పేద ప్రజలందరికీ వైద్య సేవలందించారు. పేదవాళ్ల డాక్టరుగా పేరుతెచ్చుకున్నారు. పిల్లల, పేదల పట్ల ఎంతో కరుణ ప్రేమతో వ్యవహరించేవారు. వైద్యం, ఇంజెక్షన్‌కు భయపడే పిల్లలు, తులి గారి మాటలతో నిర్భయంగా ఉండేవారని, బాలలనేస్తంగా ప్రసిద్ధి చెందారని, వారి శిష్యురాలు డా॥ శ్యామలాంబ వివరించారు. హాస్యరసాన్ని పండిస్తూ ఎందరినో స్నేహితులుగా పొందారు. 1964లో పార్టీ చీలినపుడు డా॥ తులి సీపీఐ(ఎం) వైపు నిలిచి, మితవాద ధోరణులను నిరసించారు. సైద్ధాంతిక విషయాల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు. కా॥ హరికిషన్ సింగ్ సూర్జిత్‌తో ఎంతో ఆత్మీయమైన సంబంధం ఉండింది. సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, మోటూరు హనుమంత రావుగార్లతో హైద్రాబాద్‌లోని ఆయన క్లీనిక్‌లోనే రాజకీయ చర్చలు చేసేవారు. వైద్య వృత్తి ఎంత నిబద్ధంగా చేశారో, కమ్యూనిస్టు నిబద్ధతను అంతే నిబద్ధంగా కొనసాగించారు.
డా॥తులితో మాట్లాడితే చాలు వ్యాధులు సగం నయమయినట్లు భావించేవారు. వారితో సంభాషించటంతో ఏదో కొత్త చైతన్యం కలిగినట్లు అనిపించేదని ఆనాటి నాయకులు చెప్పారు. మానవత్వానికి మారుపేరుగా, వాత్సల్యానికి, స్నేహానికి, ఉదాత్తతకు, కమ్యూనిస్టు విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు కామ్రేడ్ సత్యపాల్. ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, పేదల, శ్రామికుల బాధలు పోవాలని జీవితాంతమూ తపించిన అరుణ హదయుడు తులి. అనారోగ్యంలో మంచంలోనే కూర్చుని ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆయనను వైద్యానికీ లొంగని వ్యాధులు చుట్టుముట్టడంతో ఒక దశాబ్దకాలం ఒంటరిగా జీవించి చివరికి 1976 మేలో తుదిశ్వాస విడిచారు. ఉద్యమ సహచరుల కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ తులికి నగర కామ్రేడ్స్ ఎంతో ఆప్యాయంగా ఆదరించి సేవలందించారు. హైదరాబాద్‌లోని వేలాదిమంది ప్రజల, పార్టీ కార్యకర్తల ప్రేమనందుకున్న డా. తులి ధన్యమైన జీవితాన్ని గడిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆయన జ్ఞాపకార్థం డా. సత్యపాల్ తులి జీవనధార ఫార్మసీని నడుపుతున్నది. ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, సామాన్య ప్రజల కోసం, వారి విముక్తి కోసం ఆలోచించి, పనిచేయటమే నిజమైన కమ్యూనిస్టు లక్షణం. అది నిండా పుణికిపుచ్కుకున్న డాక్టర్ సత్యపాల్ తులి ఆదర్శప్రాయుడు, అమరుడు. వారు భౌతికంగా మన నుంచి దూరమై 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా వారికివే విప్లవాంజలులు.
కె.ఆనందాచారి, 9948787660

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -