Thursday, May 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమాట తప్పారు..భారం మోపారు!

మాట తప్పారు..భారం మోపారు!

- Advertisement -

“పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవు. దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” – ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలివి. అంతేకాదు, మీడియాలో, టీవీల్లో ధరలు పెరగనున్నాయని వస్తున్న వార్తలతో ఏకంగా ప్రధాని కార్యాలయం నుంచి ఖండిస్తూ ప్రకటన విడుదలైంది. అడపాదడపా కేంద్రమంత్రులు కూడా ఇదే ఊ విషయాన్ని నొక్కి వక్కాణించారు. కానీ, ఎన్నికలు ముగియగానే వారి నిజ స్వరూపం బయటపడింది. ప్రధాని హైదారాబాద్‌‌లో పర్యటించి ప్రజలు “పొదుపు చేయాలి”, ‘‘వనరులను జాగ్రత్తగా వినియోగించాలి’’, ‘‘అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి’’ అనే ఉపన్యాసం వినిపిస్తుండగానే అటు పెట్రో బాంబు ప్రజలపై వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుంది. ఆయన మాటల్లో అంతరార్థన్ని గమనించిన రాజకీయ విశ్లేష కులు ‘దేశానికి ఏదో ఆర్థిక ప్రమాదం ముంచు కొస్తోందని’ ముందే పసిగట్టారు. అనుకున్నట్టుగానే కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ఆరంభించింది. ఈ వారం పదిరోజుల్లోనే వరుసగా నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచింది. ఇది ముమ్మాటికీ దేశ ప్రజల్ని మోసం చేయడమే! ఎనభై పైసల నుంచి రూపాయి వరకు పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పుడు సాధారణ కుటుంబాల బడ్జెట్‌ను ఛిన్నాభిన్నం ‌చేసే పరిస్థితికి చేరాయంటే అతిశయోక్తి కాదు.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇప్పటికే పెట్రోలు ధర రూ.112 చేరుకోగా, డీజిల్ కూడా రూ.వంద దాటింది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఖర్చులు పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఇంధన ధరల పెంపు అంటే కేవలం బైక్‌లో పెట్రోలు పోయించుకునే వారికి మాత్రమే భారం కాదు. అది ప్రతి ఇంటి వంటగదికి, ప్రతి రైతు పొలానికి, ప్రతి కార్మికుడి కడుపుకు ముడిపడిన సమస్య. ఎందుకంటే రవాణా వ్యవస్థ మొత్తానికి డీజిలే ఆధారం. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు-అన్నీ ఇంధనంతోనే నడుస్తాయి. డీజిల్ ధర పెరిగితే కూరగాయల నుంచి బియ్యం వరకు ప్రతి వస్తువు ధర పెరుగు తుంది. గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోంది. విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు అందనంతా ఎత్తుకు చేరాయి. పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న జనానికి ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు’ పెట్రో పిడుగు మరో దెబ్బగానే చెప్పాలి.

ప్రభుత్వం మాత్రం “అంత ర్జాతీయ మార్కెట్ పరిస్థితులు” అంటూ తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వెంటనే ప్రజలపై భారం మోపే కేంద్రం, ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ లాభాన్ని ప్రజలకు ఇవ్వడం లేదు కదా. గతంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు పెంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో ప్రజలకు ఉపశమనం ఇవ్వకుండా ఖజానా నింపుకుంది. ఇప్పుడు మళ్లీ అదే ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోంది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే? ఎన్నికల ముందు ధరలు పెంచ కుండా కృత్రిమంగా నియంత్రించి, ఎన్నికలు ముగిసిన వెంటనే వరుస పెంపు చేయడం అన్యాయం. వాస్తవంగా చూస్తే కేంద్రానికి ప్రజలపై భారం తగ్గించే అవకాశాలు లేకపోలేదు. పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న భారీ ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ధరలు కొంతవరకు నియంత్రణలోకి వస్తాయి. కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఎందుకంటే ఇంధన పన్నులు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ప్రజల కష్టాల కంటే ఖజానా ఆదాయం ముఖ్యమైపోయింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు. సరే, ఇప్పుడు యుద్ధ పరిస్థితి గురించి మాట్లాడు కుందాం. ఇరాన్‌‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ ‌చేస్తున్న యుద్ధంలో మోడీ వైఖరి ఏమిటి? అమెరికాను ఖండించలేదు.

ఇరాన్‌తో భారత్‌కు దశాబ్దాలుగా ఇంధన, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రత్యేక మిత్రబంధం కారణంగా భారత ఇంధన నౌకలకు ఇరాన్ అనేక సడలింపులిచ్చింది. తక్కువ ధరలకు చమురు సరఫరా చేసింది. చెల్లింపుల విషయంలో కూడా భారత్‌కు అనుకూలంగా వ్యవహరించింది. కానీ అమెరికా ఆంక్షల ఒత్తిడికి లోనైన మోడీ ప్రభుత్వం ఇరాన్ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించింది. దీంతో భారత్‌ చౌకైన ఇంధన వనరును కోల్పోయి, ఖరీదైన అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగి, ఆ భారం నేరుగా ప్రజలపై పడుతోంది. విదేశాంగ విధానంలో స్వతంత్ర ధోరణి చూపాల్సిన కేంద్రం, అమెరికా ఒత్తిడికి తలొగ్గడంతో దేశ ఆర్థిక ప్రయోజనాలకే నష్టం వాటిల్లుతోంది. ఈ భారమంతా ఇప్పుడు దేశ ప్రజలు మోయాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రజలడిగే ప్రశ్న ఒక్కటే – ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయి? “ధరలు పెంచం” అన్న హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు? సామాన్యుడి జీవితం ఇంత కష్టంగా మారుతున్నా పాలకులకు కనీస బాధ్యత లేదా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ప్రజల ఆగ్రహమే భవిష్యత్తులో అసలు తీర్పునిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -